● మోంథా తుపానుతో తీవ్ర నష్టం ● సాయం చేయడంలో సర్కారు విఫ
ఉరవకొండలో మగ్గం గుంతలో చేరిన నీరు (ఫైల్)
ఉరవకొండ: మోంథా తుపాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా నేతన్నలు చితికిపోయారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరి సుమారు 20 రోజులుగా నేత పనికి దూరమయ్యారు. బాధిత నేతన్నలకు సంబంధించి నష్టం నివేదికను ప్రభుత్వానికి అందించినా ఇంకా పరిహారమే అందలేదు. దీంతో నేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది.
దెబ్బ తిన్న 147 మగ్గాలు
చేనేతకు ప్రసిద్దిగాంచిన ఉరవకొండలో 800 చేనేత మగ్గాలు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా 2,100 మంది, పరోక్షంగా మరో 2వేల మంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఉరవకొండలో మోంథా తుఫాన్ కారణంగా 147 మగ్గాలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు నివేదికను చేనేత, జౌళి శాఖ అధికారులు వెల్లడించారు. అయితే అయితే సంబందింత అధికారులు సక్రమంగా ఎన్యుమరేషన్ చేయకపోవడంతో తాము నష్టపోతున్నట్టు పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మగ్గం గుంతల్లో నీరు చేరడంతో 20 రోజుల పాటు నేత పనికి దూరం కాగా, పాడైపోయిన వాటిని మరమ్మతు చేసుకునేందుకు మరో పది రోజుల సమయం పట్టింది. టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారి పేర్లు మాత్రమే జాబితాలో చేర్చి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలున్నాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల మగ్గాలు పూర్తిగా దెబ్బతిన్నా వారిని సహయం కోసం ఎంపిక చేయకపోవడం గమనార్హం. దెబ్బతిన్న చేనేత మగ్గాలకు సంబంధించి రూ.5 వేలు నగదు, కార్మిక కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, చక్కెర తదితర నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్క కార్మికుడికీ నగదు, నిత్యావసరాలు అందలేదు. నిత్యం చేనేత కార్మికులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. వారికి సరైన సమాధానం చెప్పే వారు కరువయ్యారు.


