నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ : కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల గురించి అర్జీల ద్వారా విన్నవించవచ్చని తెలిపారు.
అరటి తోటలో కొండచిలువ
పుట్లూరు: కుమ్మనమల సమీపంలోని అరటి తోటలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. అంకన్న అనే రైతు తన అరటి తోట వద్దకు వెళ్లిన సమయంలో ఎనిమిది అడుగులకు పైగా ఉన్న కొండ చిలువ ఏదో జంతువును మింగేసి కదలలేని స్థితిలో కనిపించింది. వెంటనే ఆయన తోటి రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కాసేపటికి అక్కడకు చేరుకున్న రైతులు అరటి తోటల్లో ఇలాంటి కొండచిలువ ఉంటే ప్రమాదమని భావించి అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారులు వచ్చి కొండ చిలువను పట్టుకుని సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలేశారు.
నేడు డయల్ యువర్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు నేరుగా 89777 16661 నంబర్‌కు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు ఫోన్ చేయాలని సూచించారు.
ఇంధన పొదుపులో..
గుంతకల్లు రైల్వేకు అవార్డులు
గుంతకల్లు: ఇంధన పొదుపులో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు జాతీయస్థాయి పురస్కారాలు లభించాయి. గుంతకల్లులోని డీజిల్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రంతోపాటు వసతి గృహం, డివిజన్ పరిధిలోని రాయచూర్ రైల్వేస్టేషన్ విద్యుత్‌ను ఆదా చేసి జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆదివారం జరిగిన బహుతుల పంపిణీ కార్యక్రమంలో ‘2025 నేషనల్ ఎనర్జీ కన్వర్షన్’ అవార్డును డీజిల్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రం, వసతి గృహం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ్ రాష్ట్రపతి దౌప్రదిముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. రాయచూర్ రైల్వేస్టేషన్ ‘ఉత్తమ ఇంధన పొదుపు రైల్వేస్టేషన్’ అవార్డును కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ చేతుల మీదుగా డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ శ్రీనిబాష్ సంయుక్తంగా అందుకున్నారు. షీల్డ్‌తోపాటు రూ.10 లక్షల నగదు పురస్కారం అందజేసినట్లు వారు తెలిపారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
పెద్దపప్పూరు: పొలాన్ని దౌర్జన్యంగా ట్రాక్టర్‌తో చదను చేయించడంతో మనస్తాపానికి గురైన రైతు స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లికి చెందిన రైతు అశిత్తుకు భార్య, కుమార్తె ఉన్నారు. తమకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా ఆ పొలంపై సొంత తమ్ముడు పెద్ద కుళ్లాయిస్వామి కన్నేసి, దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేపట్టాడు. ఈ క్రమంలోనే పొలాన్ని ఆదివారం ట్రాక్టర్‌తో దున్నించడంతో మనోవేదనకు లోనైన అశిత్తు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని, తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగబోతుండగా పోలీసులు వెంటనే అడ్డుకుని పురుగు మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. పెద్దకుళ్లాయి స్వామి, అతని కుమారుడు నందపై కేసు నమోదు చేసి, సోమవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయనున్నట్లు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.
నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’


