‘విజయ’ పేరుతో కల్తీ నెయ్యి | Vijaya Dairy Telangana Chairman Gutta Amit Reddy on ghee | Sakshi
Sakshi News home page

‘విజయ’ పేరుతో కల్తీ నెయ్యి

Mar 8 2026 5:19 AM | Updated on Mar 8 2026 5:19 AM

Vijaya Dairy Telangana Chairman Gutta Amit Reddy on ghee

మేఘనా ఫుడ్స్‌ ఫ్రాంచైజీ చేస్తున్న నిర్వాకమిదీ 

ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖలు రాసినా స్పందించలేదు 

ఏపీ ప్రభుత్వం ఫ్రాంచైజీని విరమించుకోవాలి 

లేదంటే తెలంగాణ సహకారంతో మేమే అడ్డుకుంటాం 

ఒక్క హైదరాబాద్‌లోనే నెలకు 100 టన్నుల కల్తీ నెయ్యి అమ్మకాలు 

దీంతో ‘విజయ’బ్రాండ్‌కు చెడ్డపేరు తెస్తున్నారు 

విజయ డెయిరీ తెలంగాణ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి  

లాలాపేట: సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విజయ డెయిరీ బ్రాండ్‌(ఏపీ)ను మేఘనా ఫుడ్స్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు ఫ్రాంచైజీ అప్పజెప్పడంతో వారు వెజిటెబుల్‌ ఆయిల్స్‌తో నెయ్యి తయారు చేసి ఏపీ విజయ పేరుతో కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారని తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) తెలంగాణ చైర్మన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి అన్నారు.  ఒక్క హైదరాబాద్‌లోనే నెలకు దాదాపు 100 టన్నుల కల్తీ నెయ్యి విక్రయిస్తూ విజయ బ్రాండ్‌కు చెడ్డపేరు తీసుకురావడంతోపాటు తెలంగాణ పాడి రైతాంగానికి తీవ్రమైన నష్టం కల్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

వెజిటెబుల్‌ ఆయిల్‌తో తయారు చేసిన నెయ్యిలో మోతాదుకు మించి హానికరమైన రసాయనాలు ఉన్నట్లు ఎన్‌డీడీబీ(నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు) పరీక్షలు చేసి తేల్చిందని అమిత్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం లాలాపేటలోని విజయ భవన్‌లో ఎండీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాటాడారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి పాల సేకరణగానీ, పాల విక్రయం కానీ చేయడంలేదన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు గుజరాత్‌లో తయారు చేసిన నెయ్యిని ఏపీ విజయ డెయిరీ పేరుతో హైదరాబాద్‌లో విక్రయిస్తూ ఇక్కడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. 

రైతుల ద్వారా సేకరించిన పాలు, పాల పదార్థాల నాణ్యతకు మారుపేరుగా తెలంగాణ విజయ నిలుస్తోందన్నారు. ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయ తెలంగాణ బ్రాండ్‌ విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విజయ పేరుతో ఎవరూ కల్తీ చేసినాఅడ్డుకుని తీరుతామన్నారు.అవసరమైతే రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పలు లేఖలు రాసామని, స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా స్పందనలేదని పేర్కొన్నారు. 

ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి మేఘనా ఫుడ్స్‌కు ఇచ్చిన విజయ ఫ్రాంచైజీని విరమించుకోవాలని, లేదంటే తెలంగాణ సహకారంతో దాన్ని తామే అడ్డుకుంటామన్నారు. పాలు, పాల పదార్థాలు కొనేటప్పుడు నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ విజయ లోగోను చూసి మాత్రమే పాలు, నెయ్యి ఇతర పాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి వినియోగదారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement