పరిష్కార వేదికకు 96 వినతులు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 96 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ మహిబూబ్‌బాషా, అధికారులు పాల్గొన్నారు.
బస్సుల్లేనప్పడు ‘ఉచిత ప్రయాణం’ ఎందుకు?
● ఉరవకొండ డీఎం కార్యాలయం ఎదుట విద్యార్థినులు, తల్లిదండ్రుల నిరసన
ఉరవకొండ: బస్సులు నడపలేనప్పుడు ఉచిత ప్రయాణ పథకం ఎందుకు పెట్టారంటూ ఉరవకొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ను విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు నిలదీశారు. ఈ మేరకు సోమవారం డీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కూడేరు మండలం జల్లిపల్లి, ఉదిరిపికొండ, కోనాపురం తదితర గ్రామాల నుంచి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలకు వస్తున్న తమ పిల్లలు తిరుగు ప్రయాణంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసులు నడపలేనప్పుడు ఉచిత ప్రయాణ పథకం ఎందుకు పెట్టారని డీఎం హంపన్నను నిలదీశారు. కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించే సమయంలో అమ్మాయిల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల్లో బాలికలకు భద్రత లేకుండా పోతోందన్నారు. స్పందించిన డీఎం వెంటనే ఉరవకొండ అర్బన్ సీఐ మహానందిని రప్పించుకుని విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా సర్వీసులు నడుపుతామని, ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉంటూ తమకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని డీఎంతో పాటు సీఐ హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు.
మెరిట్ లిస్ట్ విడుదల
అనంతపురం మెడికల్: నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెరిట్ లిస్ట్ జాబితాను www.anantapuramu.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైకాలజిస్టు, ఆడియాలజిస్టు, ఆప్తమాలజిస్టు, ఫార్మసిస్టు, డేటా ఎంటీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జాబితాపై అభ్యంతరాలపై డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
పరిష్కార వేదికకు 96 వినతులు


