మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో డీజీపీ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతి, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్‌కుమార్ తదితరులు
మీ రక్షణ బాధ్యత నాది.. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదు
130 మంది మావోయిస్టుల లొంగుబాటు సందర్భంగా సీఎం రేవంత్
ఎవరి ప్రాణం పోవద్దన్నదే మా ప్రభుత్వ విధానం
మావోయిస్టుల్లో గణపతి సహా ఏడుగురు తెలంగాణ వాళ్లు మిగిలారు
అవకాశం మేరకు నగదు పురస్కారాలు పెంచుతాం..
ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలం ఇస్తాం
మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య భద్రత కార్డు అందిస్తాం
కేసుల ఎత్తివేతపై కమిటీ వేస్తాం
సాక్షి, హైదరాబాద్: ‘గణపతి.. ఆయుధాలు అప్పగించి లొంగిపోండి. తెలంగాణ ప్రభుత్వం మీ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం సూచించారు. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని.. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాం«దీజీ మార్గంలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. సాయుధ బలగాలైనా, మావోయిస్టులైనా దేశ పౌరులేనని.. ఎవరి ప్రాణానికీ నష్టం జరగొద్దన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు.
తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని చెప్పారు. మావోయిస్టు పారీ్టలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో లొంగిపోయారు. 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్‌కుమార్, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
దేశ చరిత్రలోనే భారీ లొంగుబాటు..
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ చీఫ్ సుమతితోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఆయుధాలు విడిచి లొంగిపోయే మావోయిస్టుల రక్షణ, ఆరోగ్య భద్రత, ఇతర పునరావాసం విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులంతా బయటికి వచ్చి తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సూచించారు.
అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారన్నది సమాచారం తమ వద్ద లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక కుటుంబ సభ్యలతో శాంతియుత జీవితం గడుపుతారా అనేది వారి ఇష్టమని సీఎం పేర్కొన్నారు. మంత్రి సీతక్క సహా ఎందరో మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరైనా కాంగ్రెస్ పారీ్టలో చేరాలనుకుంటే గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అందుబాటులో ఉంటారని చెప్పారు.
చర్చలే పరిష్కారం..
‘మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారు. ప్రపంచానికి శాంతిమార్గాన్ని చూపారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. తెలంగాణ గడ్డపై హింస కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతియుత మార్గాన్నే అనుసరిస్తోంది. మావోయిస్టుల్లో ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారికి సీఎంగా పిలుపునిస్తున్నా. అందరూ జనజీవన స్రవంతిలోకి రండి. తెలంగాణ ప్రభుత్వం మీతో చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
లొంగిపోయేవారు ఆత్మగౌరవంతో బతికేలా సహకరిస్తాం..
‘ఇటీవల లొంగిపోయిన దేవ్‌జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి సహా అందరూ నన్ను కలిసి ఎన్నో అంశాలపై మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులతోపాటు అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులతో చర్చించి సీపీఎం మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర స్థాయిలోని అంశాలను పరిష్కరిస్తామని.. నక్సలిజం జాతీయ సమస్య కాబట్టి కేంద్రంతో మాట్లాడతామని వారికి చెప్పాను.
రివార్డుల మొత్తం పెంపు, ఇల్లు, వ్యవసాయ భూమి కేటాయింపు, వైద్య సాయం కోసం లొంగిపోయిన మావోయిస్టులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సానుకూలంగా ఉన్నాం. లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతోపాటు నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తాం. రివార్డుల మొత్తాన్ని పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తాం. పునరావాసం మెరుగ్గా అందించే అంశంపై సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో అధ్యయం చేసి వాటిని పెంచే ప్రయత్నం చేస్తాం.
చట్ట పరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. లొంగిపోయే వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వారి సొంత గ్రామాల్లో స్థలాలు ఇస్తాం. భూములు అందుబాటులో లేనందున వ్యవసాయ భూమి కేటాయింపులో మాత్రం ఇప్పుడే మాట ఇవ్వలేను. లొంగిపోయిన మావోయిస్టులు సమాజంలో ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానం కొనసాగించేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు.
అమిత్ షా పూర్తి స్వేచ్ఛనిచ్చారు..
‘లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక వెసులుబాటు కల్పన, నివాస స్థలం, ఇళ్ల కేటాయింపు అంశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మాజీ మావోయిస్టు నాయకుల ప్రతిపాదనలను ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ మేరకు ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరపడం వల్ల దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో, పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 2024 తర్వాత నుంచి 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 250కిపైగా ఆయుధాలు స్వాధీనం చేశారు. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని నమ్మి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు’అని రేవంత్ అన్నారు.


