ప్రజలు మెచ్చిన చిత్రాలకే పట్టం | Telangana Gaddar Film Awards: Award winners Emotional Speech | Sakshi
Sakshi News home page

ప్రజలు మెచ్చిన చిత్రాలకే పట్టం

Mar 8 2026 5:25 AM | Updated on Mar 8 2026 5:25 AM

Telangana Gaddar Film Awards: Award winners Emotional Speech

అవార్డుల్లో చిన్న చిత్రాల హవా

‘రాజు వెడ్స్‌ రాంబాయి’కి ఐదు అవార్డులు

చాంపియన్  చిత్రానికి ఐదు అవార్డులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2025’ లో ప్రజలు మెచ్చిన సినిమాలకు పట్టం కట్టారు. అలాగే తొలి, ద్వితీయ, తృతీయ అవార్డులు దక్కించుకున్న చిత్రాలు స్వచ్ఛమైన పల్లె కథలతో రూపొందినవి కావడం విశేషం. ప్రధాన విభాగాల్లో అవార్డులు పొందినవాటిలో ఎక్కువగా చిన్న చిత్రాలు ఉండటం విశేషం. 

2025 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్  ద్వారా సర్టిఫికెట్‌ పొందిన చిత్రాలకు, షార్ట్‌ ఫిల్మ్‌లకు ఈ అవార్డులు ప్రకటించారు. శనివారం ప్రకటించిన ‘తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2025’లో ఉత్తమ చిత్రాలుగా నిలిచిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ (తొలి స్థానం), ‘దండోరా’ (ద్వితీయ చిత్రం), ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ (తృతీయ చిత్రం) వంటివన్నీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కినవే. వీటితో పాటు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సినిమాలకు, అద్భుతమైన ప్రతిభ కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులను ప్రకటించారు. ఈ నెల 19న ఈ పురస్కారాల ప్రదానం హైదరాబాద్‌లో జరగనుంది. అవార్డు విజేతల్లో పలువురు ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఈ విధంగా...

అవార్డు వస్తుందని అంచనా వేశాను
‘కార్తికేయ 2’ సినిమాకి అవార్డులు వస్తాయని ఊహించలేదు. కానీ, తెలంగాణ రాష్ట్ర గద్దర్‌ అవార్డు నుంచి నేషనల్‌ అవార్డు వరకు కవర్‌ చేసింది. ‘తండేల్‌’ విషయంలో నాగచైతన్యకి అవార్డు వస్తుందని అంచనా వేశాను. ఎందుకంటే ఈ సినిమా కోసం ఆయన పడినది అతి కష్టం... అంటే ఫిజికల్లీ అన్నమాట. మేము షూటింగ్‌ చేసినప్పుడు ఉన్న క్లైమాటిక్‌ కండిషన్స్‌కి సముద్రం మధ్యలోకి వెళ్లడం అంటే సాహసమే. బోట్స్‌లో వెళుతున్నప్పుడు ఆ అలలు, ఆ పరిసరాల వల్ల వెళ్లేటప్పుడు... వచ్చేటప్పుడు వాంతులే. వాటిని, ఎండని నాగచైతన్య లెక్క చేయకుండా సినిమా చేశారు. షూటింగ్‌ చేస్తున్నప్పుడే ఈ సినిమాకి కచ్చితంగా యూనివర్సల్‌ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తుందని నాకు అనిపించింది.

ఒక సినిమా హిట్‌ కావాలని ఎలా కోరుకుంటామో... అలానే అవార్డు రావాలనీ కోరుకుంటాం. అవార్డు విషయం తెలిసిన తర్వాత నేను ఫోన్‌ చేద్దామనుకునేలోపు చైతన్యగారే చేసి, మాట్లాడారు. ‘మనకి అభినందనలు.. థ్యాంక్స్‌ చందు’ అన్నారు. నాగార్జునగారు కూడా ఫోన్‌ చేశారు. కథ, కథనంతో పాటు హీరోని డిజైన్‌ చేసిన విధానం అద్భుతం అన్నారాయన.

ఇప్పుడు చైతన్యగారు అఫీషియల్‌గా బెస్ట్‌ యాక్టర్‌ అవడం హ్యాపీ. నిజానికి అల్లు అరవింద్, బన్నీ వాసుగార్లు, నేను ‘తండేల్‌’ చేద్దామనుకున్నప్పుడు ఫిషర్‌ మేన్‌ పాత్ర కోసం నాగచైతన్య అనే ఆలోచన మాకు అప్పటికి లేదు. కానీ, ఈ కథ గురించి తెలుసుకున్న ఆయన.. నేను చేస్తాను అని వచ్చారు. ‘తండేల్‌’ చిత్రం మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా చేరువ కావడం సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మా సినిమా గద్దర్‌ అవార్డుకి ఎంపిక కావడం అనేది హ్యాపీ. దేవుడికి థ్యాంక్స్‌.
– ‘తండేల్‌’ చిత్రదర్శకుడు చందు మొండేటి

చైతూకు అవార్డు రావడం ఆనందం: నాగార్జున
గద్దర్‌ అవార్డుల విజేతలందరికీ శుభాకాంక్షలు. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుగ్రహీత, మా నాన్నగారు పేరిట ఏయన్నార్‌ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు ఇది నిజమైన నివాళి. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లకు ధన్యవాదాలు. అలాగే జయసుధగారికి ఈ ఏడాది ఏయన్నార్‌ అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఆమె ఇందుకు అర్హురాలు. ఎన్టీఆర్‌ అవార్డు పురస్కారానికి ఎంపికైన చిరంజీవిగారికి శుభాకాంక్షలు. ‘తండేల్‌’ సినిమాలోని నటనకు గాను చైతూకు ఉత్తమ నటుడిగా అవార్డు రావడం సంతోషంగా ఉంది. దుళ్ల కొట్టావ్‌ నాన్న (నాగచైతన్యను ఉద్దేశించి...).

అరుదైన గౌరవంగా భావిస్తున్నాను
నాకు ఈ అవార్డు రావడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పేరు ప్రస్తావనకు వస్తే, నేను పాడిన పాటలను ప్రేక్షకులు వెంటనే జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. అవార్డులు మనకు ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. మాది నిజామాబాద్‌. భువనగిరిలో నా స్కూలింగ్‌ జరిగింది. వరంగల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా (‘రాజు వెడ్స్‌ రాంబాయి’) కథనం సాగుతుంది. దీంతో తెలంగాణ యాస కోసం నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.

మేం (ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి, ఈ పాట రచయిత మిట్టపల్లి శ్రీధర్, దర్శకుడు సాయిలు) కలిసి పని చేసుకునే ప్రాసెస్‌లో మేం క్రియేట్‌ చేసిన పాట ఇది (రాంబాయి నీ మీద నాకు .. పాటను ఉద్దేశించి..). మా టీమ్‌ అంతా సక్సెస్‌ అవ్వాలని కోరుకున్నాం. మా కష్టానికి అవార్డుల రూపంలో ఫలితం లభించిందని అనుకుంటున్నాను. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాకు ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమాకు అవార్డు వచ్చినా, ఇంకా అవార్డులు సాధించిన ‘దండోరా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘కోర్టు’, ‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమాల్లో  నేను భాగమై ఉన్నాను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను జాగ్రత్తగా పని చేసుకుంటూ వెళ్తుంటాను.  
– ఉత్తమ గాయకుడు అనురాగ్‌ కులకర్ణి

నా మనసుకి దగ్గరైన క్యారెక్టర్‌
‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాకు గాను ఉత్తమ నటిగా తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. భూమా దేవి (‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమాలో రష్మిక మందన్నా పాత్ర పేరు) నా మనసుకు ఎంతో దగ్గరైన పాత్ర. దర్శకుడు రాహుల్, గీతా ఆర్ట్స్, నిర్మాతలు ధీరజ్‌ మొగిలినేని, విద్యా అక్క... ఇలా ఈ టీమ్‌ అందరికీ కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిగార్లకు 
థ్యాంక్స్‌.   – ఉత్తమ నటి రష్మికా మందన్నా

మా నాన్న ఎమోషనల్‌ అయ్యారు
‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా చేయాలనుకున్నప్పుడు నేను ఏదీ ఆశించలేదు... నా మనసులో ఉన్నది ఒక్కటే... ‘ఈ సినిమా బాగా ఆడితే చాలు’. అది నెరవేరింది. నవంబరు 20న (2025) ఈ సినిమా ప్రీమియర్స్‌ వేశాం. చూసినవాళ్లందరూ బాగుందని మెచ్చుకున్నారు. ఆ రోజుని నేనెప్పటికీ మరచిపోలేను. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా అని భయపడ్డాను. 21న విడుదలైంది... అందరికీ నచ్చిందనే టాక్‌ వచ్చింది. లైఫ్‌లో మరచిపోలేను రోజు అది. ఇక అవార్డు రావడం అనేది షాకింగ్‌గా ఉంది. బలమైన కథతో నిజాయతీగా ఒక మంచి సినిమా తీయాలనే పట్టుదలతో చేస్తే, కచ్చితంగా ప్రశంసలు వస్తాయనే నమ్మకం ఏర్పడింది.

మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న ఎంతో కష్టపడి చదివించారు... మేం కూడా బాగా చదువుకున్నాం. ఘోరమైన కష్టాలు చూశాం. అయినప్పటికీ సినిమాలంటే నాకున్న ఇష్టాన్ని నా తల్లిదండ్రులు కాదనలేదు. ఇవాళ నాతో పాటు, మా సినిమాకి వచ్చిన అవార్డుల గురించి వినగానే మా నాన్న ఎమోషనల్‌ అయ్యారు... ఏడ్చేశారు. మా అమ్మ, నా ఇతర కుటుంబ సభ్యుల సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నా భార్య, నా కొడుకు ఈ అవార్డు గురించి విని, ఆనందపడ్డారు. ఇదంతా ఆ దేవుడి దయ. – ఉత్తమ దర్శకుడు సాయిలు కంపాటి

ఎన్టీఆర్‌ అవార్డు రావడం గౌరవం: చిరంజీవి
తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ – 2025 విజేతలందరికీ శుభాకాంక్షలు. మన సినీ పరిశ్రమలోని వారి కష్టాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం సంతోషంగా ఉంటుంది. ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుతో నన్ను గౌరవించిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లతో పాటు జ్యూరీ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఎన్టీఆర్‌గారి పేరుపై ఓ అవార్డు నెలకొల్పటం, ఆ అవార్డు నాకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నా ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలుస్తున్న వారందరి ప్రేమే నా బలం.

అవార్డులు వస్తే ఆ కిక్కే వేరు
‘దండోరా’ సినిమాకు మూడు విభాగాల్లో (ఉత్తమ ద్వితీయ చిత్రం, సపోర్టింగ్‌ యాక్టర్, సంగీత దర్శకుడు) అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం మంచి మోటివేషన్‌గా అనిపించింది. నా నెక్ట్స్‌ సినిమా కోసం మరింత బాధ్యతగా పని చేస్తాను. ఈసారి ఉత్తమ (తొలి) చిత్రం అవార్డు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తాను. ‘దండోరా’లాంటి కథను ప్రేక్షకులకు చెబితే నాకు గుర్తింపు వస్తుందని నమ్మాను. రిస్కీ ప్రాజెక్ట్‌గా అనుకోలేదు. ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాను. ఈ తరహా సినిమాలు తెలుగులో తక్కువగా వస్తుంటాయి.

సామాజిక అంశాలు మిళితమై ఉన్న ఈ సినిమాను ఎంటర్‌టైనింగ్‌ వేలో చెబితే ప్రేక్షకులకు చేరువ అవుతుందని నమ్మాను. నేను చూసిన కొన్ని పరిస్థితులను కల్పిత కథగా అల్లుకుని, ఈ సినిమా చేశాను. ఇక ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్‌ కె. రాబిన్‌కు అవార్డు రావడం సంతోషంగా ఉంది.

ఎందుకంటే ఓ దశలో ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన ఈ సినిమా కోసం వర్క్‌ చేశారు. మన సినిమా ద్వారా మన గురించి ప్రేక్షకులకు తెలియడం, మన కష్టాన్ని జ్యూరీ గుర్తించడం... ఇలా అవార్డులు వస్తే ఆ కిక్‌ వేరుగా ఉంటుంది. అలాగే ఎన్టీఆర్‌గారు మా ‘దండోరా’ సినిమాను ప్రశించడం మర్చిపోలేను. గద్దర్‌ అవార్డులను ప్రకటించిన  తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు.   – ‘దండోరా’ చిత్రదర్శకుడు మురళీకాంత్‌

నా తర్వాతి చిత్రాలకు ఓ బలం 
మా సినిమాకి అవార్డు రావడం మా కష్టానికి తగిన ఫలితంతో పాటు ప్రోత్సాహకంగా భావిస్తున్నాను. నా తర్వాతి చిత్రాలకు ఓ బలంలా అనిపిస్తోంది. ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ చిత్రకథ రాసినప్పట్నుంచి ఇప్పటివరకు అవార్డు వస్తుందని ఊహించలేదు. ఇది నాకో సర్‌ప్రైజ్‌లా ఉంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తొలి సినిమాకే అవార్డు అందుకోనుండటంతో నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ‘మా వాడి కష్టానికి తగిన ఫలితంతో పాటు అవార్డు రూపంలో మంచి ప్రోత్సాహం లభించింది’ అని అందరూ హ్యాపీ.

మా సినిమా అవార్డుకి ఎంపిక కావడంతో యూనిట్‌ ఫుల్‌ హ్యాపీ. నేను, తిరువీర్‌గారు, నిర్మాతలు సందీప్‌ అగరం, అస్మితా రెడ్డి బాసినిగార్లు కలిసి ఈ ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నాం. మా సినిమా కోసం పనిచేసిన దాదాపు 300 మంది యూనిట్‌ మెంబర్స్‌కి ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను.
– ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ దర్శకుడు రాహుల్‌ శ్రీనివాస్‌  

ఇది నాకో కొత్త ఆరంభం 
‘మిరాయ్‌’ అనుకున్నప్పుడు డైరెక్షన్‌ మాత్రమే చేయాలనుకున్నాను...  డీవోపీ (ఛాయాగ్రాహకుడు) నేను కాదు. అనుకోని పరిస్థితుల్లో ఈ బాధ్యతను కూడా నిర్వర్తించాను. అనుకోకుండా ఈ కేటగిరీకి అవార్డు కూడా వచ్చింది. ఇలా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉన్న సినిమాకి అవార్డు రావడం అంటే అది నిజంగా స్పెషల్‌ ఫీలింగ్‌. అయితే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు షూటింగ్‌కి ముందు చాలా వర్క్‌ చేయడం అవసరం. అలా ప్రీ వర్క్‌కి ఎక్కువ టైమ్‌ కేటాయించడంతో షూటింగ్‌ సులువు అయింది. ఈ సినిమా కోసం పక్షులు క్రియేట్‌ చేశాం.

ఒక డైరెక్టర్‌గా బర్డ్‌ ఎలా ఉండాలి? అని చెబితే ఒక కెమెరామేన్‌గా ఆ బర్డ్‌ కలర్, టెక్ట్స్‌ర్, సైజ్‌... అవన్నీ కెమెరాకి తగ్గట్టు ఎలా ఉండాలో డిజైనర్స్‌కి చె΄్పాలి. అయితే ‘మిరాయ్‌’కి నేను రైటర్, డైరెక్టర్, డీవోపీ కావడంవల్ల నాకు ఫుల్‌ క్లారిటీ ఉంటుంది కాబట్టి చెప్పి, చేయించుకున్నాను. మా సినిమా కథ హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ని డిమాండ్‌ చేసింది. ఎంతో జాగ్రత్తగా చేశాం. టెక్నికల్‌ విభాగంలోనే రెండు అవార్డు (సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌)లు రావడం పట్ల నేను, మా నిర్మాతలు (టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌) చాలా హ్యాపీగా ఉన్నాం. నేనైతే ఈ అవార్డు నా కెరీర్‌కి ఒక కొత్త స్టార్ట్‌లా భావిస్తున్నాను. – ‘మిరాయ్‌’ డైరెక్టర్‌–సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement