చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఊర్వశి తర్వాత హీరోయిన్‌గా సినిమాలు చేసింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మారింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 350కి పైగా సినిమాలు చేసింది. 2000వ సంవత్సరంలో నటుడు మనోజ్ కె. జయన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి సంతానం.
రెండో పెళ్లి
అయితే భార్యాభర్తలు ఎంతోకాలం కలిసుండలేదు. 2008లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2013లో చెన్నైకి చెందిన శివప్రసాద్‌ను పెళ్లాడింది. వీరికి ప్జాపతి అని ఓ కుమారుడు సంతానం. ఇటీవలే శివప్రసాద్ దర్శకుడిగా మారిపోయాడు. తన మొదటి పెళ్లి ఎందుకు విఫలమైందన్న విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
అందరూ కలిసి తాగేవారు
ఊర్వశి మాట్లాడుతూ.. మొదటిసారి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ వాతావరణమే తేడాగా అనిపించింది. ఇంట్లోవాళ్లందరూ ఆధునిక జీవన విధానాన్ని కొనసాగించేవారు. కలిసి తాగడం, తినడం చేసేవారు. తల్లీపిల్ల తేడా లేకుండా అంతా ఒక్కచోట కూడి సిట్టింగ్ చేసేవారు. వాళ్ల మధ్య నేను ఇమడగలుగుతానా? లేదా? అని భయపడ్డాను.
షూటింగ్ అవగానే తాగడం
అడ్జస్ట్ అవడానికి ప్రయత్నించాను. వాళ్ల పద్ధతుల్ని నేర్చుకున్నాను. షూటింగ్స్‌కు వెళ్లడం.. రాగానే మందు కొట్టడం ఇదే పని! నన్ను నేను కోల్పోతున్నాను అన్న విషయం నెమ్మదిగా అర్థమైంది. అప్పటికే ఇంటి పోషణ బాధ్యత నా భుజాలపై పడింది. ఇష్టం లేని పనులు బలవంతంగా చేయాల్సి వచ్చింది.
ఆరోగ్యం నాశనం చేసుకున్నా
నా అభిప్రాయాలతో ఎవరూ ఏకీభవించేవారు కాదు. గొడవలు జరిగేవి.. అప్పుడు కోపంతో మరింత ఎక్కువ తాగేదాన్ని. తిండీనిద్ర మానేసి మరీ తాగుతూ కూర్చునేదాన్ని. చేజేతులా ఆరోగ్యం నాశనం చేసుకున్నాను. నా స్నేహితులు, పర్సనల్ స్టాఫ్ వల్లే ఈ వ్యసనం నుంచి బయటపడ్డాను అని ఊర్వశి చెప్పుకొచ్చింది.


