రెండవ ప్రశ్న | Sakshi Editorial On Literature | Sakshi
Sakshi News home page

రెండవ ప్రశ్న

Jun 9 2025 1:56 AM | Updated on Jun 9 2025 1:56 AM

Sakshi Editorial On Literature

పుస్తకం ప్రచురణ కంటే ఆ పుస్తకాన్ని సాటి రచయితకు చేరవేయడమే ఎక్కువ ఖర్చు అని తెలిసిన రోజు రచయితకు కలిగే ఇబ్బంది, బాధ అన్యులకు తెలియవు. ఎన్నో రాత్రిళ్లు జాగారం చేసి, కొన్ని మార్లు సెలవు పెట్టి, ఇంకొన్నిసార్లు అత్యవసర పనులూ ఆరోగ్య పరీక్షలూ వాయిదా వేసి, ఎలాగోలా పుస్తకం రాసి, అందుకై వేల రూపాయలు వెచ్చించి పుస్తకం ప్రచురించాక రచయితకు ప్రాథమికంగా అనిపించేది సాటి రచయితలు చదివితే బాగుండు, చదివి ఒక మాట చెప్తే బాగుండు అని!

ప్రతి కొలతకూ కొన్ని ప్రమాణాలున్నట్టే ప్రతి రచయితకూ కొన్ని ప్రమాణాలు ఉంటాయి. తాను ప్రచురించిన పుస్తకాన్ని ఏ పదిమంది చదివితే రచయితగా గుర్తింపు పొందుతాడో అతనికి అంచనా ఉంటుంది. కాని ఆ పదిమందికి పుస్తకం పంపడం ఎట్లా? వాట్సప్‌లో మెసేజ్‌ పెట్టాలి. అడ్రస్‌ తెప్పించుకోవాలి. కొరియర్‌ ఆఫీసుకు వెళ్లాలి. కొరియర్‌ చేయాలి. పుస్తకం వెల నూట యాభై అయితే కొరియర్‌ వెల కూడా అంతే ఉంటుంది. ఖర్చు మీద ఖర్చు. అయినా సరే పుస్తకం పంపి సంతృప్తి పడతాడు రచయిత. 

అయితే పుస్తకం అందుకున్నవారు వెంటనే పుస్తకం చదివేస్తారా? కొందరు ఫ్రమ్‌ అడ్రస్‌ను చూసి కవర్‌ను విప్పనే విప్పరు. కొందరు కవర్‌ విప్పి కృతజ్ఞతల కాలమ్‌లో తన పేరేమైనా రాశాడా చూస్తారు. కొందరు ముందుమాటలు తిరగేసి– అవి రాసిన వాళ్ల పేరు చేసి – హు... ఇతగాడు ముందుమాట రాసేంతటి వాడయ్యాడా అని ఆ పగను పుస్తకం మీద చూపి పక్కన పెడతారు. 

కొందరి అశ్రద్ధ వల్ల– పాపము శమించుగాక–  పుస్తకం వచ్చీ రాగానే న్యూస్‌పేపర్లలో కలిసిపోయి మరి కనిపించదు. పుస్తకం అందుకున్న పదిమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ‘పుస్తకం అందింది. థ్యాంక్యూ. చదివి అభిప్రాయం తెలుపగలను’ అని మెసేజ్‌ పెట్టరు. రచయితే చూసి చూసి ‘దొరవారూ... పుస్తకం అందినదా’ అని మెసేజ్‌ చేస్తే అప్పుడు బొటనవేలు చూపుతారు.

మనం పంపిన పుస్తకాన్ని అందుకున్నవారు చదవాలి అనే అంధ విశ్వాసం నుంచి బయట పడటం రచయితల ఆరోగ్యానికి మంచిది అనిపిస్తుంటుంది. పుస్తకం అందుకున్నవారు గతంలో మనకు తెలిసినవారు అని నేడు అనుకోకూడదు. గతంలో వారు రచయితలు కావచ్చు. గతంలో పుస్తకాలు చదువుతూ ఉండుండొచ్చు. ఇప్పుడూ సాహితీ సమావేశాల్లో అధ్యక్ష స్థానాల్లో, వక్తల స్థానాల్లో కనిపిస్తూ ఉండొచ్చు. 

