దీపావళికి  ‘లక్ష్మీ కటాక్షం’...  | save money on Diwali shopping | Sakshi
Sakshi News home page

దీపావళికి  ‘లక్ష్మీ కటాక్షం’... 

Nov 6 2026 4:43 AM | Updated on Nov 6 2026 4:43 AM

save money on Diwali shopping

పండగ

పండుగ వచ్చిందంటే ఆఫర్ల వెల్లువ. నో–కాస్ట్‌ ఈఎంఐల హడావుడి. పత్రికల్లో టీవీల్లో ఫోన్‌లో చాలా యాడ్స్‌ మనసులాగుతుంటాయి. అవి అవసరమే అనిపిస్తాయి.
ఇక్కడే కాస్త సంయమనం పాటించాలి. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడం అంటే ఖర్చులు పెంచుకోవడం కాదు అవసరం లేని ఖర్చులు చేయకపోవడం కూడా. ఈ సీజన్‌లో ఆనందాలు, మిఠాయిలు,క్రాకర్లు ఉండాలి. పండగ అయ్యాక వెంటబడే క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీలు కాదు. ఇలా చేద్దాం.

యాడ్స్‌ భలే చేస్తారు మనవాళ్లు. కళకళగా ఉంటాయి. ధగధగగా ఉంటాయి. తియ్య తియ్యగా ఉంటాయి. రంగు రంగుగా ఉంటాయి. అందరికీ మన డబ్బులు కావాలి. ఆ వస్తువులు మన ఇంటికి చేరాలి. పండగ అన్నాక అవీ ఇవీ కొనాలని మనకూ ఉంటుంది. కాని ఎవరో హీరో ఉన్నప్పుడు చుట్టూ అన్నీ చేరితే కన్ఫ్యూజన్‌లో ఏది కొంటామో మనకే తెలియదు. అందుకే  ‘ఇప్పుడే కొనండి, వచ్చే ఏడాది కట్టండి’ అనే మాటల నుంచి దూరంగా ఉండాలి. పండగ ఉత్సాహంలో మనం చేసే పొరపాట్లు పండుగ వెళ్ళాక నెలాఖరు జీతం కోసం వెతుక్కునేలా చేయకూడదు.

ఆఫర్ల ఉచ్చు
పండుగ సీజన్ లో ప్రతి ఈ–కామర్స్‌ సైట్‌ ‘బిగ్‌ సేల్స్‌’ అంటూ గేట్లు తెరుస్తుంది.  50 వేల ఫోన్‌ నో కాస్ట్‌ ఈఎంఐలో నెలకు కేవలం 4 వేలకే వస్తుందనగానే మన మనసు లాగుతుంది. కానీ అది నిజంగా నోకాస్టా? ప్రాసెసింగ్‌ ఫీజులు, జీఎస్‌టీ, హిడెన్‌ ఛార్జీలు అన్నీ కలిపి మన జేబును ఖాళీ చేస్తాయి. ఆర్బీఐ నివేదికల ప్రకార, పండుగల సీజన్ లోనే దేశంలో కన్సూ్యమర్‌ లోన్లు, క్రెడిట్‌ కార్డ్‌ బాకీలు గరిష్ట స్థాయికి చేరుతాయి. 

కొనాలనే తపన  మనల్ని ’ఎమోషనల్‌ షాపింగ్‌ ట్రాప్‌’లో పడేస్తుంది. ఇంట్లో పాత టీవీ బాగానే ఉన్నా, పక్కింటి వాళ్లు కొన్నారని కొత్తది అప్పు చేసి కొనడం అవసరమా అని ఆలోచించడమే లక్ష్మీ కటాక్షానికి మొదటి అడుగు. ఇక క్రాకర్స్‌ ఖర్చు. సరదాగా కాల్చే క్రాకర్స్‌ కొనాల్సిందే. కాని ప్రతాపం చూపడానికి పదివేలు ఇరవై వేలు వెచ్చించి కొనే హంగామా అవసరమా? ‘అబ్బో.. ఎన్ని కాల్చారో’ అనిపించుకోవడం కన్నా ‘ఎంత ఆదా చేశారో’ అనిపించుకోవడమే గొప్ప.

బడ్జెట్‌ హద్దులు
చాలా మంది ఉద్యోగులకు దీపావళికి వచ్చే బోనస్‌ ఒక అదనపు అదృష్టంలా అనిపిస్తుంది. రాగానే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అని ΄్లాన్‌ చేస్తారు. కాని తెలివైన వాళ్లు చేసే పని వేరు. వచ్చే బోనస్‌ మొత్తంలో కేవలం 30 శాతం మాత్రమే పండుగ ఖర్చులకు, బట్టలకు, స్వీట్లకు కేటాయించాలి. మిగిలిన 70 శాతాన్ని ముందే ఉన్న చిన్నపాటి అప్పులు తీర్చడానికో లేదా ఎమర్జెన్సీ ఫండ్‌ను పెంచడానికో వాడాలి. షాపింగ్‌కు వెళ్లే ముందే ఏది ‘కావాలి’, ఏది ’కచ్చితంగా అవసరం’ అనే స్పష్టమైన లిస్ట్‌ రాసుకోవాలి. లిస్ట్‌లో లేని వస్తువు ఎంత తక్కువకు వస్తున్నా సరే మొండిగా దాటవేయడమే అసలైన ఆర్థిక విజయం.

ఖర్చు కాదు పెట్టుబడి!
దీపావళి, ధనత్రయోదశి అనగానే లక్ష్మీదేవి రూపంలో బంగారం కొనడం మన సాంప్రదాయం. అయితే ఫిజికల్‌ గోల్డ్‌ (నగలు) కొనేటప్పుడు మనం ఇచ్చే తరుగు, మజూరీలు  దాదాపు 10 నుండి 15 శాతం వరకు నష్టాన్ని తెస్తాయి. దీనికి బదులుగా ఈ దీపావళికి డిజిటల్‌ గోల్డ్, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు  లేదా సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల  వైపు అడుగులు వేయడం మంచి అవగాహన. ఇవి మనకు స్వచ్ఛమైన రిటర్న్స్‌ ఇవ్వడమే కాకుండా దొంగల భయం లేని సురక్షితమైన పెట్టుబడిగా మారుతాయి. లక్ష్మీదేవిని పూజించడం అంటే సంపదను హారతి ఇవ్వడం కాదు దాన్ని సరైన మార్గంలో వృద్ధి చేయడం.

దీపావళి ఒకరోజు జరుపుకునే సంబరం. జీవితం 365 రోజుల ప్రయాణం. ఒక్క రోజు ఆడంబరం కోసం  ఏడాది కాలమంతా ఈఎంఐల బారిన పడటం వివేకం అనిపించుకోదు. అప్పుల్లేని ప్రశాంతత జీవితాంతం వెలుగునిస్తుంది. ఈ దీపావళికి మీ ఖర్చులపై మీరే ఒక లక్ష్మణ రేఖ గీయండి. గుర్తుంచుకోండి, మీ ఇల్లు ఆనందాల దివ్వెలా వెలగాలి అంటే ఆ దివ్వెలో క్రమశిక్షణ అనే నూనె ఉండాలి. అందరికీ సుఖసంతోషాల దీపావళి శుభాకాంక్షలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement