పంటల బీమా ఉన్నట్టా... లేనట్టా..?
అనంతపురం అగ్రికల్చర్: రబీ పంటల బీమా పథకాలకు ప్రీమియం చెల్లింపు గడువు సోమవారంతో ముగియనుంది. అయితే ఇంత వరకూ పంటల బీమా అమలు గురించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో అసలు పథకం ఉందా లేదా అన్నది తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి, పప్పు శనగకు వర్తింపజేశారు. జనరలీ సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో అమలు కానున్న బీమా పథకంలో వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పప్పుశనగ ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఖరారు చేయగా.. అందులో రైతులు తమ వాటా కింద రూ.450 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. వేరుశనగ ఎకరాకు రూ.32 వేలు కాగా ప్రీమియం రూ.480 ప్రకారం, జొన్నకు రూ.21 వేలు కాగా ప్రీమియం రూ.315, మొక్కజొన్నకు రూ.35 వేలు కాగా ప్రీమియం రూ.525, వరికి రూ.42 వేలు కాగా ప్రీమియం రూ.630 ప్రకారం చెల్లించాలి. వరికి ఈ నెలాఖరు వరకు గడువు ఉండగా.. మిగతా పంటలకు ఈ నెల 15లోపు ప్రీమియం గడువు విధించారు. అయితే ప్రీమియం చెల్లించడానికి రైతులు సిద్ధంగా ఉన్నా... చంద్రబాబు ప్రభుత్వం, వ్యవసాయశాఖ బీమా పథకాలు, ప్రీమియం చెల్లింపు అంశాల గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. పంటల బీమా పథకాల అమలు, ప్రీమియం చెల్లింపు, పరిహారం విడుదల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించకపోవడంతో రెండేళ్లుగా అస్తవ్యస్తంగా మారినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అతికించిన బీమా పోస్టర్లు దిష్టిబొమ్మలుగా కనిపిస్తున్నాయి.
నేటితో ముగియనున్న పంటల
బీమా ప్రీమియం గడువు
పథకం అమలుపై నోరు మెదపని
ప్రభుత్వం, వ్యవసాయశాఖ


