పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయండి
కళ్యాణదుర్గం: ఏపీ పురపాలక చట్టం నిబంధనలు ఉల్లంఘించి పార్టీ ఫిరాయించిన కౌన్సిలర్లపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల కళ్యాణదుర్గంలో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ విప్‌ను ధిక్కరించి టీడీపీకి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఎ.సురేష్ (6వ వార్డు), ఒ.ప్రభావతి (9వ వార్డు) ఎన్నికకు గైర్హాజరవడం విప్‌ను ధిక్కరించినట్లుగా భావించాలని తెలిపారు. వీరితో పాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పార్టీ నామినేట్ చేసిన అభ్యర్థి ఎం.లక్ష్మన్నకు వ్యతిరేకంగా, టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారని పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్ ద్వారా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 21వ వార్డు కౌన్సిలర్ జయం ఫణీంద్ర, 17వ వార్డు కౌన్సిలర్ బాలా రాజేశ్వరి, 2వ వార్డు కౌన్సిలర్ అబ్రహం మాదిగ, 1వ వార్డు కౌన్సిలర్ జి.అనుసూయమ్మ, 24వ వార్డు కౌన్సిలర్ హరిజిన తిమ్మప్ప, 18వ వార్డు సి.మహాలక్ష్మిలను కౌన్సిలర్ పదవులకు అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వైఎస్సార్‌సీపీ విప్ నరేంద్రరెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మన్న, అర్చన, పరమేశ్వరప్ప, కో ఆప్షన్ సభ్యులు నీరుగంటి సురేష్, అప్జల్, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, పార్టీ కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు యర్రంపల్లి కృష్ణమూర్తి, గోపారం శ్రీనివాసులు, దొడగట్ట నారాయణ, జాకీర్, గంగాధర్, ఆంజినేయులు, పాతలింగ, మల్లికార్జున, ఉమేష్, రామిరెడ్డి, హరి, దేవ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


