ఈ రోజు నా మాటలను నాన్న వింటుంటారు: మహేశ్‌ బాబు | Mahesh Babu's Varanasi Title Reveal Event Highlights | Sakshi
Sakshi News home page

ఈ రోజు నా మాటలను నాన్న వింటుంటారు: మహేశ్‌ బాబు

Nov 16 2025 10:52 AM | Updated on Nov 16 2025 11:10 AM

Mahesh Babu's Varanasi Title Reveal Event Highlights

‘‘నాన్నగారంటే (సూపర్‌స్టార్‌ కృష్ణ) నాకు చాలా ఇష్టం. ఆయన చెప్పిన ప్రతి మాటని గౌరవించాను, పాటించాను. కానీ ఒక్కటి మాత్రం చేయలేదు. ఆయన నన్నెప్పుడూ పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. ఆ మాట నేను వినలేదు. ఈ రోజు నా మాటల్ని ఆయన వింటుంటారు (‘వారణాసి’లో మహేశ్‌ చేసిన రుద్ర  పాత్రకు పౌరాణికం టచ్‌ ఉంది). నాన్న ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉంటాయి. ‘వారణాసి’ నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దీనికి ఎంత కష్టపడాలో అంతా పడతాను. ఈ సినిమా విడుదలైనప్పుడు దేశమంతా గర్వపడుతుంది’’ అని భావోద్వేగంగా మాట్లాడారు మహేశ్‌బాబు. 

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి ‘వారణాసి’ టైటిల్‌ ఖరారైంది. శనివారం హైదరాబాద్‌లో ‘గ్లోబ్‌ట్రోటర్‌’ ఈవెంట్‌ పేరిట చిత్రయూనిట్‌ నిర్వహించిన కార్యక్రమంలో ‘వారణాసి’ టైటిల్‌ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు. çపృథ్వీరాజ్‌ సుకుమారన్‌ , ప్రియాంకా చోప్రా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయేంద్రప్రసాద్, కంచి కథ అందించారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదల కానుంది. 

ఈ వేడుకలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ వేదికపైకి సింపుల్‌గా నడిచొస్తానంటే రాజమౌళిగారు కుదరదన్నారు... చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్‌  చేశారో (బొమ్మ నందిపైన కూర్చుని వస్తున్నట్లుగా). ఇదంతా మీకోసమే (అభిమానులు). మీరంతా మమ్మల్ని స΄ోర్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌. అప్‌డేట్స్‌... అప్‌డేట్స్‌ అన్నారు. అవి ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. అవి చూస్తుంటే నాకే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయింది. ముందు ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీరంతా ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అభిమానులందరూ క్షేమంగా ఇంటికి చేరుకుంటే మేమంతా చాలా సంతోషంగా ఉంటాం’’ అని తెలిపారు. 

రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నాకు చిన్నప్పుడు కృష్ణగారి గొప్పదనం తెలియదు. చిన్నప్పుడు ఎన్టీఆర్‌గారి అభిమానిని. కానీ ఇండస్ట్రీకి వచ్చాక... సినిమా ఏంటో అర్థమయ్యాక కృష్ణగారి గొప్పదనం తెలిసింది. ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్‌ చేయాలంటే ఎన్నో దారులను బ్రేక్‌ చేసుకుంటూ, ఎన్నో దారులు వేసుకుంటూ వెళ్లాలి. ఇక నిన్న (శుక్రవారం) రాత్రి మా సినిమా వీడియోను టెస్ట్‌ చేయాలనుకున్నాం. లీక్‌ కాకూడదని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డ్రోన్స్‌తో వీడియోలు తీసి, నెట్‌లో పెట్టడం మొదలుపెట్టారు. ఈ వీడియోను ఎంతో దూరం నుంచి వచ్చిన ఆడియన్స్‌ కోసం ఈ రోజు మేం ప్లే చేద్దామనుకున్నాం. 

ఇక మహేశ్‌బాబు నుంచి మనందరం నేర్చుకునే ఒక గుణం ఉంది. మనందరికీ సెల్‌ఫోన్‌  ఎడిక్షన్‌ ఉంది. ఆఫీసుకు వచ్చినా, షూటింగ్‌కు వచ్చినా సెల్‌ఫోన్‌  పట్టుకోడు. 8 గంటలైనా, 10 గంటలైనా తన సెల్‌ఫోన్‌  కారులోనే ఉంటుంది. మళ్లీ కారు ఎక్కితేనే మహేశ్‌ తన ఫోన్‌  టచ్‌ చేస్తాడు. మనందరం ఇది నేర్చుకోవాలి. 

మహాభారతం, రామాయణం అంటే నాకు చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను. మహాభారతం నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని కూడా చెప్పాను. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలోని ఓ ముఖ్యమైన ఘట్టం తీస్తానని అనుకోలేదు. ఫస్ట్‌ డే మహేశ్‌కి రాముడి వేషం వేసి, ఫొటోషూట్‌ చేస్తుంటే గూస్‌ బంప్స్‌ వచ్చాయి. సినిమాలోని ఆ ఎపిసోడ్‌ను 60 రోజులు షూట్‌ చేశాం. నా సినిమాల్లో మోస్ట్‌ మెమొరబుల్‌ సీక్వెన్స్‌గా అది ఉండబోతోంది. మీరు ఊహించనంత అందంగా, పరాక్రమంగా, కోపంగా, దయార్ద్ర హృదయంతో ఉంటాడు మహేశ్‌. ఈ ఎసిసోడ్‌ షూట్‌ చేసినందుకు నేను చాలా లక్కీ’’ అన్నారు.


ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ– ‘‘కొంత గ్యాప్‌ తర్వాత ఇండియన్‌  సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మందాకిని పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్న రాజమౌళిగారికి థ్యాంక్స్‌. మహేశ్‌బాబుగారు, ఆయన ఫ్యామిలీ... నేను హైదరాబాద్‌ని మరో ఇల్లుగా భావించేలా చేశారు’’ అని అన్నారు.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం రాజమౌళిగారి నుంచి నాకో మెసేజ్‌ వచ్చింది. ఆయన చెప్పిన ఐదు నిమిషాల నరేషన్‌  విని మైండ్‌ బ్లో అయ్యింది. ఇండియన్‌  సినిమా లిమిట్స్‌ దాటేలా ఈ చిత్రకథ, రాజమౌళి విజన్‌ ఉంటాయి’’ అని చెప్పారు.

ఎమ్‌ఎమ్‌ కీరవాణి మాట్లాడుతూ– ‘‘కీరవాణిగారు మెలోడీ బాగా కొడతారు. కానీ బీట్‌ కాస్త స్లోగా ఉంటుందన్న పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈసారి మెలోడీ నాదే. బీటూ నాదే’’ అని చెప్పారు.

కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ 30 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంది. మహేశ్‌బాబు విశ్వరూపాన్ని చూస్తూ నేనలా ఉండిపోయాను. డబ్బింగ్‌ లేదు... సిజీ లేదు... రీ రికార్డింగ్‌ లేదు... అయినా నన్ను మంత్రముగ్దుడ్ని చేసింది ఆ సీన్‌... మర్చిపోలేను. మీరు (ఆడియన్స్‌) కూడా చక్కని అనుభూతి చెందుతారు. కొన్ని కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు. కొన్ని కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. అనుక్షణం రాజమౌళి గుండెలపై హనుమ ఉన్నాడు’’ అని చెప్పారు 

కార్తికేయ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌పై నా తొలి స్పీచ్‌ ఇది. చాలా గౌరవంగా ఉంది. మన ఇండియా వైపు గ్లోబల్‌ ఆడియన్స్‌ చూసేలా, మన ఇండియన్‌  సినిమా గ్లోబల్‌ స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని చెప్పారు.

కేఎల్‌ నారాయణ మాట్లాడుతూ– ‘‘పదిహేనేళ్ల క్రితం మహేశ్‌బాబు, రాజమౌళిగార్లతో సినిమా చేయాలనుకుని, వారిని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత టైమ్‌ పడుతుందని రాజమౌళి గారు, నేనూ ఊహించలేదు. ఇప్పుడు నా కల నిజమైంది’’ అన్నారు.ఈ వేడుకలో నమ్రత, సితార, రమా రాజమౌళి, సుప్రియ, కంచి, దేవ కట్టా, ఫైట్‌ మాస్టర్‌ సాల్మన్‌ లతో ΄పాటు పలువురు సినీ ప్రముఖలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement