ఈవారం కథ
విశాలమైన మేడల్లో కాదు... ఇరుకైన ఇళ్లల్లోనే సుఖం ఉంటుందని చెప్పిందెవడో కానీ, వాడు కనిపిస్తే అడ్డంగా నరికేయాలని సూరిబాబుకి అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కృష్ణానగర్, బీ బ్లాకులోని, పూర్ణా టిఫిన్ సెంటర్ దాటుకుంటూ వెళ్తే వచ్చే పన్నెండో నెంబరు పచ్చ రంగు బిల్డింగులో ఓ ఇరుకైన గదిలో అద్దెకు దిగినప్పటి నుంచి ఈ కోరిక మరింత బలంగా నాటుకుపోయింది. పెళ్లయి వారం తిరక్కుండానే గౌరిని తీసుకొని హైదరాబాద్ బయల్దేరబోతోంటే, అమ్మ ముత్యాలమ్మ కూడా సంచి సర్దేసుకుంది.
‘కొత్తగా పెళ్లయిన జంట... మధ్యలో నువ్వెందుకు’ అని బంధువులంతా వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ‘అమ్మకు నేను తప్ప ఎవరున్నారు.. నేనెక్కడుంటే తనూ అక్కడే’ అని సూరిబాబు అందామనుకొన్నాడు. కానీ ముత్యాలమ్మ ఆ అవకాశం తన కొడుక్కి ఇవ్వలేదు. ‘పెళ్లయి వారం అయ్యిందో లేదో.. నన్నూ నా బిడ్డనీ దూరం చేస్తారే.. ముదనష్టపు ముండల్లారా’ అని ఆరున్నొక్క రాగం అందుకుంది. అమ్మలక్కలు టీవీ సీరియల్ చూసినట్టు చూశారు. ఒకరిద్దరు ముత్యాలమ్మ నోటికి జడుసుకొని పారిపోయారు. ఓ అరగంట గ(ఏ)డిచాక.. ముత్యాలమ్మ ఏడుపులోనూ నిజం ఉందనిపించింది అందరికీ. దాంతో ఇద్దరు కాస్తా ముగ్గురయ్యారు.
ఊర్లో రైలెక్కినప్పుడు ఏం అనిపించలేదు. సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగి, 10హెచ్ బస్సు అందుకున్నప్పుడు కూడా ఏ భయమూ వేయలేదు. అరవై రూపాయల స్టీలు కోటింగు గోద్రేజ్ తాళం చాలా కష్టపడి తీస్తున్నప్పుడూ కంగారు పడలేదు. కానీ, ఒక్కసారి రూమ్‌లో అడుగుపెట్టేసరికి సూరిబాబు వాస్తవంలోకి రాలేక తప్పలేదు.
‘దీన్ని కూడా ఇల్లంటారా’ అనబోయి ‘ఇదే మన ఇల్లా’ అని కాస్త డిగ్నిఫైడ్‌గా అడిగింది గౌరి.
నాలుగ్గోడలు నిలబెట్టి, ఓ రేకు అడ్డంగా పరిస్తే తయారైన కుటీరం అది. దీనికంటే పిట్టలు కట్టుకొనే గూడే కాస్త పటిష్ఠంగా ఉంటుంది. మహానగరంలో మూడువేలకు ఇంతకు మించిన ఆవాసం దొరకడం ఎంత కష్టమో సూరిబాబుకి తెలుసు. బీటలు వారిన గోడలు, వాటి మధ్యే కాపురం ఉంటున్న బల్లులు, ‘ఇదే మన సామ్రాజ్యం’ అని యథేచ్ఛగా తిరిగేస్తున్న బొద్దింకలు. ఆ మూల ఎప్పుడూ మూడున్నర కేజీల గ్యాసే పట్టే ఐదు కేజీల సిలిండర్, ఈ మూల ఓ చాప, రెండు మాసిన దిండ్లు. ఆ మధ్యలో తన జీవితంలానే అస్తవ్యస్తంగా ఉన్న అల్మరా. ఇద్దరు అటూ ఇటూ తిరుగుతుంటే మూడో మనిషి నిలబడడానికే జాగా ఉండదు. అలాంటి చోట.. మూడో మనిషితో పాటు.. అది కూడా పెళ్లైన కొత్తలో కాపురానికి దిగాడంటే.. సూరిబాబుది ఎంత గట్టి గుండెనో అర్థం చేసుకోవొచ్చు.
‘ఇదేం ఇల్లురా.. సూరి. ఇన్నాళ్లూ ఇక్కడే ఉన్నావా’ అంటూ ఊర్లో మధ్యలో ఆపేసిన ఏడుపు హైద్రాబాద్ మహానగరంలో కొనసాగించింది ముత్యాలమ్మ.
‘నువ్వు ఏడుస్తూనే ఉండు.. నేను టిఫిన్లు తీసుకొస్తా..’ అని బయల్దేరబోతోంటే గౌరి ఆపింది. ‘ఇప్పుడు ఆ ఖర్చెందుకు.. నేను ఏదోటి చేస్తాగా’ అని చురుగ్గా కదిలింది. చిందరవందరగా ఉన్న వస్తువుల్ని చిటికెలో సర్దేసింది. చీపిరి అందుకొని చకచక ఊడ్చేసింది. తడిగుడ్డ పెట్టింది. స్నానం చేసి దేవుడి పటం ముందు దీపం వెలిగించింది. డబ్బాల్లో ఏమున్నాయో వెదికింది. అవన్నీ కలిపి ఓ వంటకం సిద్ధం చేసింది. అందులోనే కొంత మిగిల్చి మధ్యాహ్నం క్యారియర్‌కి సర్దింది. ‘తొమ్మిది వేల ఆరొందల జీతంతో జీవితం హాయిగా గడిచిపోతుందిలే’ అనే భరోసా భర్తకి ఇచ్చింది. గౌరిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తొలిసారి గర్వంగా ఫీలయ్యాడు సూరిబాబు.
పొద్దస్తమానం కష్టపడి వస్తాడు సూరిబాబు. ఉన్నదాంట్లో రుచికరంగా వండుతుంది గౌరి. ‘నేనొండినట్టు ఎక్కడుంది’ అంటూ నిష్టూరపోతూనే మెతుకు మిగల్చకుండా లాగించేస్తుంది ముత్యాలమ్మ. ఆమెకు కాస్త పెందలాడే పడుకోవడం అలవాటు. చేతులు ఆరవు. కంచం కూడా తీయదు. తిన్న వెంటనే ముసుగేస్తుంది. ఆ ఇరుకైన గదిలోనే ముగ్గురికి పక్క సర్దుతుంది గౌరి. ముత్యాలమ్మ అటు తిరిగి పడుకొంటే.. ఇటు కొత్త దంపతులు సర్దుకుపోతారు.
సూరి – గౌరి ఇద్దరూ కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకొంటారు. మూగగా ప్రేమించుకుంటారు. అదే వారి ఏకాంతం. కాసేపు ఆ నాలుగు చేతులూ మాట్లాడుకుంటాయి. అరికాళ్లు ఆవిర్లు పంచుకుంటాయి. ఆ ఊపిర్లు వెచ్చగా పలకరించుకుంటాయి. అంతే వారి శృంగారం. గౌరిని దగ్గరకు తీసుకోవాలని ఉంటుంది. ముద్దు చేయాలని ఉంటుంది. కానీ ఎలా?
అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై కోపం వస్తుంటుంది.
బయట వాన పడుతుంటుంది. సూరి శరీరం వెచ్చబడుతుంటుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన గౌరిని చుట్టేసి కాస్త చల్లబడాలని ఉంటుంది. కానీ ఎలా?
అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిని మర్డర్ చేయాలనిపిస్తుంది.సాయంత్రం వస్తూ వస్తూ బేరమాడకుండానే మూర మల్లెపూలు పట్టుకొస్తాడు. అదే తన విలాసం. అందులోనూ ముత్యాలమ్మ వాటాకొస్తుంది. ధర్మబద్ధంగా పావు మూర కోడలి కొప్పుకి చేరుతుంది. కనీసం ఆ మల్లెల వాసనైనా మనస్ఫూర్తిగా అనుభవిద్దాం అనుకుంటాడు. కానీ వెనకే ముత్యాలమ్మ నీడ వెంటాడుతూ ఉంటుంది. ఇది తన విలాపం.
అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై పూట పూటకూ పగ పెరుగుతూనే ఉంటుంది.
‘అసలే కొత్త జంట.. వాళ్లకు కాస్త ఏకాంతం ఇవ్వూ.. అన్నీ తెలిసినదానివి ఇంతకంటే ఏం చెబుతాం’ అని ఎవరో ముత్యాలమ్మకు ఫోనోపదేశం చేశారు ఓసారి. అప్పట్నుంచి రాత్రి భోజనాల తరవాత బయటకు వెళ్లి పచార్లు చేయడం అలవాటు చేసుకొంది. అదీ కా..సే...పే.
ఎంత సేపంటే.. తలుపు వేసి గౌరిని అల్లుకునేంత సేపు.
ఎంత సేపంటే.. ఆ బుగ్గల నునుపెంతో చూసేంత సేపు.
ఎంత సేపంటే.. ఆ విరహం దూరమెంతో కొలిచేంత సేపు. అంతే!
‘మాయిదారి నిద్ర.. మాయిదారి నిద్ర.. కళ్లు మూతలు పడుతున్నాయనుకో..’ అంటూ మూసి ఉన్న తలుపుల్ని గభాల్న తోసుకొంటూ వచ్చేస్తుంటుంది. అత్తగారికి ఎక్కడ దొరికిపోతామో అన్న భయం ఆ కోడల్ని వెంటాడుతుంటుంది. ‘కన్నతల్లిని పక్కన పెట్టుకొని ఏమిటీ రాసలీలలు’ అని ఆ కొడుకు మనసు క్షోభిస్తుంటుంది. కథ మామూలే! ఇలా ఎలాంటి రసాస్వాదన లేకుండా ఎన్నో రాత్రులు గడిచిపోయాయి.
‘పట్నం ఎలా ఉందో చూసి రాకూడదమ్మా.. బస్సు కూడా ఫ్రీనే..’ అన్నాడు కొడుకు ఓ ఆదివారం పూట.
‘కోడల్ని కూడా తీసుకెళ్తా.. తనక్కూడా ఫ్రీనే కదా’ అని వెంటబెట్టుకుపోయింది. ‘ఏనాడు చేసుకొన్న పాపమో ఇది..’ అని తల గోడకేసి కొట్టుకోబోయి.. అది ఎక్కడ పడిపోతుందో అని భయం వేసి ఆగిపోయాడు.
‘పెద్దమ్మ గుడి పక్కనే... ఓసారి దండం పెట్టుకొని వచ్చేయ్’ అంటే ‘మీ నాన్న నన్ను వదిలిపెట్టి పోయినప్పుడే దేవుడిపై నమ్మకం పోయింది’ అంటూ ట్యాపు విప్పింది. అవి కన్నీళ్లు కావు. ఎండాకాలం కూడా ప్రవహించే కుళాయి.
ఆ కొత్త పెళ్లికూతురు మాత్రం ఎన్నిరోజులు భరిస్తుంది? ఎంతని సహిస్తుంది? ‘ఇక జీవితాంతం ఇంతేనా?’ అని అలక‘చాప’ ఎక్కింది. అటు తిరిగి పడుకొని, తన నిరసన తెలిపింది. పాపం.. అంతకంటే ఏం చేయగలదు?
‘నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మ.. నీ కాటుక కళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా..’ కింది ఫ్లోరు నుంచి పాట వినిపిస్తోంది మంద్రంగా.
∙∙
రెండు గదులున్న ఇంట్లోకి మారే స్తోమత తనకు ఇప్పట్లో లేదు. అదెప్పుడొస్తుందో కూడా తెలీదు. ఈలోపు గౌరిని శాంతపరచాలి. అందుకేం చేయాలి? అందుకే బాగా ఆలోచించి.. ‘ఓయోకి వెళ్దామా..’ ఏదైతే అది అయ్యిందని తెగించి అడిగేశాడు.
‘ఓయోనా.. అదేంటి?’ అని తన అమాయకమైన మొహాన్ని మరింత అందంగా మార్చేస్తూ అడిగింది ఆ కొత్త పెళ్లి కూతురు. ఓయో అనగానేమి, అక్కడ దొరికే సౌలభ్యాలేమిటి అనేవి పూసగుచ్చినట్టు వివరించేశాడు.
‘ఇదేం ఖర్మండీ మనకూ. నేను రానుగాక రాను..’ అని మొదట్లో నొచ్చుకొంది. కానీ కొన్ని రాత్రుల విరహం తనని కూడా కరిగించింది.
ఓయో రెంటు తొమ్మిదొందలు. సూరిబాబుకి వచ్చే ఆ అరాకొరా జీతంలో తొమ్మిదొందలు ఒక్క పూట కోసం పక్కన పెట్టడం కష్టమే.
‘రేపట్నుంచి మల్లె పూలొద్దు’ ఆర్డరేసింది గౌరి. ‘టీ’ తన టైమ్ టేబుల్ మార్చుకొని, ఒక్క పూటకు కుంచించుకుపోయింది. రెండు ఆదివారాలు కోడికూర లేకుండానే గడిచిపోయాయి.
‘ఎందుకిదంతా..?’ అని అడిగితే... ‘రూపాయా, రెండ్రూపాయలా? తొమ్మిదొందలు. మన జల్సాలకు ఖర్చు చేస్తున్నాం కదా, ఈ మాత్రం ఆదా చేయకపోతే ఎలా’ అంది. దిగువ మధ్యతరగతివాడి సరసం కూడా విలాస వస్తువుల ఖాతాలో చేరిపోయిందన్నమాట.
నెల రోజుల ఆదాతో ఆ తొమ్మిదొందలూ పూడాయి. ఆ ఆదివారం భార్యాభర్తలిద్దరూ టిప్పుటాపుగా రెడీ అవుతుండడం మూల నుంచి ముత్యాలమ్మ గమనిస్తూనే ఉంది.
‘సినిమాకెళ్తున్నాం.. పెందలాడే వచ్చేస్తాంలే..’ అని తొలిసారి అబద్ధమాడాడు సూరి.
‘సినిమానా.. నేనూ వద్దును కదర్రా.. ఎన్నాళ్లయ్యిందో చూసి’ అని తెగ బాధ పడిపోయింది ఆ తల్లి. ‘టికెట్లు రెండే దొరికాయి.. కొత్త సినిమా కదా..’ అంటూ మరో అబద్ధాన్ని అప్పటికప్పుడు అల్లి బయల్దేరారు ఇద్దరూ.
దారి వెంబట ఎన్ని కలల్ని, ఎన్ని ఊహల్ని, ఎన్ని కోరికల్ని మోసుకెళ్లారో. మధ్యలో ఆగి ఓ మూర మల్లెలు కొన్నాడు. ఈసారి పూర్తిగా తన భార్యకే.
ఓయో వచ్చింది. భయం, బిడియం కలిసిన అడుగులు తడబడుతూ హోటల్ మెట్లెక్కాయి.
‘పేరేంటి..’ అడిగాడు ఓయో అబ్బాయి.
‘సూరిబాబు..’
‘ఎన్ని రోజులు ఉంటారు?’
‘రోజులా.. ఈ ఒక్క పూటకే..’
‘ఐడీ కార్డు..’
‘ఐడీ కార్డా... మర్చిపోయా..’ అంటూ జేబులు తడుముకొన్నాడు. పాపం నిజంగానే మర్చిపోయాడు.
‘సర్సరేలే.. ఇలాంటివన్నీ మామూలే..’ అనుకొంటూ గౌరి వంక కాస్త వంకరగా చూశాడు. ఆ చూపుల భావమేంటో గౌరికి అర్థం కానందుకు సూరిబాబు కాస్త స్థిమితపడ్డాడు. అడ్వాన్సు అందుకొన్న ఓయో అబ్బాయి ‘రూమ్ నెంబరు 203’కి దారి చూపిస్తూ తాళం అందించాడు. లిఫ్టు రెండో ఫ్లోరులో ఆగింది. ఎవరైనా చూస్తారేమో అనే కంగారు పడుతూనే 203లోకి దిగబడింది ఆ జంట. ఓ థర్డ్ క్లాస్ లాడ్జ్ అది. గోడలకు వేసిన రంగు మాసిపోయి చాలా కాలమైంది. ఆ దుప్పటి కూడా ఎప్పుడు ఉతికారో ఏమిటో? రూమ్ నిండా అదోరకమైన వాసన. కానీ గౌరి ఇవేం పట్టించుకోవడంలేదు. సూరికి కూడా ఇవేం అక్కర్లేదు.
తాము కాపురం వెలగబెడుతున్న ఆ ఇరుకు గదితో పోలిస్తే ఈ రూము విశాలంగా ఉంది.
‘ఇంత పెద్ద మంచమా..’ అంటూ గౌరి కళ్లు విప్పారాయి. ఆ రూమంతా ఓసారి ఇష్టంగా కలయితిరిగింది. నెత్తి మీద ఫ్యాను తిరుగుతోంది. టీవీ కూడా ఉంది. ఇంత కంటే విలాసం.. తాను చూడగలదా? ఆనందంతో భర్తని కౌగిలించుకుంది. తొలిసారి మల్లెపూలకు ఎంతటి మహత్తు ఉందో తెలుసుకుంటున్నాడు సూరి. పెళ్లయిన ఇంత కాలానికి తనకూ, తన భార్యకూ దొరికిన ఏకాంతం అది. ప్రతీ క్షణమూ మధురమే. ఈసారి సూరిబాబు కౌగిలి బిగించాడు. గౌరికి ఊపిరి ఆడడం లేదు. అయినా బాగుంది. సూరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. అయినా హాయిగానే అనిపిస్తోంది. కాసేపు పట్టు విడిచాడు. కళ్లల్లో కళ్లు పెట్టి చూశాడు. గౌరి పెదవులు తమని ఆక్రమించుకొమ్మని ఆహ్వానలేఖ పంపాయి. వాటిని అందుకోబోతుండగా...
‘టింగ్’ అంటూ మోగింది కాలింగ్ బెల్. స్వప్నలోకాల నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి పడినట్టు అనిపించింది. సూరి, గౌరి మొహమొహాలు చూసుకొన్నారు. తొలిసారి కంగారు పడ్డారు. గౌరి చీర సర్దుకొంది. సూరి తమాయించుకుంటూనే తలుపు తీశాడు. ఎదురుగా ఇద్దరు కానిస్టేబుళ్లు. ‘ఇద్దరు కరడుకట్టిన అల్‌కాయిదా తీవ్రవాదుల్ని పట్టేసుకున్నాం’ అనేంత గర్వం వాళ్ల కళ్లల్లో.
∙∙
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎప్పటిలా చాలా రద్దీగా ఉంది. పోలీస్ స్టేషన్ చూడడం గౌరికి అదే తొలిసారి. అందుకే శరీరంలో అణువణువూ ఒణుకుతోంది. సినిమాల్లో పోలీస్ స్టేష¯Œ ని చాలాసార్లు చూశాడు సూరిబాబు. కానీ అవి ఇలా లేవు. అందుకే తాను కూడా కంగారు పడుతున్నాడు. కానీ బయటపడడం లేదు.
‘మేమిద్దరం భార్యాభర్తలం సార్..’ అని హెడ్ కానిస్టేబుల్ దగ్గర వేసిన క్యాసెట్టే వేస్తున్నాడు. రైడింగ్‌లో పట్టుబడ్డోళ్లంతా ఇలానే చెబుతార్లే అన్నట్టు హెడ్డుగారు అసలు పట్టించుకోవడమే లేదు.
‘ఏమిటండీ.. ఇదంతా.. ఇప్పుడు ఏం జరుగుతుంది’ గౌరి దాదాపు ఏడ్చినంత పని చేసింది. ‘నువ్వేం కంగారు పడకు.. నేను చూస్తాగా..’ అంటూ హెడ్ కానిస్టేబుల్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలెట్టాడు.
‘సార్.. నిజంగానే తను నా భార్య సార్’ ఈసారి దాదాపు కాళ్లు పట్టుకొన్నంత పని చేశాడు.
‘మరి సాక్ష్యం’
‘తాళిబొట్టు ఉంది కదా’
‘అది సరిపోదు.. ఇంకేమైనా..’
‘మా అమ్మ ఉంది..’
‘ఎక్కడ..’
సూరిబాబు అడ్రస్ చెప్పాడు. ఓ కానిస్టేబుల్ వెళ్లి కాసేపటి తరవాత ముత్యాలమ్మని వెంటబెట్టుకొచ్చాడు. స్టేష¯Œ లోకి అడుగు పెడుతూనే కొడుకూ కోడళ్లిద్దరి వైపు ముత్యాలమ్మ చూసిన చూపు ఈ హెడ్ కానిస్టేబుల్ మాటల కంటే భయంకరంగా అనిపించాయి. ఏం జరిగిందో ఇదంతా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ముత్యాలమ్మకు ఎంతోసేపు పట్టలేదు. సంతకాలు పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటపడ్డారు ముగ్గురూ.
అమ్మ కళ్లల్లోకి చూసే ధైర్యం లేదు సూరికి. అత్తతో మాట్లాడేంత తెగువ లేదు గౌరికి. వాళ్లద్దరినీ మళ్లీ కదిపే సాహసం చేయలేదు ముత్యాలమ్మ.
‘నన్ను మన ఊరి బస్సెక్కించేయ్ రా’ పావుగంట తరవాత ముత్యాలమ్మ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట అది. సూరి ఏం మాట్లాడలేకపోయాడు.
‘నేనూ మీ వయసు దాటొచ్చినదాన్నే.. మీ పరిస్థితి అర్థం చేసుకోవాల్సింది.. ఊరి నిండా మనోళ్లే కదా. నేనక్కడ బాగానే ఉంటా. అప్పుడప్పుడూ మీరే వస్తుండండి’
అమీర్ పేటలో ముత్యాలమ్మని బస్సెక్కించి, ఆటోలో ఇంటికి బయల్దేరారు ఆ భార్యాభర్తలు. నెల రోజుల నుంచి పడుతున్న తపన.. ఈ రోజు జరిగిన తతంగం అంతా కళ్ల ముందు కదలాడింది. కాసేపు బాధ పడ్డారు. ఆ తరవాత చిన్నగా నవ్వుకున్నారు. స్టేషన్ నుంచి కూడా ఎలాంటి గొడవా లేకుండా బయటపడడంతో కాస్త రిలీఫ్‌గా అనిపించింది. ఇద్దరి కళ్లూ కలిశాయి. ఇంటికి వెళ్తే.. కావాల్సినంత ఏకాంతం దొరుకుతుందన్న ఆలోచన ఇంకాస్త ఆనందాన్ని కలిగించింది. మల్లెల దండ ఇంకా సువాసన వెదజల్లుతూనే ఉంది. సూరిలోని రొమాంటిక్ ఫెలో మళ్లీ నిద్ర లేచాడు. ఆటో యూసుఫ్‌గూడా రోడ్లు దాటుతూ కృష్ణానగర్‌లో ఆగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదన్న తలపు.. వాళ్లిద్దర్నీ మరింత తొందరపెట్టింది. అరవై మెట్లు తొలిసారి ఆయాస పడకుండా ఎక్కేస్తున్నారు. ఫ్లోరు దాటుతున్న కొద్దీ ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగి పొర్లుతోంది. త్వరగా ఒక్కటైపోవాలన్న తపన తొందర పెట్టిస్తోంది. ఐదు ఫ్లోర్లు పూర్తయ్యాయి. తమ గదికి చేరువైపోయారు. ఆఖరి మెట్టు దగ్గర ఇద్దరూ సడన్ బ్రేకు వేసినట్టు ఆగిపోయారు. ఎందుకంటే గుమ్మం ముందు ఓ శాల్తీ కాచుకొని కూర్చుంది. ఈ భార్యాభర్తల్ని చూసి ఒక్కసారిగా పైకి లేచింది.
‘ఏమైపోయావ్ గౌరీ ఇంతసేపూ..’ అని రాగానే బలవంతంగా కావలించేసుకొంది.
‘ఎవరీవిడ..’ అర్థం కానట్టు అడిగాడు సూరి.
‘మా అనసూయత్త చిన్నప్పటి నుంచీ నన్ను పెంచి పోషించింది. మన పెళ్లికి కూడా వచ్చింది’
‘ఇప్పుడిక్కడికెందుకు వచ్చినట్టు?’ మెల్లగానే అన్నా, ఆ మాట అనసూయకు వినిపించింది. ‘నాకు మీరు తప్ప ఎవరున్నారు గౌరీ.. మీ మావయ్య కూడా కాలం చేశాడు. ఒక్కదాన్నే ఊర్లో ఉండబుద్ది కాలేదు. కూతురులాంటి నువ్వు గుర్తొచ్చావు. కలో గంజో కలిసే తాగుదాం అనిపించి వచ్చేశాను..’ అంటూ ఇంకోసారి బావురు మంది.
‘ఈ ఇరుకింట్లోనా?’ ఈసారి వినిపించేలానే అన్నాడు సూరి.
‘సుఖమన్నది విశాలమైన మేడల్లో కాదు బాబూ.. ఇలాంటి ఇరుకైన ఇళ్లల్లోనే ఉంటుంది’ అంది పెద్ద తత్వవేత్తలా.
ఆ ఒక్క మాటతో సూరిబాబు గుండెలో వంద గ్రెనేడ్లు పేలాయి.
- మహమ్మద్ అన్వర్


