మహోద్యమంలా ప్రజా ఉద్యమం
అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం మహోద్యమంగా మారింది. విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజాసంఘాలు సహా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సర్కారు తీరుపై నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు నిర్వహించాలని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు అధునాతన వైద్య సేవలందించాలని నినదించారు. రెండు నెలలుగా సాగిన సంతకాల సేకరణ జిల్లాలో విజయవంతమైంది. ఊరూవాడా సాగిన కోటి సంతకాల ‘సమరం’ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో సంతకాల సేకరణకు జేసీ వర్గీయులు అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్‌సీపీ నాయకులు వెరవకుండా కార్యక్రమం పూర్తి చేశారు. నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాల ప్రతులను వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి చేర్చారు. జిల్లా అంతటా 4,55,840 సంతకాలు సేకరించారు. ఈ నెల 18న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్‌కు అందించనున్నారు.
నేడు భారీ బైక్ ర్యాలీ..
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఫ్లై ఓవర్, టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, ఐరన్ బ్రిడ్జి, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, పాతూరు గాంధీ విగ్రహం, చెరువు కట్ట మీదుగా బుక్కరాయసముద్రంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై భగ్గుమన్న ప్రజలు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
కోటి సంతకాల సేకరణ
జిల్లాలో విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజల మద్దతు
జిల్లా వ్యాప్తంగా 4.55 లక్షల
సంతకాల సేకరణ పూర్తి
నేడు అనంతపురంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
మహోద్యమంలా ప్రజా ఉద్యమం


