సినిమాలోనూ దంపతులే

nagachaitanta, samantha new movie launched - Sakshi

నాగచైతన్య–సమంత.. గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉన్న ఈ జంట ఈ ఏడాది తొలిసారి కలిసి నటిస్తుండటం విశేషం. రియల్‌ లైఫ్‌లో భార్యాభర్తలైన వీళ్లిద్దరూ రీల్‌ లైఫ్‌లోనూ అలాగే కనిపించనున్నారట. నాగచైతన్య, సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి బౌండెడ్‌ స్క్రిప్ట్‌ను శివ నిర్వాణకు అందించారు.

‘ఏమాయ చేసావె, మనం, ఆటోనగర్‌ సూర్య’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన చైతన్య–సమంత నాలుగోసారి సందడి చేయనున్నారు. ‘‘ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్ట్‌ రెండోవారంలో మొదలవుతుంది. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం.  ఐదు పాటలుంటాయి. డిసెంబరులోగా షూటింగ్‌ పూర్తి చేసి, వచ్చే ఏడాది సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. చిత్రం ప్రారంభోత్సవంలో నిర్మాత నవీన్‌ ఎర్నేని, రచయిత కోన వెంకట్‌ పాల్గొన్నారు. దివ్యాన్ష కౌశిక్‌ రెండో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీనివాస్‌ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు శర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌: నాగమోహన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top