పత్తి కొనుగోలులో కొర్రీలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోళ్లు మందగించాయి. మార్కెటింగ్‌శాఖ సహకారంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో వారంలో ఒక్క రోజు మాత్రమే కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ)తో కొనుగోళ్లు చేస్తున్నారు. అది కూడా కేవలం అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్‌యార్డులో మాత్రమే చేపట్టడం రైతులకు ఇబ్బందిగా మారింది.
నాణ్యత లేదంటూ..
గతంలో తాడిపత్రి, గుత్తి కేంద్రాల ద్వారా వారంలో ఐదు రోజుల పాటు పత్తి కొనుగోళ్లను చేపట్టేవారు. అయితే ఈ సారి కేవలం గుత్తికి మాత్రమే పరిమితం చేసి అందులోనూ ఒక్కరోజు మాత్రమే కొనుగోలు చేస్తుండటం విశేషం. పత్తి పొడవు రకం క్వింటా రూ.8,110 తో మద్ధతు ధర ఖరారు చేసినా... తేమ శాతం, పరిపక్వత (మైక్రోనైర్), రంగు మారడం, దుమ్ము, ధూళి పేరుతో ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధర చెల్లిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రధానంగా నిబంధనల మేరకు 8 శాతం తేమ ఉన్న వాటికి ఎంఎస్‌పీ ఉంటుంది. ఆ పై ప్రతి ఒక శాతం పెరుగుదలకు ఒక శాతం చొప్పున రేటు తగ్గిస్తున్నారు.
శుభ్రంగా ఉంటేనే తీసుకురండి
పత్తిని బాగా ఆరబెట్టి శుభ్రంగా ఉన్నదానిని మాత్రమే మార్కెట్‌కు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. తడిసిన పత్తి, రంగుమారినది, చెత్తాచెదారం ఉన్నది, గుడ్డి, పురుగుపట్టినది, నీళ్లు చల్లినది, పాత పత్తి, ముడుచుకుపోయినది తీసుకురావద్దని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఈ–క్రాప్ ఆధారంగా బ్యాంకు పాస్‌పుస్తకం, ఆధార్‌తో పాటు మొదట శ్యాంపిల్‌గా తీసుకువస్తే... ప్రతి బుధవారం కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
వారంలో ఒక్కరోజే కొనుగోలు చేస్తామంటున్న అధికారులు
గుత్తిలో ప్రతి బుధవారం కేంద్రం నిర్వహణ
నాణ్యత లేదంటూ ఎంఎస్‌పీ
కంటే ధర తక్కువ చెల్లింపు


