చలి పంజాతో గజగజ
● మడకశిరలో 8.2 డిగ్రీలు,
శెట్టూరులో 10.1 డిగ్రీలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత పెరిగిపోయింది. ఈ నెల 8న ఎన్నడూ లేనంతగా పొగమంచు పూర్తిగా కమ్మేసింది. క్రమంగా పొగమంచు తగ్గినా.. చలి మాత్రం పంజా విసురుతోంది. రోజురోజుకూ చలితీవ్రత పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలవుతోంది. శీతల గాలులలో మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం కనిపిస్తోంది. ఆదివారం మడకశిర మండలంలో 8.2 డిగ్రీలు, శెట్టూరులో కూడా 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో కనిష్టం 9 నుంచి17 డిగ్రీలు, గరిష్టం 27 నుంచి 32 డిగ్రీలు రికార్డయ్యాయి. ప్రధానంగా మడకశిర, హిందూపురం, పెనుకొండ, ఉరవకొండ, శింగనమల ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల అటు మనుషులు, ఇటు జంతుజాలం, పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూడు రోజుల కిందటితో పోల్చితే గాలి నాణ్యత కొంత మెరుగ్గా ఉన్నా అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితిలోనే ఉన్నట్లు తెలిపారు.
చలి పంజాతో గజగజ


