న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మీడియా దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(జీల్) సొంత ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 91 ధరలో రూ. 1 ముఖ విలువగల 6.59 కోట్ల ఈక్విటీ షేర్లు బైబ్యాక్ చేయనుంది. ఇది కంపెనీ చెల్లించిన వాటా మూలధనంలో 6.61 శాతానికి సమానంకాగా.. ఇందుకు రిజర్వ్ నిధుల నుంచి రూ. 600 కోట్లవరకూ వెచ్చించనుంది. బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌ను వినియోగించుకోవాలనుకునే వాటాదారులకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. వాటాదారులకు నిలకడగా విలువను చేకూర్చే లక్ష్యాలతో షేర్ల బైబ్యాక్‌కు తెరతీసినట్లు కంపెనీ పేర్కొంది.
24 శాతం అధిక ధర
గురువారం(12) ముగింపు ధర రూ. 73.5తో పోలిస్తే జీ షేర్ల బైబ్యాక్‌కు 24 శాతం ప్రీమియం నిర్ణయించింది. జీ షేరు ఈ ఏడాది జూన్ 23న రూ. 118 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకగా.. ఈ నెల 4న రూ. 61 దిగువన 52 వారాల కనిష్టాన్ని సైతం చవిచూసింది. ప్రమోటర్లు, సంబంధిత గ్రూప్ సభ్యులు బైబ్యాక్‌లో పాల్గొనబోరని కంపెనీ స్పష్టం చేసింది. టెండర్ మార్గంలో బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు వెల్లడించింది. కంపెనీకున్న వృద్ధి అవకాశాలు, పటిష్ట మూలాలపట్ల తమకున్న విశ్వాసానికి షేర్ల బైబ్యాక్ నిదర్శనమని జీ చైర్మన్ ఆర్.గోపాలన్ పేర్కొన్నారు. కంపెనీ అంతర్గత విలువను ప్రస్తుత మార్కెట్ ధర ప్రతిబింబించడంలేదని, కంపెనీకున్న సామర్థ్యాలు, అవకాశాలను బైబ్యాక్ ప్రతిబింబించనున్నట్లు తెలియజేశారు.
బీఎస్‌ఈలో జీల్ షేరు 3.7 శాతం జంప్‌చేసి రూ. 73.5 వద్ద ముగిసింది.


