స్థానికంగానే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు! | Selection of beneficiaries of double bedroom houses by the end of this month | Sakshi
Sakshi News home page

స్థానికంగానే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు!

Mar 8 2026 4:34 AM | Updated on Mar 8 2026 4:34 AM

Selection of beneficiaries of double bedroom houses by the end of this month

5 కి.మీ. పరిధిలోని అర్హులైనవారికి తొలి ప్రాధాన్యం 

ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక  

సాక్షితో హౌసింగ్‌ బోర్డు ఎండీ గౌతమ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సొంతింటి కలను సాకారం చేసుకునే క్ర­మంలో పేదలు తమ ఉపాధిని, సామాజిక జీవనాన్ని కోల్పో­కుండా ఇకపై లబ్దిదారులకు ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతానికి గరిష్టంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గృహ సముదాయాల్లోనే ఇళ్లను కేటాయించనున్నట్లు హౌసింగ్‌ బోర్డు ఎండీ వీపీ గౌతమ్‌ వెల్లడించారు. శనివారం ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..  సాధారణంగా గృహనిర్మాణ పథకాల కింద ఇళ్లను కేటా­యించి, లబ్ధిదారులను సుదూర ప్రాంతాలకు తరలించడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంటుంది. 

ఈ సమస్య కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ పరిధిలో అధికంగా ఉన్నట్లు గుర్తించాం. గతంలో ఉన్నట్లు కాకుండా లబి్ధదారులను దూర ప్రాంతాలకు తరలించే పరిస్థితిని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు కొత్తగా మార్గదర్శకాలను జారీ చేశాం. లబ్ధిదారుల ఎంపికలో ఆయా గృహ సముదాయాలకు సమీపంలో నివాసం ఉన్న వారికే తొలి ప్రాధాన్యం ఇస్తాం. జీవో నంబర్‌ 33 మార్గదర్శకాలకు అనుగుణంగా కోర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన, నిర్మాణాలు కొనసాగుతున్న సుమారు 25,619 గృహాలను యుద్ధప్రాతిపదికన లబ్దిదారులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. 

ఈనెల చివరి నాటికి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి, ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేస్తాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తి మౌలిక సదుపాయాలతో ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జూన్‌ నాటికి కనీసం 10 వేల ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.  

‘ఇందిరమ్మ’కింద ఆర్థిక చేయూత 
మహానగర పరిధిలో ‘ఇందిరమ్మ ఇళ్ల‘పథకం కింద స్థలాలు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు సొంత గృహ నిర్మాణాలకు త్వరలో అనుమతులు, ఆర్థిక చేయూత మంజూరు చేస్తాం. ఇప్పటికే సుమారు 18,000 మంది లబ్దిదారులను గుర్తించాం. మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను ఈ నెల 31 నాటికి ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నాం. 

మహానగర్‌ పరిధిలో మురికివాడల స్థానంలో సుమారు 25,000 గృహాలను గరిష్టంగా జీ+5, జీ+10 వరకు భవన సముదాయాలను నిర్మించి మెరుగైన నివాస సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించాం. ప్రస్తుతం వారు ఉంటున్న ప్రాంతాల్లోనే అత్యాధునిక భవనాలను నిర్మిస్తాం. అలాగే దశాబ్దాల క్రితం నిర్మించిన శిథిలావస్థలో ఉన్న ఈడబ్ల్యూఎస్, వాంబే గృహాల స్థానంలో కూడా కొత్త భవనాలను నిర్మించి, అక్కడి నివాసితులకు మెరుగైన గృహాలను అందిస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement