ప్రపంచ కుబేరుడు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఫ్లోరిడాలో తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించనున్నారా? ఇప్పటికే మయామిలో సుమారు 237 మిలియన్ డాలర్ల విలువైన నివాస సముదాయాన్ని కలిగి ఉన్న ఆయన, తాజాగా గోల్డెన్ బీచ్‌లో 69.5 మిలియన్ డాలర్ల విలువైన సముద్రతీర భవనాన్ని కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.665 కోట్లకు పైమాటే.
ఫ్లోరిడాలోని మియామి-డేడ్ కౌంటీ పరిధిలో ఉన్న ప్రత్యేకమైన సముద్రతీర ప్రాంతం గోల్డెన్ బీచ్‌లోని 255 ఓషన్ బౌలేవార్డ్ వద్ద ఈ భవనం ఉంది. గత సెప్టెంబర్ నెలలో ఈ ఆస్తి విక్రయం 69.5 మిలియన్ డాలర్లకు పూర్తయినట్లు ప్రాపర్టీ రికార్డులు సూచిస్తున్నాయి. కొనుగోలుదారుగా డెలావేర్‌లో నమోదైన మెరిడియన్ కోస్ట్ ఎల్‌ఎల్‌సీ (Meridian Coast LLC) పేరు కనిపిస్తోంది. అయితే, ఈ సంస్థ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరనేది బహిరంగంగా వెల్లడికాలేదు.
రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన స్థానిక ఏజెంట్లు, ఇతర వర్గాలను ఉటంకిస్తూ ది రియల్ డీల్ ప్రచురించిన కథనంలో ఈ కొనుగోలుతో బెజోస్‌కు సంబంధం ఉండవచ్చని పేర్కొన్నారు. ఫార్చ్యూన్ కూడా అక్టోబర్ 22న ఇదే విషయాన్ని నివేదించింది. అయితే, బెజోస్‌గానీ, ఆయన ప్రతినిధులుగానీ ఈ కొనుగోలుపై అధికారిక ప్రకటన చేయలేదు.
విలాసవంతమైన భవనం
ఈ భవనం విలాసవంతమైన సౌకర్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులోని ముఖ్యమైన వివరాలు ఇవీ..
సుమారు 17,500 చదరపు అడుగుల విస్తీర్ణం
7 బెడ్‌రూమ్‌లు
12 పూర్తి బాత్‌రూమ్‌లు, అదనంగా 2 హాఫ్ బాత్‌రూమ్‌లు
ప్రత్యేక గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్, స్పా
సముద్రతీరానికి అనుసంధానంగా సుమారు 100 అడుగుల వాటర్‌ఫ్రంట్
ఈ భవనం విక్రయ ప్రక్రియలో ధర గణనీయంగా తగ్గింది. 2026 ఫిబ్రవరిలో దీనిని 88.5 మిలియన్ డాలర్లకు మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ధరను 79.5 మిలియన్ డాలర్లకు తగ్గించారు. చివరకు సెప్టెంబర్‌లో 69.5 మిలియన్ డాలర్లకు విక్రయం జరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అంటే తొలుత ప్రకటించిన ధరతో పోలిస్తే 19 మిలియన్ డాలర్లు తక్కువకు ఈ ఒప్పందం పూర్తయింది. ది రియల్ డీల్ కథనం ప్రకారం, గోల్డెన్ బీచ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఇంటి విక్రయాల్లో ఈ ఒప్పందం రికార్డు స్థాయిలో నిలిచింది.
ఇప్పటికే మయామిలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆస్తులు?
బెజోస్ ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించి గతంలోనూ వార్తలు వచ్చాయి. మయామి సమీపంలోని ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో ఆయన మూడు నివాస ఆస్తులను కొనుగోలు చేసేందుకు మొత్తం సుమారు 237 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతాన్ని అత్యంత సంపన్నులు నివసించే ప్రదేశంగా గుర్తింపు పొందిన “బిలియనీర్ బంకర్” అని కూడా పిలుస్తారు.
ఇదీ చదవండి: అంతర్జాతీయ ఐటీ కంపెనీ భారీ ఆఫీస్ లీజు.. రూ.522 కోట్లు!


