ఆఫర్.. అంటే చాలు.. అవసరం ఉందా లేదా అనే మరో ఆలోచన లేకుండానే కొనేస్తాం. పైగా డబ్బు ఆదా చేశామని సంబర పడిపోతాం. కానీ ఆ వస్తువు ఇంటికొచ్చిన రెండు రోజులకే పాడయిపోతే.. మళ్లీ కొనాల్సివస్తే? అప్పుడు తెలిసొస్తుంది.. తక్కువ ధరకు కొన్నామని కాదు, తెలివిగా కొన్నామా లేదా అన్నదే ముఖ్యమని. షాపింగ్లో అసలైన పొదుపు అంటే తక్కువ డబ్బు ఖర్చు చేయడం మాత్రమే కాదు.. పెట్టిన ప్రతి రూపాయికీ తగిన ప్రయోజనం పొందడం. మరి ఏ వస్తువుపై ఎక్కువ ఖర్చు చేయాలి? ఎక్కడ డబ్బు ఆదా చేయాలి? కొనేపుడు మనల్ని మోసం చేసే ఆఫర్ల మాయాజాలం నుంచి ఎలా బయటపడాలి?
షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ మంది ముందుగా చూసేది.. ఆ వస్తువుపై ఆఫర్ ఉందా లేదా అనేదే. అదే కొన్నిసార్లు మనకు లాభం కన్నా నష్టాన్నే మిగులుస్తుంది. అయితే ఎక్కువ రేటు ఉన్నవే మంచివని కాదు. కొన్నిసార్లు బ్రాండ్, అందమైన ప్యాకింగ్ కోసం కూడా అదనంగా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ధరను మాత్రమే చూడకుండా ఆ వస్తువు క్వాలిటీ, ఉపయోగం వంటి అంశాలను కూడా పరిశీలించి కొనాలి.
ఖరీదైనవే కొనక్కర్లేదు!
అయితే ప్రతిసారీ ఎక్కువ ధర పెట్టి వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. కొన్ని వస్తువులకు తక్కువ ఖర్చు చేయడమే తెలివైన నిర్ణయం. ఉదాహరణకు.. ఒకటిరెండుసార్లు ఉపయోగించాక కొన్ని వస్తువులను పక్కన పెట్టేస్తాం. అలాంటి వాటి కోసం ఎక్కువ డబ్బు పెట్టాల్సిన పనిలేదు. అలాగే ఏదయినా కొత్తగా నేర్చుకునేపుడు.. దానికి సంబంధించిన ఖరీదైన టూల్స్ని కొనాల్సిన పనిలేదు. ముందుగా తక్కువ ధరలో లభించే వాటితో ప్రయత్నించడమే మంచిది. అంటే వస్తువు ధర ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? అన్నదానికంటే మనకు ఆ వస్తువు అవసరం ఎంత. ఎంతకాలం ఉపయోగిస్తం.. అన్నదే ముఖ్యం.
ఇదీ చదవండి: చూపు లేదు... కాని నేర్పు ఉంది...!
తరచూ మార్చే వస్తువులపై తక్కువ ఖర్చు చేయడం సమంజసమే. కానీ రోజూ ఉపయోగించే వస్తువుల విషయంలో నాణ్యతకు ప్రాధాన్యమివ్వడం మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ వంటివి కొనేటప్పుడు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే.. ఖరీదైన ప్రతి వస్తువూ ఎక్కువకాలం వస్తుందని కాదు.. కాబట్టి ఆ వస్తువు క్వాలిటీ, తయారీ వంటి అంశాలను పూర్తిగా తెలుసుకున్న తరువాతే కొనుగోలు చేయాలి.
స్మార్ట్ షాపింగ్ అంటే ఎప్పుడూ తక్కువ ధరకు ఎక్కువ వస్తువులను కొనడం కాదు. పెట్టిన ప్రతి రూపాయికీ తగిన ప్రయోజనం ΄ పొందడం. కొన్ని సందర్భాల్లో రూ.300 వస్తువు సరైన ఎంపిక కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో రూ.3,000 పెట్టడం మంచిది కావచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో ఏ వస్తువూ కొనకుండా ఉండటమే ఉత్తమ నిర్ణయం కావచ్చు. ఎందుకంటే.. చౌక వస్తువుకు మనం చెల్లించే ధర ముఖ్యం. మంచి విలువ ఉన్న వస్తువు మనకు ఇచ్చే ప్రయోజనం మరింత ముఖ్యం.


