చాలా హిందీ సినిమాల్లో నవ్వులు పంచిన అర్షద్ వార్సీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చూశాడు. 16 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోవడంతో జీవితంలో నిలదొక్కుకునేందుకు, బతుకు బండి సాగించేందుకు నానా అగచాట్లు పడ్డాడు. ఆ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
బంగారు లైటర్
అర్షద్ వార్సీ మాట్లాడుతూ.. నా తండ్రి పేరు అహ్మద్ అలీ ఖాన్. తను హార్మోనియం వాయించేవాడు. ఉర్దూలో షాయరీలు రాసేవాడు. చిన్నప్పుడు నన్ను హాస్టల్‌లో వేశారు. సెలవులకు మాత్రమే ఇంటికొచ్చేవాడిని. ఓసారి ఆయన తనదగ్గరున్న గోల్డ్ లైటర్‌ను వేరేవాళ్లకు బహుమతిగా ఇచ్చేశాడు. మా ఇంట్లో పెద్ద కారు కూడా ఉండేది. మా అంకుల్ ఆ కారు మీద మనసు పారేసుకోవడంతో ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చేశాడు.
ఉన్నదంతా పోయింది
ఇలా ఉన్నదంతా ఇచ్చుకుంటూ ఏమీ మిగలదని చిన్న వయసులోనే అర్థమైంది. మా ఇంటికి జగదీప్, యునుస్ పర్వీజ్ వంటి సెలబ్రిటీలు వచ్చి మాతో కలిసి భోజనం చేసేవారు. మా నాన్నకు ముంబైలో రెండు భవంతులు ఉండేవి. ఆ సమయంలో ఇంట్లో ఎక్కువకాలం అద్దెకు ఉండేవాళ్లు ఆ ఇంటి యజమానులవుతారు అని కోర్టు ప్రకటించింది.
అన్నీ మానేశా..
దీంతో నాన్న వెంటనే ప్రాపర్టీని కొందరి పేరు మీదకు బదిలీ చేశారు. తర్వాత వాళ్లు తిరిగిచ్చేస్తారనుకున్నాడు. కానీ అది జరగలేదు. సుమారు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాను. అప్పటిదాకా గాలికి తిరుగుతున్న నేను ఒక్కసారిగా పెద్దవాడినైపోయాను. ఫ్రెండ్స్‌తో తిరగడం, పార్టీలకు వెళ్లడం.. అన్నీ మానేశాను.
సినిమా
అన్నీ వదిలేసి పని చేయడం మొదలుపెట్టాను. ఇంటింటికీ వెళ్లి షాంపూలు అమ్మాను. నాలుగు రాళ్లు సంపాదించాను. తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. అర్షద్ వార్సీ.. మున్నా భాయ్ ఎంబీబీఎస్, హల్‌చల్, సలాం నమస్తే, జాలీ ఎల్‌ఎల్‌బీ, మస్తీ 4 వంటి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఢమాల్ 4, కింగ్, వెల్‌కమ్ టు ద జంగిల్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు.
చదవండి: 25 ఏళ్లకే పెళ్లా? ఆ తప్పు చేయొద్దంటున్న బాలీవుడ్ బ్యూటీ


