జాతీయ రహదారులపై వేగానికి కళ్లెం
● సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా
● స్పీడ్ లిమిట్ దాటితే జరిమానా
అనంతపురం టవర్‌క్లాక్: జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న అతివేగానికి కళ్లెం వేసేందుకు నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపేవారు కెమెరాల కంట పడకుండా తప్పించుకోవడం అసాధ్యం కానుంది. స్పీడ్ లిమిట్ దాటితే నంబర్ ప్లేట్ ఆధారంగా వాహన యజమాని ఇంటికే ఫైన్ చలానా అందనుంది. ఇప్పటికే కర్నూలు– ఆత్మకూరు రహదారిపై నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి ప్రయోగాత్మాకంగా అమలు చేశారు. ఇక్కడ విజయవంతం కావడంతో అదే విధానాన్ని జాతీయ రహదారులకూ అమలు చేయనున్నారు. త్వరలో బెంగళూరు నుంచి కడప – విజయవాడ జాతీయ రహదారురిపై నిఘా నేత్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అనంతపురం– గుంటూరు రహదారిలోనూ అమలు చేయనున్నారు. 24 గంటలూ పనిచేసే నిఘా నేత్రాల ద్వారా వాహన వేగాన్ని ఆటోమేటిక్‌గా నమోదు చేసి, నంబర్ ప్లేట్ ఆధారంగా జరిమానా విధించనున్నారు. కారు 100 కి.మీ, బస్సు 90, లారీ, అతిభారీ వాహనాలు 80 కి.మీ వేగం మించితే తప్పనిసరిగా జరిమానా విధిస్తారు.


