మరో నకిలీ బాగోతం | - | Sakshi
Sakshi News home page

మరో నకిలీ బాగోతం

Dec 16 2025 4:33 AM | Updated on Dec 16 2025 4:33 AM

మరో నకిలీ బాగోతం

మరో నకిలీ బాగోతం

జిల్లాలోని మరో పంచాయతీ లాగిన్‌ హ్యాక్‌!

1,500 నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం

విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం

గుట్టుగా విచారణ చేస్తున్న అధికారులు

ఇప్పటికే సంచలనం రేపిన కొమరేపల్లి పంచాయతీ లాగిన్‌ వ్యవహారం

ఏకంగా 3,981 నకిలీబర్త్‌ సర్టిఫికెట్లు జారీ అయినట్లు నిర్ధారించిన అధికారులు

తాజాగా మరో పంచాయతీలోనూ ఇదే తతంగం

మడకశిర: నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లకు శ్రీసత్యసాయి జిల్లా కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. అగళి మండలంలోని కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్‌ నుంచి ఏకంగా 3,981 నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు జారీ అయిన అంశం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించగా...ఈ కేసు విచారణ కొలిక్కిరాకముందే జిల్లాలోని మరో పంచాయతీ లాగిన్‌ హ్యాక్‌ అయినట్లు తెలుస్తోంది. సదరు పంచాయతీ నుంచి ఏకంగా 1,500 నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి అధికారులు ఈ విషయాన్ని గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. జిల్లా అధికారులు గుట్టుగా విచారణ జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

హ్యాకర్ల పనేనా?

తాజాగా వెలుగు చూసిన 1,500 నకిలీ బర్త్‌ సర్టిఫికెట్ల వ్యవహారం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. సదరు పంచాయతీ లాగిన్‌ నుంచే ఇతర రాష్ట్రాల వారికి బర్త్‌ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్థానిక అధికారులను జిల్లా అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్న అధికారులు...ఇది హ్యాకర్ల పనేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అందరూ ఇతర రాష్ట్రాల వారే..

కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్‌ నుంచి 3,981 నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు జారీ కాగా, ఈ బర్త్‌ సర్టిఫికెట్లు పొందిన వారంతా ఇతర రాష్ట్రాల వారేనని విచారణ అధికారులు గుర్తించారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల వారు ఈ నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లను పొందినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు పొందిన వారిలో ఎక్కువగా ఒకే సామాజిక వర్గం వారు ఉండడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో గ్రామ పంచాయతీ నకిలీ బర్త్‌ సర్టిఫికెట్ల వ్యవహారంపై కూడా జిల్లా అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి రేపో మాపో పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. హ్యాకర్లే పంచాయతీల లాగిన్లను హ్యాక్‌ చేసి నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు విచారణ అధికారులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం. హ్యాకర్లు ఇంకెన్ని పంచాయతీ లాగిన్లు హ్యాక్‌ చేశారో అన్నది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

బర్త్‌ సర్టిఫికెట్ల జారీపై నిఘా..

కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్‌ నుంచి వేలాదిగా నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు జారీ అయిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు బర్త్‌ సర్టిఫికెట్లను జారీ చేసే ప్రక్రియపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే జిల్లాలోని మరో గ్రామ పంచాయతీ లాగిన్‌ నుంచి నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు జారీ అయినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు సమాచారం అందించి విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ గ్రామ పంచాయతీ లాగిన్‌ నుంచి జారీ అయిన సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని విచారణ అధికారులు తేల్చినట్లు సమాచారం. ఈ ఫేక్‌ సర్టిఫికెట్లన్నీ కూడా రద్దు చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement