‘మీ పిల్లాడి క్రమశిక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దు’ | Ajinkya Rahane Advice to Vaibhav Sooryavanshi: Keep 15-Year-Old Star Disciplined | Sakshi
Sakshi News home page

‘మీ పిల్లాడి క్రమశిక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దు’

Aug 6 2026 6:44 PM | Updated on Aug 6 2026 6:48 PM

Rahane tells Vaibhav Sooryavanshi family to keep their kid disciplined

PC: Instagram

క్రికెట్‌ ప్రపంచంలోకి దూసుకువచ్చిన నయా సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఫార్మాట్లకు అతీతంగా అదరగొట్టాడు. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫున దుమ్ములేపిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. వరల్డ్‌కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన వైభవ్‌.. ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా ఏకంగా ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో పదిహేనేళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 

ఇంగ్లండ్‌ గడ్డపై
తద్వారా అత్యంత చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా దిగ్గజ సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లండ్‌ గడ్డపై తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడిన వైభవ్‌ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్‌లలో (13,15,14) విఫలమయ్యాడు. 

అయితే, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో మాత్రం రెండు అర్ధ శతకాలతో రాణించాడు. టీమిండియా జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.

వైభవ్‌ కుటుంబానికి కీలక సూచనలు
ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. ప్రపంచ క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి ఆట గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ అజింక్య రహానే వైభవ్‌ సూర్యవంశీ కుటుంబానికి కీలక సూచనలు చేశాడు.

ఇంగ్లండ్‌ మాజీ స్టార్లు మైకేల్‌ వాన్‌, అలిస్టర్‌ కుక్‌, డేవిడ్‌ లాయిడ్‌, ఫిల్‌ టఫ్నిల్‌తో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సమయంలోనే వైభవ్‌కు సరైన మార్గదర్శనం అవసరం. అతడి కుటుంబం మాత్రమే ఇది చేయగలదు.

ప్రస్తుతం అతడికి ఏది అత్యంత ముఖ్యమో అతడి కుటుంబమే చెప్పాలి. అతడి కోసం షెడ్యూల్‌, ప్రణాళికలను రచించాలి. ముఖ్యంగా చిన్న వయసులోనే వచ్చిన కీర్తిప్రతిష్టలు చూసి అతడు పక్కదారి పట్టకుండా కాపాడుకోవాలి.

క్రమశిక్షణ ముఖ్యం
జట్టుతో పాటు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నో కొత్త పరిచయాలు అవుతాయి. వాటిని ఎలా హ్యాండిల్‌ చేయాలో అతడికి చెప్పాలి. కుటుంబమే అతడి బలం. వచ్చే ఐదు, పదేళ్లలో వైభవ్‌ను వారెంత క్రమశిక్షణగా ఉంచుతారో అదే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అని రహానే పేర్కొన్నాడు. 

కాగా వైభవ్‌ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలకు అతడితో పాటు తల్లిదండ్రులను కూడా అనుమతించింది. వైభవ్‌ వయసు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. 

చదవండి:  ధోని గది తలుపు ఒక్కసారి మూతపడితే అంతే ఇక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement