జనవరిలో మిల్లెట్ మేళా
అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థల ఫోరం ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అనంతపురంలో మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్ ఓ.ఆనంద్ విడుదల చేసి, మాట్లాడారు. సహజ వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, మార్కెటింగ్, స్థానిక వినియోగంపై దృష్టి సారించి మిల్లెట్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎకాలజీ సెంటర్ రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లావ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీమల్లారెడ్డి, టింబక్టు ప్రతినిధి శ్రీకాంత్, రెడ్స్ డైరెక్టర్ భానూజా, తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
యువరైతు మృతి
గార్లదిన్నె: విద్యుత్‌షాక్‌కు గురై గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన యువరైతు దేవేంద్ర (21) మృతి చెందాడు. వివరాలు.. తమకున్న ఐదు ఎకరాల పొలంలో రైతు దేవేంద్ర చీనీ పంట సాగు చేశాడు. సోమవారం ఉదయం చీనీ చెట్లకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. స్విచ్ ఆన్ చేసినా మోటార్ ఆడక పోవడంతో అనుమానం వచ్చి తమ పొలం పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ మెయిన్ స్విచ్ బోర్డును పరిశీలిస్తూ స్వీచ్ ఆన్ చేస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని బోరున విలపించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్‌ఐ గౌస్‌మహమ్మద్ బాషా తెలిపారు.
ఢిల్లీ సదస్సుకు సర్పంచ్ మోనాలిసా
వజ్రకరూర్: ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు న్యూఢిల్లీ వేదికగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఆధ్వర్యంలో జరిగే ‘సర్పంచ్ శక్తి’ సదస్సుకు వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మోనాలీసా ఎంపికయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు అందడంతో సోమవారం ఆమె ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రం నుంచి నలుగురు మహిళా సర్పంచ్‌లు ఎంపికగా కాగా, ఇందులో ఉమ్మడి జిల్లా తరఫున మోనాలిసాను ఎంపిక చేయడం గమనార్హం.
రిమాండ్‌కు యువకుడు
పామిడి: స్థానిక మెయిన్ బజార్‌లోని వస్త్ర దుకాణాల వద్ద ఆదివారం హల్‌చల్ చేసి భయభ్రాంతులకు గురి చేసిన సంతమార్కెట్ వీధికి చెందిన యువకుడు మాల రవిని పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వివరాలను పామిడి ఎస్‌ఐ బి.రవిప్రసాద్ సోమవారం వెల్లడించారు. చేతికి చిక్కన కట్టె, రాడ్, కత్తిని మాల రవి చేత పట్టుకుని దుకాణాలపై రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించడంతో పాటు, పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేశాడన్నారు. అడ్డుకోబోయిన జమేదార్ శ్రీనివాసులపై కత్తితో దాడికి విఫలయత్నం చేసి పరారయ్యాడన్నారు. ఈ క్రమంలో కల్లూరు అగ్రహారం తచ్చాడుతున్న నిందితుడు మాల రవిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
పెళ్లి కాదనే బెంగతో
యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్‌పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారంఅందుకున్న రైల్వే ఎస్‌ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
జనవరిలో మిల్లెట్ మేళా
జనవరిలో మిల్లెట్ మేళా
జనవరిలో మిల్లెట్ మేళా


