పొట్టిశ్రీరాములు చిరస్మరణీయుడు
అనంతపురం అర్బన్: భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని కలెక్టర్ ఆనంద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో పొట్టిశ్రీరాములు వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులయ్యారన్నారు. ఆయన త్యాగఫలంగా 1953లో కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు. అమరజీవి సేవలు ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, మల్లికార్జునుడు, రామ్మోహన్, సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
24న వినియోగదారుల దినోత్సవం
● జేసీ శివ్ నారాయణ్‌శర్మ
అనంతపురం అర్బన్: ఈ నెల 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించేందుకు అసవరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 18 నుంచి 24 వరకు వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. వినియోగదారుల దినోత్సవం నిర్వహణపై జేసీ సోమవారం రెవెన్యూ భవన్‌లోని ప్రత్యేక చాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘డిజిటల్ న్యాయపాలన దారా సమర్థ, సత్వర పరిష్కారం’ అనే అంశంపై పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యర్థులకు తెలుగు, అంగ్ల భాషల్లో పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఒక పాఠశాల లేదా ఒక జూనియర్ కళాశాలను ఎంపిక చేసుకుని వినియోదారుల వలంటరీ సంఘాలతో రెండు బాషాల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు, తృతీయ బహుమతి రూ. 2 వేలు ఇస్తామని తెలియజేశారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన విద్యార్థులను విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రమేష్‌రెడ్డి, ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్, డీటీసీ వీర్రాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యలపై అర్జీల వెల్లువ
● నాణ్యమైన పరిష్కారం చూపాలి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, మల్లికార్జునుడు, తిప్పేస్వామి, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మలు ప్రజల నుంచి 462 అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నిర్ణీత వ్యవధిలో అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
అర్జీల్లో మచ్చుకు కొన్ని..
● ప్రభుత్వం తమకు కేటాయించిన ఇంటి స్థలాన్ని వేరొకరు ఆక్రమించారని రాప్తాడు మండలం పుల్లలరేవుకు చెందిన కేశవరెడ్డి ఫిర్యాదు చేశాడు. విచారణ చేయించి తమకు న్యాయం చేయాలని కోరాడు.
● డి.పట్టా మంజూరు చేయాలని కణేకల్లు మండలం టి.వీరాపురానికి చెందిన గంగప్ప విన్నవించాడు. తన తండ్రి, తల్లి ఇద్దరూ మరణించారని, డి.పట్టాను తన పేరున మార్చి పాసుపుస్తకం మంజూరు చేయించాలని కోరాడు.
● తమ భూమిని సర్వేయర్ సర్వే చేయడం లేదని గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన ఇల్లూరు వలి ఫిర్యాదు చేశాడు. సర్వే నెంబరు 573–5లో 3.80 ఎకరాల భూమి ఉందని తెలిపాడు. పక్కనున్న రైతు తమ భూమిలో 79 సెంట్ల మేర జరిగాడని చెప్పాడు. ఆయన రాజకీయ పలుకుబడితో సర్వే చేసేందుకు సర్వేయర్‌ను రాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించాడు.
పొట్టిశ్రీరాములు చిరస్మరణీయుడు


