అంతర్జాతీయ ఐటీ కంపెనీ భారీ ఆఫీస్‌ లీజు.. రూ.522 కోట్లు! | IBM India Bengaluru Office Lease Rs 522 Crore | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ఐటీ కంపెనీ భారీ ఆఫీస్‌ లీజు.. రూ.522 కోట్లు!

Oct 24 2026 8:34 PM | Updated on Oct 24 2026 8:36 PM

IBM India Bengaluru Office Lease Rs 522 Crore

అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఐబీఎం భారత్‌లో తన కార్యాలయ విస్తరణను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులో 2.83 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. ఈ ఒప్పందంలో సాధారణ అద్దెతో పాటు కార్యాలయాన్ని వినియోగానికి అనుగుణంగా సిద్ధం చేసేందుకు చెల్లించే ఫిట్‌-అవుట్‌ అద్దెను కలిపితే మొత్తం వ్యయం సుమారు రూ.522 కోట్లకు చేరనుంది. కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఏజెన్సీ ప్రాప్‌స్టాక్‌కు లభించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో ఈ లావాదేవీ వివరాలు వెల్లడయ్యాయి.

బెంగళూరులోని బాగ్మానే సోలేరియం సిటీ ఐటీ పార్కులో ఉన్న రాడాన్‌ టవర్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మొదటి, రెండో, మూడో అంతస్తులను ఐబీఎం లీజుకు తీసుకుంది. ఈ స్థలానికి చదరపు అడుగుకు నెలకు రూ.88 చొప్పున అద్దె చెల్లించనుంది. దీంతో నెలవారీ అద్దె సుమారు రూ.2.49 కోట్లుగా ఉంటుంది. ప్రతి మూడేళ్లకు అద్దెను 15 శాతం పెంచేలా ఒప్పందం కుదిరింది. భవన యజమాని ఆకృతి ఇన్‌ఫ్రా-బిల్డ్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఐబీఎం రూ.14.96 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించింది.

ఫిట్‌-అవుట్‌ ఖర్చులే రూ.179 కోట్లు

కార్యాలయ స్థలానికి చెల్లించే సాధారణ అద్దెకు అదనంగా, అంతర్గత ఏర్పాట్లు, కార్యాలయ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిట్‌-అవుట్‌ అద్దె కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. ఇందుకోసం ఐబీఎం నెలకు సుమారు రూ.2.98 కోట్లు చెల్లించనుంది. ఈ చెల్లింపులు మార్చి 2031 వరకు ఐదేళ్లపాటు కొనసాగనున్నాయి. ఈ కాలానికి ఫిట్‌-అవుట్‌ అద్దె వ్యయం దాదాపు రూ.179 కోట్లుగా అంచనా వేశారు. ఈ లీజు కాలం 2026 ఫిబ్రవరి 5న ప్రారంభమైనట్లు పత్రాలు సూచిస్తున్నాయి. ఒప్పంద పత్రాలపై మే 29, 2026న సంతకాలు చేయగా, అక్టోబర్‌ 1న రిజిస్ట్రేషన్‌ పూర్తయింది.

బెంగళూరు ఒప్పందానికి ముందు, 2026 జనవరిలో ఐబీఎం గురుగ్రామ్‌లో 2.30 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పదేళ్లకు లీజుకు తీసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలోనూ ఐబీఎంకు కార్యాలయ కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో దివ్యశ్రీ ఓరియన్‌ క్యాంపస్‌లో రెండు అంతస్తుల్లో విస్తరించిన 1.06 లక్షల చదరపు అడుగుల స్థలానికి రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మిడాస్‌ ప్రాజెక్ట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 26 ఎకరాల క్యాంపస్‌లోని స్థలానికి చదరపు అడుగుకు నెలకు రూ.66 చొప్పున అద్దె నిర్ణయించినట్లు అప్పటి ఆస్తి రిజిస్ట్రేషన్‌ వివరాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement