వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న పాలకులు
అనంతపురం: ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను పాలకులు హరిస్తున్నారని, చివరకు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి తిండి తినాలి అనే అంశాలను కూడా పాలకులు నిర్ణయిస్తున్నారని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు విమర్శించారు. అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.గురుప్రసాద్ అధ్యక్షతన జన విజ్ఞాన వేదిక, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సంయుక్తంగా అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ‘రాజ్యాంగ పరిరక్షణ’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో ప్రాధాన్యత పొందిన ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం పలికిన వ్యక్తికి ఐదేళ్ల కారాగార శిక్ష విధించడం చూస్తే మనం ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నామో అర్థం అవుతుందన్నారు. ప్రజా సమస్యలను పాలకులు గాలికొదిలేసి.. ప్రభుత్వ సంస్థల పేర్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు రోజ్‌గార్ యోజనగా మార్చేందుకు బిల్లు ప్రవేశపెట్టారన్నారు. నెహ్రూ లైబ్రరీని ప్రధానమంత్రి లైబ్రరీగా, ఔరంగా బాద్ నగరాన్ని శంభాజీ నగర్‌గా, ఇస్లామిక్ నగర్‌ను ఈశ్వర్‌నగర్‌గా మారుస్తున్నారన్నారు. ఉన్న పేర్లను తీసేసి కొత్త పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వందేమాతరాన్ని కూడా రాజకీయం చేశారన్నారు. బ్రిటిషర్లతో పోరాడి ఉరి తీయబడిన వారి పేర్లు అండమాన్ విమానాశ్రయానికి పెట్టకుండా.. బ్రిటీషర్లను క్షమించమని కోరిన సావర్కర్ పేరు పెట్టారని విమర్శించారు. సావర్కర్ పేరుతో ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోనే బీజేపీ అతి సంపన్న పార్టీ అన్నారు. రూ.10,070 కోట్లు అధికారికంగా కలిగి ఉందన్నారు. ఇదంతా కార్పొరేట్ల నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో వచ్చిన డబ్బు అన్నారు. ఇలాంటి బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, అక్రమమని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. బీజేపీ ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా అలాగే ఎందుకు పెట్టుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీని ఉపయోగించుకుని బీజేపేతర పార్టీ నాయకులపై కేసులు పెడుతూ.. చట్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై బూటు విసిరిన లాయర్‌ను కనీసం అరెస్ట్ కూడా చేయలేదన్నారు. న్యాయవ్యవస్థ పెద్ద ప్రమాదంలో పడిందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. న్యాయ వ్యవస్థను రక్షించుకోకపోతే అన్యాయం రాజ్యమేలుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఐలు జాతీయ నాయకులు నర్రా శ్రీనివాసరావు, ఎస్కేయూ న్యాయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీరాములు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎ.చంద్రశేఖర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ వంశీకృష్ణ, జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ పి.ప్రసూన, డాక్టర్ హేమలత, నరసింహులు, వెంకటస్వామి, ఐలు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరమాసప్ప, సతీష్, జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేపీ చిత్తప్ప, కే వీరరాజు పాల్గొన్నారు.
రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడాలి
మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు


