పాత అసెంబ్లీ.. మళ్లీ కొత్తగా! | Revitalization of the Nizam era Town Hall | Sakshi
Sakshi News home page

పాత అసెంబ్లీ.. మళ్లీ కొత్తగా!

Mar 8 2026 4:26 AM | Updated on Mar 8 2026 4:26 AM

Revitalization of the Nizam era Town Hall

నిజాం కాలం నాటి టౌన్‌ హాల్‌కు పునరుజ్జీవం 

శిథిలావస్థలో ఉన్న భవంతికి పునర్వైభవం 

పాత గదులకు కొత్త సొబగులు.. అధునాతన వసతులు 

పాశ్చాత్య నిర్మాణ శైలికి నిలువుటద్దం 

నేడు మండలి భవనాన్నిప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి 

(సాక్షి, హైదరాబాద్‌)  : హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ‘పాత అసెంబ్లీ’గా పేరుగాంచిన గ్రాండ్‌ టౌన్‌ హాల్‌ భవనానికి 1905లో అప్పటి నిజాం మహబూబ్‌ అలీ ఖాన్‌ శంకుస్థాపన చేశారు. 1913లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం నాటి నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తూ నగర చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తోంది. భారతీయ సంప్రదాయ, పాశ్చాత్య నిర్మాణ శైలి (ఇండో సెరాసోనిక్‌ వాస్తు శైలి లేదా ఇండో గోతిక్‌ నిర్మాణ శైలి) సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది. 

భవనం బాహ్య భాగంలో భారతీయ నిర్మాణ శైలికి ప్రత్యేకమైన గొప్ప కెనోపీలు, వంపు గవాక్షాలు, అలంకార స్తంభాలు, సున్నితమైన బ్రాకెట్లు కనిపిస్తాయి. అంతర్గత భాగంలో మాత్రం పాశ్చాత్య శైలిలో కోరింథియన్‌ స్తంభాలు, పూల అలంకరణలు, విక్టోరియన్‌ మింటన్‌ టైల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు వేదికగా నిలిచిన ఈ భవనం 2017 వరకు వినియోగంలోనే ఉంది. 

2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ అసెంబ్లీకి కేటాయించారు. రెండేళ్ల పాటు ఈ భవనంలోనే కొనసాగిన ఏపీ అసెంబ్లీని ఆ తర్వాత అమరావతికి తరలించారు. భవనంలోని విద్యుత్, ఇతర ఫర్నిచర్‌ తదితరాలను ఏపీకి తరలించే క్రమంలో సీలింగ్, ఫ్లోరింగ్‌ వంటివి దెబ్బతిన్నాయి. 

శిథిలావస్థకు చేరిన చారిత్రక భవనం 
శతాబ్దానికిపైగా వినియోగంలో ఉన్న ఈ భవనం 2017 నాటికి పైకప్పు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల బలహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. చారిత్రక భవనాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినా నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించింది. ఈ దశలో కుతుబ్‌షాహీ టూంబ్స్‌తోపాటు సుమారు వంద వరకు చారిత్రక భవనాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించిన ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్, రోడ్డు భవనాల శాఖతో కలిసి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సంకల్పించింది. 

భవనం అసలు నిర్మాణాన్ని కాపాడుతూ సంప్రదాయ నిర్మాణ పదార్థాలు, పాత పద్ధతులను మేళవించి నిపుణులైన కళాకారులతో రూ.30 కోట్లతో ఈ పనులు చేపట్టారు. సుమారు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవన పునరుద్ధరణలో వందలాది కళాకారులు పాలుపంచుకున్నారు. అత్యవసర ప్రాధాన్యతతో చేపట్టిన ఈ పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి అయ్యాయి. 

సంరక్షణలో అనేక సవాళ్లు
భవనంలో దెబ్బతిన్న లేదా కనుమరుగైన నిర్మాణ అంశాలను గుర్తించేందుకు విస్తృత పరిశోధన, సాంకేతిక పరిశీలనలు చేపట్టారు. వాటి ఆధారంగా భవనం నిర్మాణ బలాన్ని కాపాడుతూ పునరుద్ధరణ పనులు నిర్వహించారు. అయితే భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరాల వల్ల కొన్ని అసలు నిర్మాణ లక్షణాలను పూర్తిగా పునరుద్ధరించడం సాధ్యపడలేదు. 

ప్రత్యేకంగా ప్రధాన సభా మందిరంలోని కిటికీలను తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు, అలంకార ప్రవేశ ద్వారం కొంతవరకు కప్పేశాయి. భవనానికి ముందు, వెనుక భాగాల్లో నిర్మించిన ఆర్‌సీసీ నిర్మాణాలు అసలు ఆర్కేడ్లను అడ్డుకోవడంతో సరైన గాలి, వెలుతురు లేకుండా పోయింది. మరోవైపు పాత భవనం చుట్టూ వివిధ సందర్భాల్లో చేపట్టిన ఇతర నిర్మాణాల మూలంగా భవనంలోని అసలు వర్షపు నీటిపారుదల వ్యవస్థ కూడా మూసుకుపోయింది. దీంతో తీవ్రమైన నీటి లీకేజీతో పైకప్పు బలహీనపడింది. 

ఈ సమస్యలను పరిష్కరించడం పునరుద్ధరణలో సవాల్‌గా నిలిచింది. లైమ్‌ మోరా్టర్‌ నిపుణులు, మట్టి కళాకారులు, రాగి పనివాళ్లు, సంప్రదాయ టైల్స్‌ తయారీదారులు, కార్పెంటర్లు సహా అనేక రంగాల కళాకారులు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. మొత్తం 50వేలకు పైగా పనిదినాలు ఈ ప్రాజెక్టుకు వినియోగించారు. 

ప్రధాన సభా మందిరంలోనూ.. 
భవనంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం ప్రధాన సభా మందిరంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ నిర్మాణాలను తొలగించడంతో ఇటుకలతో కూడిన జాక్‌ ఆర్చ్‌ నిర్మాణం బయటపడింది. హాల్‌లోని గోడలపై పూసిన ఎనామెల్‌ పెయింట్‌ పొరలను కూడా తొలగించడంతో ఒరిజినల్‌ శైలి బయట పడింది. 10వేల చదరపు అడుగులకుపైగా గోడలపై ఉన్న పూతలను తొలగించి అసలు స్టక్కో అలంకరణలను వెలికితీశారు. 

కోరింథియన్‌ స్తంభాలు, అలంకార బ్రాకెట్లు, గవాక్షాలపై ఉన్న శిల్పాలను శుభ్రపరచి పునరుద్ధరించారు. హాల్‌ రెండు వైపులా తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు అసలు గవాక్షాల అందాన్ని తగ్గిస్తున్నాయని గుర్తించి సవరించారు. కారిడార్లలోనూ గాలి, వెలుతురు వచ్చేలా చేశారు. కారిడార్లు, మొదటి అంతస్తులో పాతకాలం నాటి విక్టోరియల్‌ టైల్స్‌తో మరమ్మతులు చేశారు.  

బాహ్య భాగంలో అలంకార శిల్పాలు 
భవనం బాహ్య నిర్మాణంలో బ్రాకెట్లు, చత్రాలు, ఫినియల్స్‌ వంటి అలంకార శిల్పాలు విస్తారంగా ఉన్నాయి. పునరుద్ధరణకు ముందు ఇవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చజ్జాలు విరిగిపోవడం, బ్రాకెట్లు పగలడం వంటి సమస్యలు కనిపించాయి. తర్వాత 100 మీటర్లకు పైగా చజ్జాలను సంప్రదాయ పద్ధతిలో పునర్మించారు. 1.5 నుంచి 3 అడుగుల ఎత్తు కలిగిన 250కిపైగా అలంకార పూలకుండలను సంప్రదాయ పద్ధతిలో తయారు చేశారు. 

రాతి నిర్మాణాన్ని శుభ్రపరిచి అసలు నేలస్థాయిని గుర్తించి చుట్టుపక్కల మట్టిని తగ్గించారు. నీటి చొరబాటును నివారించేందుకు 50 మి.మీ మందంతో గ్రానైట్‌ రక్షణ పొర ఏర్పాటు చేశారు. మొత్తంగా శాసన మండలి భవనం పునరుద్ధరణతో చారిత్రక నిర్మాణ కళను పునరుజ్జీవింపజేసి తెలంగాణ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిపే ప్రయత్నాలు చేశారు. 

ఆధునిక వసతులతో ఏర్పాట్లు
తెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దాం. కేవలం ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసుకున్న ఈ భవ నంలో అధునాతన, సౌండ్‌ లైటింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. 

ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్‌చైర్మన్, చీఫ్‌ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్‌లు సిద్ధం చేశారు. భవిష్య త్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్‌ టెక్నాలజీతో సీటింగ్‌ ఏర్పాట్లు ఉన్నా యి. సీఎం రేవంత్‌ రెడ్డి మార్చి 8న ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. – గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement