బిహార్‌లోని గయా జిల్లా మహాబోధి ఆలయం వద్ద జరిగిన ఒక అత్యంత భావోద్వేగపూరితమైన సంఘటన పలువురి హృదయాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. అవసరంలో ఉన్నవారి పట్ల దయ చూపడం, బౌద్ధ సన్యాసులను గౌరవించడం, నిస్వార్ధ సేవ బుద్ధుని బోధనల సారాంశం. ప్రతి ఒక్కరి జీవితం ఆనందం, శాంతి దయతో నిండి ఉండాలని బుద్దుని ఆరాధకులునమ్ముతారు. కానీ మహాబోధి ఆలయ సమీపంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 57 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 3.6 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.
రోడ్డు పక్కన కూర్చున్న ఒక దివ్యాంగుడైన యాచకుడు, ఆ దారిలో పాత్రలు పట్టుకుని వెళ్తున్న ఒక థాయ్ బౌద్ధ సన్యాసికి తన జేబులో ఉన్న కొన్ని నాణేలను, తన వద్ద ఉన్న ఆహారాన్ని భిక్షగా సన్యాసి భిక్షా పాత్రలో వేశాడు. అంతేకాదు దానం చేసిన అనంతరం ఆ యాచకుడు తన టోపీ తీసి సన్యాసి కాళ్లకు నమస్కరించి గౌరవించాడు. దీంతో బౌద్ధ సన్యాసి ముగ్దుడై, నీళ్ల బాటిల్, బిస్కెట్ ప్యాకెట్లుతోపాటు కొన్ని డబ్బులను తిరిగి అందించి, అతని తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు.
ఇదీ చదవండి: రూ. 20 కచోరి తిందామని ఆగితే.. రూ. 20 లక్షలు మాయం!
బోధి ఫౌండేషన్ స్పందన
మానవత్వమే గొప్ప మతం. అవసరంలో ఉన్నవారికి దయతో సహాయం చేయడాన్నిమించిన దైవ సేవ మరొకటి ఉండదు అంటూ బోధి ఫౌండేషన్‌కు చెందిన రాకేష్ ఈ వీడియోను షేర్ చేస్తూ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: జిమ్ ట్రైనర్‌తో లవ్.. భర్తపై హత్యాయత్నం : కట్ చేస్తే..!
నెటిజన్ల స్పందన
ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు. "రెండో ఆలోచన లేకుండా తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసిన ఆ దివ్యాంగుడిని అభినందిస్తున్నాను .అలా అతను తాను ఎంత గొప్పవాడో చాటుకున్నాడు." అని ఒకరు, డబ్బుతో సంబంధం లేదు, దానం చేయడానికి గొప్ప మనసు ఉండాలి, అని కొందరు, "ఆస్తిపరంగా కాకపోయినా మానవత్వంలో అతనే ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడు" అని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు.


