ముందుగానే మండుతున్నాయ్‌! | Temperatures of 40 degrees recorded in many places in the state | Sakshi
Sakshi News home page

ముందుగానే మండుతున్నాయ్‌!

Mar 8 2026 4:51 AM | Updated on Mar 8 2026 4:51 AM

Temperatures of 40 degrees recorded in many places in the state

ఏప్రిల్‌లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే... 

రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు  

సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వాతావరణం నడివేసవిని తలపిస్తోంది. సీజన్‌ ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగతలు నమోదు కావాల్సి ఉండగా... చాలాచోట్ల సాధారణం కంటే సుమారు 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, ఆకాశం నిర్మలంగా ఉండటం, మేఘాలు లేకపోవడం, గాలిలో తేమశాతం తగ్గడంతో వేడిమి అధికంగా ఉంది. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. 

ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్‌ మధ్యలో ఉండాలి. కానీ 40 డిగ్రీలకు పైబడి నమోదవుతుండటం మున్ముందు పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఏప్రిల్‌లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతుండటం కలవరపెడుతోంది. శనివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 40.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 

నల్లగొండ మినహా అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.9 డిగ్రీలు అధికంగా నమోదు కాగా... ఆదిలాబాద్‌లో 2.8, భద్రాచలంలో 2.7, హనుమకొండలో 2.1 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజుల పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. 

కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. దీంతో సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. శనివారం ఒడిశా పరిసర ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇది తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు సముద్రమట్టం నుంచి సగటున 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వచ్చేవారం చివర్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement