breaking news
Real Life Characters
-
సినిమాలోనూ దంపతులే
నాగచైతన్య–సమంత.. గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్న ఈ జంట ఈ ఏడాది తొలిసారి కలిసి నటిస్తుండటం విశేషం. రియల్ లైఫ్‌లో భార్యాభర్తలైన వీళ్లిద్దరూ రీల్ లైఫ్‌లోనూ అలాగే కనిపించనున్నారట. నాగచైతన్య, సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్‌ను శివ నిర్వాణకు అందించారు. ‘ఏమాయ చేసావె, మనం, ఆటోనగర్ సూర్య’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన చైతన్య–సమంత నాలుగోసారి సందడి చేయనున్నారు. ‘‘ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండోవారంలో మొదలవుతుంది. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం. ఐదు పాటలుంటాయి. డిసెంబరులోగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. చిత్రం ప్రారంభోత్సవంలో నిర్మాత నవీన్ ఎర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు. దివ్యాన్ష కౌశిక్ రెండో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు శర్మ, లైన్ ప్రొడ్యూసర్: నాగమోహన్. -
టింగ్... టింగ్... ఎగ్జైటింగ్!
ఇప్పటివరకూ కథానాయికగా శ్రుతీహాసన్ దగ్గర దగ్గర పాతిక సినిమాలు చేశారు. అవన్నీ ఒక ఎత్తై ఇప్పుడు చేస్తున్న ‘శభాష్ నాయుడు’ మరో ఎత్తు అనేంతగా ఆమె ఆనందపడి పోతున్నారు. దానికి కారణం తొలిసారి తండ్రి కమల్‌హాసన్‌తో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో కమల్-శ్రుతి తమ రియల్ లైఫ్ పాత్రలు పోషిస్తున్నారు. అంటే.. తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ‘దశావతారం’లో ఓ పాత్ర అయిన బలరామ్ నాయుడి పాత్రతో ఈ చిత్రం సాగుతుంది. టైటిల్ రోల్‌ను కమల్ చేస్తుండగా, బలరామ్ నాయుడి అసిస్టెంట్ పాత్రను బ్రహ్మానందం చేస్తున్నారు. ఇందులో కమల్ భార్య పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్ చేశారు. ఈ షూటింగ్లో పాల్గొనడానికి శ్రుతి అక్కడకు వెళ్లారు. ‘‘మా నాన్నగారితో యాక్ట్ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా, ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అని శ్రుతి పేర్కొన్నారు. ఈ బ్యూటీ ఎగ్జైట్ అవుతున్న తీరు చూస్తుంటే... ‘సుప్రీమ్’ చిత్రంలో ‘జింగ్... జింగ్.. అమేజింగ్’ అనే డైలాగ్‌ని కాస్త మార్చి ‘టింగ్... టింగ్.. ఎగ్జయిటింగ్’ అనాలేమో.