అంతమాత్రం చేత వారు పుస్తకాలు చదువుతున్నట్టుగా భావించరాదు. కొందరు పిల్లల బాగోగుల్లో ఉంటుండొచ్చు. కొందరు ఉద్యోగ ఒత్తిడిలో ఉంటుండొచ్చు. కొందరు కుటుంబ సభ్యులూ... బంధువులూ తెచ్చే తంటాల్లో ఉంటారు. కొందరికి ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి. కొందరు ఫేస్‌బుక్కుల్లో, రీల్సుల్లో జీవితాన్ని ఖర్చు చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ లేకపోయినా తోటి రచయితపై చిన్నచూపు గ్యారంటీ. 

అదీ గాకుంటే వ్యక్తిగత అభిరుచి చాలా ఎదిగి చాలా గొప్ప సాహిత్యపు రుచిలో ‘ఈ యావరేజ్‌ రచన ఏం చదువుతాములే’ అనుకుంటూ కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా సరే, ఒక కొత్త పుస్తకం రచయిత పంపితే చూసి నాలుగు పేజీలైనా చదివి, పుస్తకాన్ని అంచనా గట్టి, చిన్నపాటి వ్యాఖ్య చేయగల సమర్థులే వీరు. పుస్తకం పంపిన రచయితను ఆ మాత్రం ఉత్సాహపరచలేరా? 

పుస్తకాలను రచయితలే చదవనప్పుడు పాఠకులు ఎందుకు చదవాలి అనే ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. నిజమే. ఒక పుస్తకం వస్తే, అది మంచి పుస్తకమైనా సరే, వర్తమానంలోని సాటి రచయితలు ఎవరూ దానిపై పోస్ట్‌ రాయరు. నేను చదివాను... మీరూ చదవండని రికమండ్‌ చేయరు. అసలు చూడనట్టే నటిస్తారు. కాని తమ పుస్తకాలు మాత్రం అందరూ చదివి, పోస్టులు రాయాలి... పాఠకులు చదవాలి అని కోరుకుంటారు. కామన్‌ సెన్‌ ్స ప్రకారం ఇదెలా సాధ్యం? మనం ఇస్తే కదా తిరిగి వస్తుంది.

క్రికెట్‌ వ్యాపారులు తమ క్రికెట్‌ను బుర్రల్లో ఎక్కించగలుగుతున్నారు. భక్తి ఆరాధకులు భక్తిని జనుల జీవనంలో అనుక్షణం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమా బేహారులు పాలాభిషేకాలు ఎలా చేయాలో, పోస్టర్ల ముందు పొర్లుదండాలు ఎలా పెట్టాలో నరాల్లో కూరుతున్నారు. మత్తుపదార్థాలు అమ్మేవాళ్లు వాటికై జీవితాలు అంకితం చేసే స్థాయిలో సామాన్యులను బానిసలుగా మార్చగలుగుతున్నారు. 

వీరంతా సక్సస్‌ అయినప్పుడు రచయితలందరూ కలిసి ఒకరికై ఒకరు మద్దతుగా నిలిచి ప్రజలను పాఠకులుగా మలచలేరా? క్యూలలో ఎగబడని, తొక్కిసలాటలకు చోటివ్వని, అల్పమైన కారణాలకు, ఆసక్తులకు జీవితాలను బలి ఇవ్వని వివేకవంతమైన జిజ్ఞాసువు సమాజాన్ని నిర్మించలేరా? దేశంలో సగటు మనిషి, విద్యార్థి, గృహిణి, ఉద్యోగి, వర్తకునికి అవసరమైన మేధో ఆహారమనే బుర్ర తిండి పుస్తకంలో దొరుకుతుందని ఒప్పించలేరా?

‘ఇటీవల నీవు చదివిన పుస్తకం ఏది?’ అనే ప్రశ్న కేవలం ఉద్యోగార్థిని ఇంటర్వ్యూల్లో అడిగేది మాత్రమే అనుకున్నన్నాళ్లు ఈ సమాజపు మేధోవికాస స్థాయి ఎదగదు. మరేం చేయాలి? మన మర్యాదల ప్రమాణాలు మారాలి. ప్రశ్నల తీరు మారాలి. సంస్కారాన్ని ఎంచేందుకు కొలమానాలు మారాలి. సమాజంలోని ప్రతి లేయర్‌లో కుశల ప్రశ్నల నమూనాను నిర్దేశించుకోవాలి. సాటి మనిషి ఎదురుపడితే మొదటి ప్రశ్న– ఎలా ఉన్నావు? అయ్యాక రెండవ ప్రశ్న– ఏ పుస్తకం చదువుతున్నావు అనేదిగానే ఉండాలి.
సవాలక్ష రుగ్మతలకు మాత్రమే కాదు అగణిత తొక్కిసలాటలకూ ఈ ప్రశ్నే టీకా.  

Advertisement
 
Advertisement
Advertisement