ధరదడ!  | India Retail inflation hits two-year high of 6. 09percent in October 2026 | Sakshi
Sakshi News home page

ధరదడ! 

Nov 13 2026 12:45 AM | Updated on Nov 13 2026 12:45 AM

India Retail inflation hits two-year high of 6. 09percent in October 2026

6% దాటేసిన రిటైల్‌ ద్రవ్యోల్బణం 

ఆర్‌బీఐ గరిష్ట పరిమితిని మించి పెరుగుదల 

ఉల్లి, వెల్లుల్లి ఘాటుతో రెండేళ్ల గరిష్టానికి అప్‌ 

వచ్చే నెలలో మళ్లీ వడ్డీ రేట్ల పెంపు!

న్యూఢిల్లీ: ఆహార ధర మంటతో ద్రవ్యోల్బణం సెగలు కక్కుతోంది. రెండేళ్లలో తొలిసారిగా రిజర్వ్‌ బ్యాంకు గరిష్ట పరిమితిని మించి రిటైల్‌ ద్రవ్యోల్బణం దూసుకెళ్లింది. అక్టోబర్‌లో ఏకంగా 6.09 శాతానికి చేరి రెండేళ్ల గరిష్టాన్ని తాకింది. సెప్టెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.54 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఆహార ద్రవ్యోల్బణం 8.94 శాతానికి ఎగబాకడం గమనార్హం. 

సెప్టెంబర్‌లో ఇది 7.74 శాతంగా ఉంది. ఆహారం, పానీయాలు, రెస్టారెంట్‌ సేవలు, రవాణా ధరలే ద్రవ్యోల్బణం భారీగా పెరిగేందుకు కారణమయ్యాయి. ప్రధానంగా ఉల్లి ధరలు 116.22 శాతం, వెల్లుల్లి 60.74 శాతం జంప్‌ చేశాయి. అలాగే, వెండి ఆభరణాలు (52.39 శాతం), అల్లం (48.32 శాతం), నిమ్మ (47.3 శాతం) కూడా టాప్‌–5 ధరల పెరుగుదల వస్తువుల జాబితాలో ఉన్నాయి. ఆహారోత్పత్తులు, సర్వీసులకు సంబంధించిన 12 విభాగాల్లో 11 విభాగాల ధరలు ఎగబాకడం విశేషం. 

మరో విడత వడ్డింపు... 
రిటైల్‌ ద్రవ్యోల్బణం 2–6 శాతం పరిధిలో ఉండాలని ఆర్‌బీఐ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే, 2024 అక్టోబర్‌లో నమోదైన 6.25 శాతం తర్వాత మళ్లీ ఆర్‌బీఐ గరిష్ట పరిమితిని దాటి రిటైల్‌ ధరలు ఎగబాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వచ్చే నెల 2–4 తేదీల్లో ఆర్‌బీఐ కీలక పాలసీ భేటీ జరగనున్న నేపథ్యంలో రిటైల్‌ ధరల సెగతో కచ్చితంగా మరోవిడత రేట్ల పెంపు ఖాయమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అక్టోబర్‌ పాలసీ సమీక్షలో దాదాపు నాలుగేళ్ల తర్వాత  ఆర్‌బీఐ మొట్టమొదటిసారిగా కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచడం తెలిసిందే. దీంతో రెపో రేటు 5.5 శాతానికి చేరింది. 

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా బ్యారెల్‌ క్రూడ్‌ ధర 100 డాలర్ల పైన కొనసాగడం, డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడం వంటివి దీనికి ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే, తాజాగా క్రూడ్‌ ధరలు దిగిరావడం, విదేశీ నిధుల జోరుతో రూపాయి కూడా పుంజుకున్నప్పటికీ... ఎల్‌నినో ప్రభావంతో ఆహార ధరలు అంతకంతకూ ఎగబాకుతున్నాయి. దీంతో వచ్చే పాలసీ సమీక్షలో కచ్చితంగా మళ్లీ పావు శాతం వడ్డీరేట్ల పెంపు ఉండొచ్చనేది విశ్లేషకుల మాట!

మరికొన్నాళ్లు 6% పైనే... 
రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ గరిష్ట పరిమితి పైన కొద్ది నెలలు 6% పైనే కొనసాగవచ్చు. ముఖ్యంగా పాలు, చక్కెర, ఉల్లిపాయలు తదితర ఉత్పత్తులు ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోస్తున్నాయి. ఈ తరుణంలో డిసెంబర్‌లో మరో పావు శాతం రెపో రేటు పెంపు ఖాయం. అయితే,  శాంతించిన క్రూడ్‌ ధరల కదలికలను బట్టి 2027లో వడ్డీరేట్లు మరింత పెంచాలా వద్డా అనేది ఆధారపడి ఉంటుంది. 
    – అదితి నాయర్, ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement