అగడం.. బగడం..
బాలి దీవిలో ఆకాశంపైకి ఎటు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఇదే దృశ్యం బాలి దీవికి కళ తీసుకొస్తుంది. ఈ గాలిపటాల వేడుకను దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో బాలి దీవికి చేరుకుంటారు. ఇండోనేషియాలోని బాలి దీవిలో ఏటా జరిగే ‘బాలి కైట్ ఫెస్టివల్’ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.
కైట్స్ ఫెస్టివల్ బాలి అంతటా వివిధ ప్రాంతాలలో జరుగుతుంది. అయితే, ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభ, ముగింపు వేడుకలు మాత్రం సనుర్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పడంగ్‌గలక్ బీచ్‌లో నిర్వహిస్తారు. ఈ వేడుకలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో పాటు మస్కెటి బీచ్, మెర్తాసరి బీచ్, కుటా, ఉబుద్, దెన్ పసార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతాయి. ఈ వేడుకల సమయంలో ప్రతిచోటా వినిపించే బాలి సాంప్రదాయ సంగీతమైన ‘గమేలాన్ ఆర్కెస్ట్రా’ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం, ఈ గాలిపటాల పండుగ కేవలం ఒక వినోదం మాత్రమే కాదు. పంటలు సమృద్ధిగా పండినందుకుగాను దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ఆశీస్సులు కోరుతూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ‘బంజర్’ అని పిలిచే స్థానిక యువజన సంఘాలు, వారి ‘సెకా లాయంగన్’ అంటే గాలిపటాల బృందాలతో కలిసి ఈ పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి కోసం తలపడతాయి. ప్రతి బృందంలో 70 నుంచి 80 మంది సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి గాలిపటాలను సిద్ధం చేయడం, వాటిని గాల్లోకి ఎగరేయడం ఒక అద్భుతమైన టీమ్‌వర్క్. ఈ పోటీలలో అత్యంత సృజనాత్మకమైన, వినూత్నమైన గాలిపటానికి ‘న్యూ క్రియేషన్’ అవార్డుతో పాటు భారీ నగదు బహుమతిని కూడా అందజేస్తారు. త్రీ–డైమెన్షనల్ రూపాలు, వివిధ రకాల మస్కట్‌ల ఆకృతులలోని గాలిపటాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.

త్రిమూర్తుల సంకేతం..
ఈ ఉత్సవాల్లో మూడు రకాల గాలిపటాలను తయారుచేస్తారు. జాంఘన్ అనే గాలిపటం పక్షి ఆకారంలో ఉంటూ, దాదాపు 100 మీటర్ల కంటే పొడవైన తోకను కలిగి ఉంటుంది. రెండవది బెబీయన్ అని పలిచే గాలిపటం. ఇది చేప ఆకారంలో ఉండి అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. ఇక మూడోది పెకుకాన్ గాలి పటాలు. ఇవి ఆకు ఆకారంలో ఉండి గాలిలో స్థిరంగా ఉండవు. అందువల్ల దీన్ని గాలిలో ఎగురవేయడానికి 10 మందికి పైగా నిపుణులైన ఫ్లైయర్స్ అవసరమవుతారు.
అంతేకాకుండా ఈ సాంప్రదాయ గాలిపటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఎరుపు, తెలుపు, నలుపు రంగులు హిందూ త్రిమూర్తులను సూచిస్తాయి. ఎరుపు రంగు సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడిని, తెలుపు రంగు రక్షకుడైన విష్ణుమూర్తిని, నలుపు రంగు లయకారుడైన శివుడిని సూచిస్తాయి. అలాగే అష్టదిక్పాలకులను గౌరవిస్తూ పసుపు రంగును కూడా జోడిస్తారు.


