దెయ్యం అనుకుని చంపాను... | Leegalata Sunday Special Crime Story Written By Dileep Madireddy | Sakshi
Sakshi News home page

దెయ్యం అనుకుని చంపాను...

Jul 26 2026 8:37 AM | Updated on Jul 26 2026 10:28 AM

Leegalata Sunday Special Crime Story Written By Dileep Madireddy

లీగలాటా

మనిషి భయంతో ఉన్నప్పుడు తాడు కూడా పాములా కనిపిస్తుంది. ఒక్కోసారి ఎదురుగా ఉన్న మనిషిని కూడా దెయ్యంలా భ్రమింప చేస్తుంది. ఆ రాత్రీ సరిగ్గా ఇలానే జరిగింది. ఎదురుగా చీకట్లో  కనిపిస్తున్న మహిళలే ఆ ఊరికి పట్టిన దెయ్యాల్లా ఓ వ్యక్తి భావించాడు. చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేశాడు.

ఓ మహిళ ప్రాణం గాల్లో కలిసిపోయింది. కొంతసేపటికి అతని భ్రమ తొలగింది. వాస్తవం అర్థమైంది. భయం కారణంగా నేరానికి పాల్పడితే చట్టం రక్షిస్తుందా? భ్రమలో ప్రాణం తీస్తే శిక్ష ఉండదా? ఇదో అరుదైన కేసుగా నిలిచింది.

ఆశ కేన్సర్‌ ఉన్న వాడ్ని కూడా బతికిస్తుంది. భయం ఏ రోగం లేని వాడిని కూడా చంపేస్తుంది. అలాంటి భయం– దెయ్యాలున్నాయనే ఓ గూర్ఖా నమ్మకం ఒక అమాయక మహిళ ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్రంగా గాయపరిచింది. అతడ్ని నిందితుడ్ని చేసింది. భ్రమలో జరిగిన నేరంగా పరిగణించాలని నిందితుడు, ఐపీసీ సెక్షన్‌  79 ఇతడికి రక్షణ కల్పించదని ప్రభుత్వం – ఇరు పక్షాలు కోర్టులో వాదించాయి. చివరకు ఈ కేసును ఉన్నత న్యాయస్థానం పరిష్కరించింది.

ఒడిశా బాలేశ్వర్‌ జిల్లాలోని రాసగోవింద్‌పూర్‌ గ్రామానికి సమీపంలో ఓ పాడుబడిన విమానాశ్రయం ఉంది. అక్కడ ఉన్న పాత వస్తువులను కొనేందుకు కలకత్తాకు చెందిన ఛటర్జీ అనే వ్యక్తి తన సేవకుడు, నేపాల్‌కు చెందిన గూర్ఖా రామ్‌ బహదూర్‌ థాపాతో అక్కడికి వెళ్లాడు. ఆ విమానాశ్రయ ప్రాంతాన్ని ‘దెయ్యాలు తిరిగే ప్రదేశంగా’ ఆ సమీప గ్రామాల ప్రజలు భావించేవారు. ఆ భయంతో రాత్రిపూట ఆ దారి గుండా తమ గ్రామాలకు ఒంటరిగా వెళ్లేందుకూ భయపడేవారు.

చీకట్లో ఘోరం..
సమీపంలోని తేల్‌కుండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా తన గ్రామానికి వెళ్లేందుకు భయపడి రాసగోవింద్‌పూర్‌ గ్రామంలోనే ఉండిపోయాడు. ‘నీ ఊరికి వెళ్లేందుకు మేము తోడుగా వస్తామ’ని చటర్జీ, థాపా ఆ వ్యక్తికి చెప్పారు. ముగ్గురూ కలిసి బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక అటవీ ప్రాంతంలో మసక వెలుతురులో మూడు నల్లటి ఆకారాలు వీరి కంటపడ్డాయి. దీంతో వీరి పైప్రాణాలు పైనే పోయాయి. భయంతో వణికిపోయారు. అవి దెయ్యాలే అని బలంగా నమ్మారు. ఆ ఆకారాలు దగ్గరకు రాగానే వెంటనే థాపా కత్తితో ఆ ముగ్గురిపై దాడికి దిగాడు. హాహాకారాలు వినిపించడంతో తేరుకున్న థాపా– పరీక్షించి చూడగా వారు సమీప గ్రామానికి చెందిన మహిళలు. అడవిలో విప్ప పూలను సేకరించేందుకు అక్కడికి వచ్చారని తెలిసింది. అప్పటికే ఓ మహిళ చనిపోయింది. మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

కోర్టులో విచారణ..
థాపాపై ఐపీసీ 302, 326,324 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. ‘తాను మనుషులపై కాకుండా దెయ్యాలపై దాడి చేస్తున్నాననే భ్రమలో ఈ చర్యకు పాల్పడినట్టు సెషన్స్‌ కోర్టుకు థాపా వివరించాడు. ఐపీసీ సెక్షన్‌ 79 ప్రకారం రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడలేదు. మంచి విశ్వాసంతో జరిగిన పొరబాటు చర్యగా కోర్టు భావించింది. సెక్షన్‌ 79 వర్తిస్తుందని సెషన్స్‌ కోర్టు అతడ్ని నిర్దోషిగా విడుదల చేసింది.

హైకోర్టులో వాదనలు..
సెషన్స్‌ కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. దాడి జరిగిన సమయంలో  తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ ఘటన జరిగేది కాదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అతని చేతిలోని టార్చ్‌ వేసి ఆ ఆకారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించాడు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా, అజాగ్రత్త కారణంగా ఓ వ్యక్తి మరణానికి, మరో ఇద్దరు గాయపడడానికి కారణం అయ్యాడని కోర్టుకు వివరించాడు. ఐపీసీ సెక్షన్‌ 304ఏ, 336 కింద శిక్షార్హుడని వాదించాడు. సాక్షుల విశ్వసనీయతపైనా కోర్టు పలు సందేహాలు వెలిబుచ్చింది. ఛటర్జీ సాక్ష్యం మాత్రమే స్థిరంగా, విశ్వసనీయంగా ఉందని దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. 

‘ఒక వ్యక్తి తాను చేస్తున్న పని చట్టపరంగా సరైందే అని అతను నమ్మితే సరిపోదు; ఆ నమ్మకం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడంలో పొరపాటు; ఆ పని నిజాయితీతో, తగిన జాగ్రత్తతో ఉండాల’ని కోర్టు పేర్కొంది. ‘జాగ్రత్త’ అనే ప్రమాణాన్ని అన్ని సందర్భాల్లో, అందరికీ ఒకేలా వర్తింప చేయలేమని పేర్కొంది. వ్యక్తులు, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండొచ్చని వెల్లడించింది. వేర్వేరు కేసుల్లో ఇది మారొచ్చని చెప్పింది. ఈ కేసులో అక్కడి పరిస్థితులు, అతని మానసిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. మరింత జాగ్రత్తగా, అప్రమత్తతో వ్యవహరించి ఉంటే ఈ ఘటనను నివారించగలిగే వాడనే కారణంగా సెక్షన్‌ 79 రక్షణను నిరాకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. సెషన్స్‌ కోర్టు జడ్జి ఉత్తర్వులు సరైనవేనని ధ్రువీకరిస్తూ, అప్పీల్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.

- దిలీప్‌ మాదిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement