న్యూఢిల్లీ: హరియాణా రాష్ట్రంలో సాధారణ కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ న్యాయవాదిగా, న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం సేవలందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్నాయమూర్తిగా అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. పలు కీలకమైన తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. రాష్ట్రాల శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియజేసే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అధికారం కోర్టులకు లేదని ఇటీవలే సంచలనాత్మక తీర్పునిచ్చారు.
ఆర్టీకల్ 370 రద్దు, బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్), పెగాసస్ స్పైవేర్, పౌరసత్వ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలపై జస్టిస్ సూర్యకాంత్ తీర్పులు వెలువరించారు. బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేశారు. సైనిక దళాల్లో ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ పథకాన్ని సమర్థించారు. పలు సందర్భాల్లో అవినీతికి వ్యతిరేకంగా గళం వినిపించారు. సీజేఐగా ఆయన 2027 ఫిబ్రవరి 9వ తేదీ దాకా పదవిలో కొనసాగుతారు. దాదాపు 15 నెలలపాటు అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పని చేయబోతున్నారు.
→ జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిసార్ జిల్లాలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జని్మంచారు. జస్టిస్ సూర్యకాంత్ తండ్రి మదన్‌గోపాల్ శర్మ సంస్కృత ఉపాధ్యాయుడిగా పని చేశారు.
→ 1981లో హిసార్‌లోని ప్రభుత్వ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.
→ 1984లో మహారిషి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు.
→ 1984లో హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.
→ 1985లో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టులో లాయర్‌గా చేరారు.
→ రాజ్యాంగం, సేవలు, సివిల్ వ్యవహారాల్లో నిష్ణాతుడైన న్యాయవాదిగా పేరు సంపాదించారు.
→ పలు యూనివర్సిటీలు, బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల తరఫున కోర్టులో వాదించారు. హైకోర్టు తరఫున వాదించిన సందర్భాలూ ఉన్నాయి.
→ 2000 జూలై 7న చిన్న వయసులోనే హరియాణా అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.
→ 2001 మార్చిలో సీనియర్ లాయర్‌గా మారారు.
→ 2004 జనవరి 9న పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
→ 2007 ఫిబ్రవరి నుంచి 2011 ఫిబ్రవరి దాకా నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ సభ్యుడిగా పనిచేశారు.
→ 2011 కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో దూరవిద్య విధానంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
→ 2018 అక్టోబర్ 5న హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
→ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2024 నవంబర్ 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సరీ్వసెస్ కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టులో 300కుపైగా ధర్మాసనాల్లో సభ్యుడిగా వ్యవహరించారు.
→ హరియాణా నుంచి సీజేఐగా ఎదిగిన మొట్టమొదటి వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డుకెక్కారు.


