AIతో ఉద్యోగాలకు ముప్పు.. కానీ వీరు మాత్రం సేఫ్! | AI Impact On Jobs, Ford CEO Jim Farley Explains Which Professions May Survive And Which Jobs Could Face Major Changes | Sakshi
Sakshi News home page

AIతో ఉద్యోగాలకు ముప్పు.. కానీ వీరు మాత్రం సేఫ్!

Oct 3 2026 4:27 PM | Updated on Oct 3 2026 5:04 PM

Ford CEO Jim Farley Says About Jobs and Artificial Intelligence

ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) గురించే చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల చాలా పనులు సులభం జరిగిపోతున్నాయి. అదే సమయంలో కొన్ని ఉద్యోగాలు భవిష్యత్తులో కనుమరుగవుతాయనే ఆందోళన కూడా నెలకొంది. అయితే.. ప్రతి ఉద్యోగంపైనా ఏఐ ప్రభావం ఒకేలా ఉండదని ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లీ చెబుతున్నారు.

సహాయకారిగా ఏఐ
ఎలక్ట్రీషియన్లు, మెకానిక్స్, టెక్నీషియన్లు, ఫ్యాక్టరీల్లో పనిచేసే నైపుణ్యం ఉన్న కార్మికుల వంటి ఉద్యోగాలను ఏఐ వెంటనే భర్తీ చేయడం అంత సులభం కాదని జిమ్ ఫార్లీ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యోగాల్లో ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేయడం కంటే.. వారికి సహాయపడే సాధనంగా మారే అవకాశం ఉందని అన్నారు.

ఈ ఉద్యోగాలపై ఎఫెక్ట్
కంప్యూటర్ ముందు కూర్చొని ఒకే రకమైన పనులను, పదే పదే చేసే కొన్ని ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఫార్లీ పేర్కొన్నారు. ఫైనాన్స్‌లో స్ప్రెడ్‌షీట్లపై చేసే కొన్ని పనులు, కాల్ సెంటర్ ఉద్యోగాలు, ఎంట్రీ లెవల్ ప్రోగ్రామింగ్ వంటి ఉద్యోగాల్లో ఏఐ వల్ల ఊహకందని మార్పు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఫోర్డ్ ఫ్యాక్టరీల్లో మార్పులు ఇప్పటికే కనిపిస్తున్నాయని.. కంపెనీలో 10,000 మందికి పైగా స్కిల్డ్ ట్రేడ్స్ వర్కర్స్ ఉన్నారు. వీరిలో చాలామంది గతంలో యంత్రాల మెయింటెనెన్స్ వంటి పనులు చేసేవారు. ఇప్పుడు.. రోబోట్లు, ఆటోమేటెడ్ మెషీన్లు, డిజిటల్ తయారీ వ్యవస్థలతో కూడా పనిచేస్తున్నారు.

కొత్త ఫ్యాక్టరీల్లో కొంతమంది కార్మికులు రోబోటిక్ సిస్టమ్స్‌ను నిర్వహించడం, బ్యాటరీ తయారీ పరికరాల్లో సమస్యలను గుర్తించడం, డిజిటల్ ప్రొడక్షన్ సిస్టమ్స్‌తో పనిచేయడం వంటి పనులు చేస్తున్నారు.

పనిలో భాగమవుతున్న టెక్నాలజీ
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇంజనీర్ చేసే పని, టెక్నీషియన్ చేసే పని మధ్య ఉన్న తేడా కూడా తగ్గుతోందని ఫార్లీ చెప్పారు. గతంలో టెక్నీషియన్ అంటే.. ప్రధానంగా యంత్రాలను రిపేర్ చేసే వ్యక్తిగా మాత్రమే భావించేవారు. కానీ.. ఇప్పుడు రోబోటిక్స్, సాఫ్ట్‌వేర్, ఆటోమేషన్ వంటి టెక్నాలజీలు కూడా వారి పనిలో భాగమవుతున్నాయి.

అందుకే.. భవిష్యత్తులో ఈ రంగంలో పనిచేయాలనుకునేవారు కేవలం చేతిపనిలో నైపుణ్యం ఉంటే సరిపోదు. కొత్త టెక్నాలజీలను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది.

ఏఐని కంపెనీలు ఎలా ఉపయోగిస్తున్నాయనేది కూడా చాలా ముఖ్యమని ఫార్లీ చెప్పారు. ఏఐ ద్వారా ఉద్యోగుల పనికి సంబంధించిన డేటాను సేకరిస్తే, ఆ డేటాను తమపై నిఘా పెట్టడానికి లేదా ఉద్యోగాలను తగ్గించడానికి ఉపయోగిస్తారేమోనని కార్మికులు భయపడే అవకాశం ఉంది. అందుకే.. ఏఐని ఉద్యోగులకు ముప్పుగా కాకుండా, వారి పనిని సులభతరం చేసే సాధనంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఇండియాలో పైలట్ జీతాలు ఎంతో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement