సముద్రాలకు రక్షణ సైన్యం | Special Guest Column Story On The Occasion Of World Mangrove Day | Sakshi
Sakshi News home page

సముద్రాలకు రక్షణ సైన్యం

Jul 25 2026 1:55 PM | Updated on Jul 25 2026 1:55 PM

Special Guest Column Story On The Occasion Of World Mangrove Day

కోస్తా తీరప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడే మడ అడవులు, సరుగుడు చెట్లు, అరుదైప వృక్షాలు క్రమంగా అంతరించి పోతున్నాయి. చాలామందికి మడ అడవులు అంటే సముద్రం పక్కన పెరిగే కొన్ని చెట్లు మాత్రమే. కానీ అవి కేవలం చెట్లు కావు. అవి ఒక సంపూర్ణ జీవ వ్యవస్థ. సముద్రం, నదులు, నేల, చేపలు, పక్షులు, మనుషులు... ఇవన్నింటినీ ఒకే దారంతో కలిపే ప్రకృతి వలయం.

సముద్రపు ఉప్పునీటిలోనూ మనగలిగే ఈ అడవులు లేకపోతే తీరప్రాంత మత్స్య సంపదలో గణనీయమైన భాగం ఉండదు. అనేక చేపలు, రొయ్యలు, పీతలు తమ జీవితాన్ని ప్రారంభించేది ఈ మడ అడవుల్లోనే. అందుకే మడ అడవులను శాస్త్రవేత్తలు ‘సముద్రా నికి నర్సరీ’ అని పిలుస్తారు. మడ అడవుల వేర్లు సముద్ర అలల వేగాన్ని తగ్గిస్తాయి. మట్టిని నిలబెడతాయి. తుఫాను ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

1977 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ను తాకిన దివిసీమ ఉప్పెన దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ప్రకృతి విపత్తుల్లో ఒకటి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. సముద్రంతో యుద్ధం చేయడం కాదు... దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆ రోజు ప్రకృతి ఒక కఠినమైన పాఠం నేర్పింది. మడ అడవులను కాపాడటం ద్వారా ఇటువంటి విపత్తు
లను కాపాడవచ్చు.

‘సముద్రాన్ని ఆపేశాము’!
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మడ మొక్కలను పెంచడం, చేపల పెంప కాన్ని మడ అడవులతో అనుసంధానం చేయడం, ఉప్పునీటిలో సాగు చేయగల పంటలను ప్రోత్సహించడం వంటి చర్యలు పర్యా వరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధిని కూడా బలోపేతం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా తీరప్రాంతంలో కొన్ని గ్రామాలను సముద్రం మింగేస్తోంది. అయితే ‘మా ఊరికి రాకుండా సముద్రాన్ని ఆపేశాము’ అంటారు కృష్ణా జిల్లా తీరప్రాంత గ్రామం బసవాని పాలెంకు చెందిన పద్మ. సముద్ర నీటి మట్టం పెరిగినపుడల్లా తీరప్రాంతం కోతకు గురయ్యేది. ఎం.ఎస్‌. స్వామినా«థన్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఎస్‌జీహెచ్‌ మహిళలు దశాబ్దం క్రితం నాగాయి లంక, బసవవాని పాలెంలో 200 హెక్టార్లలో మడ మొక్కలను నాటారు. ఇపుడు అవి అడవిగా మారి తీర ప్రాంతానికి రక్షణ కవచంగా మారాయి.

వీరి కృషి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ప్రకృతిని కాపాడితే... ప్రకృతి మనిషిని కాపాడుతుంది. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు. మడ అడవులను కాపాడటం అటవీ శాఖ బాధ్యత మాత్రమే కాదు. ఇది పర్యావరణ శాఖ, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మత్స్యకారులు, రైతులు కలిసి చేయాల్సిన పని.

ప్రతి జిల్లాలో మడ అడవుల మ్యాపింగ్‌ జరగాలి. దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ చేపట్టాలి. తీరప్రాంత గ్రామాల యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. సముద్రాన్ని మనం ఆపలేము. తుఫాన్లను కూడా ఆపలేము. కానీ వాటి విధ్వంసాన్ని తగ్గించే సహజ రక్షణ కవచాన్ని మాత్రం కాపాడగలం.
– శ్యాం మోహన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ (రేపు ప్రపంచ మడ అడవుల దినోత్సవం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement