breaking news
Sunday Book
-
ఆ గదిలో... చీకటిలో...!
విశాలమైన మేడల్లో కాదు... ఇరుకైన ఇళ్లల్లోనే సుఖం ఉంటుందని చెప్పిందెవడో కానీ, వాడు కనిపిస్తే అడ్డంగా నరికేయాలని సూరిబాబుకి అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కృష్ణానగర్, బీ బ్లాకులోని, పూర్ణా టిఫిన్ సెంటర్ దాటుకుంటూ వెళ్తే వచ్చే పన్నెండో నెంబరు పచ్చ రంగు బిల్డింగులో ఓ ఇరుకైన గదిలో అద్దెకు దిగినప్పటి నుంచి ఈ కోరిక మరింత బలంగా నాటుకుపోయింది. పెళ్లయి వారం తిరక్కుండానే గౌరిని తీసుకొని హైదరాబాద్ బయల్దేరబోతోంటే, అమ్మ ముత్యాలమ్మ కూడా సంచి సర్దేసుకుంది.‘కొత్తగా పెళ్లయిన జంట... మధ్యలో నువ్వెందుకు’ అని బంధువులంతా వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ‘అమ్మకు నేను తప్ప ఎవరున్నారు.. నేనెక్కడుంటే తనూ అక్కడే’ అని సూరిబాబు అందామనుకొన్నాడు. కానీ ముత్యాలమ్మ ఆ అవకాశం తన కొడుక్కి ఇవ్వలేదు. ‘పెళ్లయి వారం అయ్యిందో లేదో.. నన్నూ నా బిడ్డనీ దూరం చేస్తారే.. ముదనష్టపు ముండల్లారా’ అని ఆరున్నొక్క రాగం అందుకుంది. అమ్మలక్కలు టీవీ సీరియల్ చూసినట్టు చూశారు. ఒకరిద్దరు ముత్యాలమ్మ నోటికి జడుసుకొని పారిపోయారు. ఓ అరగంట గ(ఏ)డిచాక.. ముత్యాలమ్మ ఏడుపులోనూ నిజం ఉందనిపించింది అందరికీ. దాంతో ఇద్దరు కాస్తా ముగ్గురయ్యారు.ఊర్లో రైలెక్కినప్పుడు ఏం అనిపించలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి, 10హెచ్ బస్సు అందుకున్నప్పుడు కూడా ఏ భయమూ వేయలేదు. అరవై రూపాయల స్టీలు కోటింగు గోద్రేజ్ తాళం చాలా కష్టపడి తీస్తున్నప్పుడూ కంగారు పడలేదు. కానీ, ఒక్కసారి రూమ్‌లో అడుగుపెట్టేసరికి సూరిబాబు వాస్తవంలోకి రాలేక తప్పలేదు.‘దీన్ని కూడా ఇల్లంటారా’ అనబోయి ‘ఇదే మన ఇల్లా’ అని కాస్త డిగ్నిఫైడ్‌గా అడిగింది గౌరి.నాలుగ్గోడలు నిలబెట్టి, ఓ రేకు అడ్డంగా పరిస్తే తయారైన కుటీరం అది. దీనికంటే పిట్టలు కట్టుకొనే గూడే కాస్త పటిష్ఠంగా ఉంటుంది. మహానగరంలో మూడువేలకు ఇంతకు మించిన ఆవాసం దొరకడం ఎంత కష్టమో సూరిబాబుకి తెలుసు. బీటలు వారిన గోడలు, వాటి మధ్యే కాపురం ఉంటున్న బల్లులు, ‘ఇదే మన సామ్రాజ్యం’ అని యథేచ్ఛగా తిరిగేస్తున్న బొద్దింకలు. ఆ మూల ఎప్పుడూ మూడున్నర కేజీల గ్యాసే పట్టే ఐదు కేజీల సిలిండర్, ఈ మూల ఓ చాప, రెండు మాసిన దిండ్లు. ఆ మధ్యలో తన జీవితంలానే అస్తవ్యస్తంగా ఉన్న అల్మరా. ఇద్దరు అటూ ఇటూ తిరుగుతుంటే మూడో మనిషి నిలబడడానికే జాగా ఉండదు. అలాంటి చోట.. మూడో మనిషితో పాటు.. అది కూడా పెళ్లైన కొత్తలో కాపురానికి దిగాడంటే.. సూరిబాబుది ఎంత గట్టి గుండెనో అర్థం చేసుకోవొచ్చు.‘ఇదేం ఇల్లురా.. సూరి. ఇన్నాళ్లూ ఇక్కడే ఉన్నావా’ అంటూ ఊర్లో మధ్యలో ఆపేసిన ఏడుపు హైద్రాబాద్ మహానగరంలో కొనసాగించింది ముత్యాలమ్మ.‘నువ్వు ఏడుస్తూనే ఉండు.. నేను టిఫిన్లు తీసుకొస్తా..’ అని బయల్దేరబోతోంటే గౌరి ఆపింది. ‘ఇప్పుడు ఆ ఖర్చెందుకు.. నేను ఏదోటి చేస్తాగా’ అని చురుగ్గా కదిలింది. చిందరవందరగా ఉన్న వస్తువుల్ని చిటికెలో సర్దేసింది. చీపిరి అందుకొని చకచక ఊడ్చేసింది. తడిగుడ్డ పెట్టింది. స్నానం చేసి దేవుడి పటం ముందు దీపం వెలిగించింది. డబ్బాల్లో ఏమున్నాయో వెదికింది. అవన్నీ కలిపి ఓ వంటకం సిద్ధం చేసింది. అందులోనే కొంత మిగిల్చి మధ్యాహ్నం క్యారియర్‌కి సర్దింది. ‘తొమ్మిది వేల ఆరొందల జీతంతో జీవితం హాయిగా గడిచిపోతుందిలే’ అనే భరోసా భర్తకి ఇచ్చింది. గౌరిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తొలిసారి గర్వంగా ఫీలయ్యాడు సూరిబాబు.పొద్దస్తమానం కష్టపడి వస్తాడు సూరిబాబు. ఉన్నదాంట్లో రుచికరంగా వండుతుంది గౌరి. ‘నేనొండినట్టు ఎక్కడుంది’ అంటూ నిష్టూరపోతూనే మెతుకు మిగల్చకుండా లాగించేస్తుంది ముత్యాలమ్మ. ఆమెకు కాస్త పెందలాడే పడుకోవడం అలవాటు. చేతులు ఆరవు. కంచం కూడా తీయదు. తిన్న వెంటనే ముసుగేస్తుంది. ఆ ఇరుకైన గదిలోనే ముగ్గురికి పక్క సర్దుతుంది గౌరి. ముత్యాలమ్మ అటు తిరిగి పడుకొంటే.. ఇటు కొత్త దంపతులు సర్దుకుపోతారు.సూరి – గౌరి ఇద్దరూ కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకొంటారు. మూగగా ప్రేమించుకుంటారు. అదే వారి ఏకాంతం. కాసేపు ఆ నాలుగు చేతులూ మాట్లాడుకుంటాయి. అరికాళ్లు ఆవిర్లు పంచుకుంటాయి. ఆ ఊపిర్లు వెచ్చగా పలకరించుకుంటాయి. అంతే వారి శృంగారం. గౌరిని దగ్గరకు తీసుకోవాలని ఉంటుంది. ముద్దు చేయాలని ఉంటుంది. కానీ ఎలా?అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై కోపం వస్తుంటుంది.బయట వాన పడుతుంటుంది. సూరి శరీరం వెచ్చబడుతుంటుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన గౌరిని చుట్టేసి కాస్త చల్లబడాలని ఉంటుంది. కానీ ఎలా?అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిని మర్డర్ చేయాలనిపిస్తుంది.సాయంత్రం వస్తూ వస్తూ బేరమాడకుండానే మూర మల్లెపూలు పట్టుకొస్తాడు. అదే తన విలాసం. అందులోనూ ముత్యాలమ్మ వాటాకొస్తుంది. ధర్మబద్ధంగా పావు మూర కోడలి కొప్పుకి చేరుతుంది. కనీసం ఆ మల్లెల వాసనైనా మనస్ఫూర్తిగా అనుభవిద్దాం అనుకుంటాడు. కానీ వెనకే ముత్యాలమ్మ నీడ వెంటాడుతూ ఉంటుంది. ఇది తన విలాపం.అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై పూట పూటకూ పగ పెరుగుతూనే ఉంటుంది.‘అసలే కొత్త జంట.. వాళ్లకు కాస్త ఏకాంతం ఇవ్వూ.. అన్నీ తెలిసినదానివి ఇంతకంటే ఏం చెబుతాం’ అని ఎవరో ముత్యాలమ్మకు ఫోనోపదేశం చేశారు ఓసారి. అప్పట్నుంచి రాత్రి భోజనాల తరవాత బయటకు వెళ్లి పచార్లు చేయడం అలవాటు చేసుకొంది. అదీ కా..సే...పే.ఎంత సేపంటే.. తలుపు వేసి గౌరిని అల్లుకునేంత సేపు.ఎంత సేపంటే.. ఆ బుగ్గల నునుపెంతో చూసేంత సేపు.ఎంత సేపంటే.. ఆ విరహం దూరమెంతో కొలిచేంత సేపు. అంతే!‘మాయిదారి నిద్ర.. మాయిదారి నిద్ర.. కళ్లు మూతలు పడుతున్నాయనుకో..’ అంటూ మూసి ఉన్న తలుపుల్ని గభాల్న తోసుకొంటూ వచ్చేస్తుంటుంది. అత్తగారికి ఎక్కడ దొరికిపోతామో అన్న భయం ఆ కోడల్ని వెంటాడుతుంటుంది. ‘కన్నతల్లిని పక్కన పెట్టుకొని ఏమిటీ రాసలీలలు’ అని ఆ కొడుకు మనసు క్షోభిస్తుంటుంది. కథ మామూలే! ఇలా ఎలాంటి రసాస్వాదన లేకుండా ఎన్నో రాత్రులు గడిచిపోయాయి.‘పట్నం ఎలా ఉందో చూసి రాకూడదమ్మా.. బస్సు కూడా ఫ్రీనే..’ అన్నాడు కొడుకు ఓ ఆదివారం పూట.‘కోడల్ని కూడా తీసుకెళ్తా.. తనక్కూడా ఫ్రీనే కదా’ అని వెంటబెట్టుకుపోయింది. ‘ఏనాడు చేసుకొన్న పాపమో ఇది..’ అని తల గోడకేసి కొట్టుకోబోయి.. అది ఎక్కడ పడిపోతుందో అని భయం వేసి ఆగిపోయాడు.‘పెద్దమ్మ గుడి పక్కనే... ఓసారి దండం పెట్టుకొని వచ్చేయ్’ అంటే ‘మీ నాన్న నన్ను వదిలిపెట్టి పోయినప్పుడే దేవుడిపై నమ్మకం పోయింది’ అంటూ ట్యాపు విప్పింది. అవి కన్నీళ్లు కావు. ఎండాకాలం కూడా ప్రవహించే కుళాయి.ఆ కొత్త పెళ్లికూతురు మాత్రం ఎన్నిరోజులు భరిస్తుంది? ఎంతని సహిస్తుంది? ‘ఇక జీవితాంతం ఇంతేనా?’ అని అలక‘చాప’ ఎక్కింది. అటు తిరిగి పడుకొని, తన నిరసన తెలిపింది. పాపం.. అంతకంటే ఏం చేయగలదు?‘నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మ.. నీ కాటుక కళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా..’ కింది ఫ్లోరు నుంచి పాట వినిపిస్తోంది మంద్రంగా.∙∙ రెండు గదులున్న ఇంట్లోకి మారే స్తోమత తనకు ఇప్పట్లో లేదు. అదెప్పుడొస్తుందో కూడా తెలీదు. ఈలోపు గౌరిని శాంతపరచాలి. అందుకేం చేయాలి? అందుకే బాగా ఆలోచించి.. ‘ఓయోకి వెళ్దామా..’ ఏదైతే అది అయ్యిందని తెగించి అడిగేశాడు.‘ఓయోనా.. అదేంటి?’ అని తన అమాయకమైన మొహాన్ని మరింత అందంగా మార్చేస్తూ అడిగింది ఆ కొత్త పెళ్లి కూతురు. ఓయో అనగానేమి, అక్కడ దొరికే సౌలభ్యాలేమిటి అనేవి పూసగుచ్చినట్టు వివరించేశాడు.‘ఇదేం ఖర్మండీ మనకూ. నేను రానుగాక రాను..’ అని మొదట్లో నొచ్చుకొంది. కానీ కొన్ని రాత్రుల విరహం తనని కూడా కరిగించింది.ఓయో రెంటు తొమ్మిదొందలు. సూరిబాబుకి వచ్చే ఆ అరాకొరా జీతంలో తొమ్మిదొందలు ఒక్క పూట కోసం పక్కన పెట్టడం కష్టమే.‘రేపట్నుంచి మల్లె పూలొద్దు’ ఆర్డరేసింది గౌరి. ‘టీ’ తన టైమ్ టేబుల్ మార్చుకొని, ఒక్క పూటకు కుంచించుకుపోయింది. రెండు ఆదివారాలు కోడికూర లేకుండానే గడిచిపోయాయి.‘ఎందుకిదంతా..?’ అని అడిగితే... ‘రూపాయా, రెండ్రూపాయలా? తొమ్మిదొందలు. మన జల్సాలకు ఖర్చు చేస్తున్నాం కదా, ఈ మాత్రం ఆదా చేయకపోతే ఎలా’ అంది. దిగువ మధ్యతరగతివాడి సరసం కూడా విలాస వస్తువుల ఖాతాలో చేరిపోయిందన్నమాట.నెల రోజుల ఆదాతో ఆ తొమ్మిదొందలూ పూడాయి. ఆ ఆదివారం భార్యాభర్తలిద్దరూ టిప్పుటాపుగా రెడీ అవుతుండడం మూల నుంచి ముత్యాలమ్మ గమనిస్తూనే ఉంది.‘సినిమాకెళ్తున్నాం.. పెందలాడే వచ్చేస్తాంలే..’ అని తొలిసారి అబద్ధమాడాడు సూరి.‘సినిమానా.. నేనూ వద్దును కదర్రా.. ఎన్నాళ్లయ్యిందో చూసి’ అని తెగ బాధ పడిపోయింది ఆ తల్లి. ‘టికెట్లు రెండే దొరికాయి.. కొత్త సినిమా కదా..’ అంటూ మరో అబద్ధాన్ని అప్పటికప్పుడు అల్లి బయల్దేరారు ఇద్దరూ.దారి వెంబట ఎన్ని కలల్ని, ఎన్ని ఊహల్ని, ఎన్ని కోరికల్ని మోసుకెళ్లారో. మధ్యలో ఆగి ఓ మూర మల్లెలు కొన్నాడు. ఈసారి పూర్తిగా తన భార్యకే.ఓయో వచ్చింది. భయం, బిడియం కలిసిన అడుగులు తడబడుతూ హోటల్ మెట్లెక్కాయి.‘పేరేంటి..’ అడిగాడు ఓయో అబ్బాయి.‘సూరిబాబు..’‘ఎన్ని రోజులు ఉంటారు?’‘రోజులా.. ఈ ఒక్క పూటకే..’‘ఐడీ కార్డు..’‘ఐడీ కార్డా... మర్చిపోయా..’ అంటూ జేబులు తడుముకొన్నాడు. పాపం నిజంగానే మర్చిపోయాడు.‘సర్సరేలే.. ఇలాంటివన్నీ మామూలే..’ అనుకొంటూ గౌరి వంక కాస్త వంకరగా చూశాడు. ఆ చూపుల భావమేంటో గౌరికి అర్థం కానందుకు సూరిబాబు కాస్త స్థిమితపడ్డాడు. అడ్వాన్సు అందుకొన్న ఓయో అబ్బాయి ‘రూమ్ నెంబరు 203’కి దారి చూపిస్తూ తాళం అందించాడు. లిఫ్టు రెండో ఫ్లోరులో ఆగింది. ఎవరైనా చూస్తారేమో అనే కంగారు పడుతూనే 203లోకి దిగబడింది ఆ జంట. ఓ థర్డ్ క్లాస్ లాడ్జ్ అది. గోడలకు వేసిన రంగు మాసిపోయి చాలా కాలమైంది. ఆ దుప్పటి కూడా ఎప్పుడు ఉతికారో ఏమిటో? రూమ్ నిండా అదోరకమైన వాసన. కానీ గౌరి ఇవేం పట్టించుకోవడంలేదు. సూరికి కూడా ఇవేం అక్కర్లేదు.తాము కాపురం వెలగబెడుతున్న ఆ ఇరుకు గదితో పోలిస్తే ఈ రూము విశాలంగా ఉంది.‘ఇంత పెద్ద మంచమా..’ అంటూ గౌరి కళ్లు విప్పారాయి. ఆ రూమంతా ఓసారి ఇష్టంగా కలయితిరిగింది. నెత్తి మీద ఫ్యాను తిరుగుతోంది. టీవీ కూడా ఉంది. ఇంత కంటే విలాసం.. తాను చూడగలదా? ఆనందంతో భర్తని కౌగిలించుకుంది. తొలిసారి మల్లెపూలకు ఎంతటి మహత్తు ఉందో తెలుసుకుంటున్నాడు సూరి. పెళ్లయిన ఇంత కాలానికి తనకూ, తన భార్యకూ దొరికిన ఏకాంతం అది. ప్రతీ క్షణమూ మధురమే. ఈసారి సూరిబాబు కౌగిలి బిగించాడు. గౌరికి ఊపిరి ఆడడం లేదు. అయినా బాగుంది. సూరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. అయినా హాయిగానే అనిపిస్తోంది. కాసేపు పట్టు విడిచాడు. కళ్లల్లో కళ్లు పెట్టి చూశాడు. గౌరి పెదవులు తమని ఆక్రమించుకొమ్మని ఆహ్వానలేఖ పంపాయి. వాటిని అందుకోబోతుండగా...‘టింగ్’ అంటూ మోగింది కాలింగ్ బెల్. స్వప్నలోకాల నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి పడినట్టు అనిపించింది. సూరి, గౌరి మొహమొహాలు చూసుకొన్నారు. తొలిసారి కంగారు పడ్డారు. గౌరి చీర సర్దుకొంది. సూరి తమాయించుకుంటూనే తలుపు తీశాడు. ఎదురుగా ఇద్దరు కానిస్టేబుళ్లు. ‘ఇద్దరు కరడుకట్టిన అల్‌కాయిదా తీవ్రవాదుల్ని పట్టేసుకున్నాం’ అనేంత గర్వం వాళ్ల కళ్లల్లో.∙∙ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎప్పటిలా చాలా రద్దీగా ఉంది. పోలీస్ స్టేషన్ చూడడం గౌరికి అదే తొలిసారి. అందుకే శరీరంలో అణువణువూ ఒణుకుతోంది. సినిమాల్లో పోలీస్ స్టేష¯Œ ని చాలాసార్లు చూశాడు సూరిబాబు. కానీ అవి ఇలా లేవు. అందుకే తాను కూడా కంగారు పడుతున్నాడు. కానీ బయటపడడం లేదు.‘మేమిద్దరం భార్యాభర్తలం సార్..’ అని హెడ్ కానిస్టేబుల్ దగ్గర వేసిన క్యాసెట్టే వేస్తున్నాడు. రైడింగ్‌లో పట్టుబడ్డోళ్లంతా ఇలానే చెబుతార్లే అన్నట్టు హెడ్డుగారు అసలు పట్టించుకోవడమే లేదు.‘ఏమిటండీ.. ఇదంతా.. ఇప్పుడు ఏం జరుగుతుంది’ గౌరి దాదాపు ఏడ్చినంత పని చేసింది. ‘నువ్వేం కంగారు పడకు.. నేను చూస్తాగా..’ అంటూ హెడ్ కానిస్టేబుల్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలెట్టాడు.‘సార్.. నిజంగానే తను నా భార్య సార్’ ఈసారి దాదాపు కాళ్లు పట్టుకొన్నంత పని చేశాడు.‘మరి సాక్ష్యం’‘తాళిబొట్టు ఉంది కదా’‘అది సరిపోదు.. ఇంకేమైనా..’‘మా అమ్మ ఉంది..’‘ఎక్కడ..’సూరిబాబు అడ్రస్ చెప్పాడు. ఓ కానిస్టేబుల్ వెళ్లి కాసేపటి తరవాత ముత్యాలమ్మని వెంటబెట్టుకొచ్చాడు. స్టేష¯Œ లోకి అడుగు పెడుతూనే కొడుకూ కోడళ్లిద్దరి వైపు ముత్యాలమ్మ చూసిన చూపు ఈ హెడ్ కానిస్టేబుల్ మాటల కంటే భయంకరంగా అనిపించాయి. ఏం జరిగిందో ఇదంతా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ముత్యాలమ్మకు ఎంతోసేపు పట్టలేదు. సంతకాలు పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటపడ్డారు ముగ్గురూ.అమ్మ కళ్లల్లోకి చూసే ధైర్యం లేదు సూరికి. అత్తతో మాట్లాడేంత తెగువ లేదు గౌరికి. వాళ్లద్దరినీ మళ్లీ కదిపే సాహసం చేయలేదు ముత్యాలమ్మ.‘నన్ను మన ఊరి బస్సెక్కించేయ్ రా’ పావుగంట తరవాత ముత్యాలమ్మ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట అది. సూరి ఏం మాట్లాడలేకపోయాడు.‘నేనూ మీ వయసు దాటొచ్చినదాన్నే.. మీ పరిస్థితి అర్థం చేసుకోవాల్సింది.. ఊరి నిండా మనోళ్లే కదా. నేనక్కడ బాగానే ఉంటా. అప్పుడప్పుడూ మీరే వస్తుండండి’అమీర్ పేటలో ముత్యాలమ్మని బస్సెక్కించి, ఆటోలో ఇంటికి బయల్దేరారు ఆ భార్యాభర్తలు. నెల రోజుల నుంచి పడుతున్న తపన.. ఈ రోజు జరిగిన తతంగం అంతా కళ్ల ముందు కదలాడింది. కాసేపు బాధ పడ్డారు. ఆ తరవాత చిన్నగా నవ్వుకున్నారు. స్టేషన్ నుంచి కూడా ఎలాంటి గొడవా లేకుండా బయటపడడంతో కాస్త రిలీఫ్‌గా అనిపించింది. ఇద్దరి కళ్లూ కలిశాయి. ఇంటికి వెళ్తే.. కావాల్సినంత ఏకాంతం దొరుకుతుందన్న ఆలోచన ఇంకాస్త ఆనందాన్ని కలిగించింది. మల్లెల దండ ఇంకా సువాసన వెదజల్లుతూనే ఉంది. సూరిలోని రొమాంటిక్ ఫెలో మళ్లీ నిద్ర లేచాడు. ఆటో యూసుఫ్‌గూడా రోడ్లు దాటుతూ కృష్ణానగర్‌లో ఆగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదన్న తలపు.. వాళ్లిద్దర్నీ మరింత తొందరపెట్టింది. అరవై మెట్లు తొలిసారి ఆయాస పడకుండా ఎక్కేస్తున్నారు. ఫ్లోరు దాటుతున్న కొద్దీ ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగి పొర్లుతోంది. త్వరగా ఒక్కటైపోవాలన్న తపన తొందర పెట్టిస్తోంది. ఐదు ఫ్లోర్లు పూర్తయ్యాయి. తమ గదికి చేరువైపోయారు. ఆఖరి మెట్టు దగ్గర ఇద్దరూ సడన్ బ్రేకు వేసినట్టు ఆగిపోయారు. ఎందుకంటే గుమ్మం ముందు ఓ శాల్తీ కాచుకొని కూర్చుంది. ఈ భార్యాభర్తల్ని చూసి ఒక్కసారిగా పైకి లేచింది.‘ఏమైపోయావ్ గౌరీ ఇంతసేపూ..’ అని రాగానే బలవంతంగా కావలించేసుకొంది.‘ఎవరీవిడ..’ అర్థం కానట్టు అడిగాడు సూరి.‘మా అనసూయత్త చిన్నప్పటి నుంచీ నన్ను పెంచి పోషించింది. మన పెళ్లికి కూడా వచ్చింది’‘ఇప్పుడిక్కడికెందుకు వచ్చినట్టు?’ మెల్లగానే అన్నా, ఆ మాట అనసూయకు వినిపించింది. ‘నాకు మీరు తప్ప ఎవరున్నారు గౌరీ.. మీ మావయ్య కూడా కాలం చేశాడు. ఒక్కదాన్నే ఊర్లో ఉండబుద్ది కాలేదు. కూతురులాంటి నువ్వు గుర్తొచ్చావు. కలో గంజో కలిసే తాగుదాం అనిపించి వచ్చేశాను..’ అంటూ ఇంకోసారి బావురు మంది.‘ఈ ఇరుకింట్లోనా?’ ఈసారి వినిపించేలానే అన్నాడు సూరి.‘సుఖమన్నది విశాలమైన మేడల్లో కాదు బాబూ.. ఇలాంటి ఇరుకైన ఇళ్లల్లోనే ఉంటుంది’ అంది పెద్ద తత్వవేత్తలా.ఆ ఒక్క మాటతో సూరిబాబు గుండెలో వంద గ్రెనేడ్లు పేలాయి.- మహమ్మద్ అన్వర్ -
థింక్ ట్యూన్ అప్
‘ఆలోచనను బట్టే ఆచరణ, ఆచరణను బట్టే కర్మఫలం’ ప్రతిదానికీ ఆలోచనే మూలం. అందుకే ఒక మనిషి మనుగడకు ప్రాణవాయువు, అన్నపానీయాలు ఎంత అవసరమో ఆలోచించడం కూడా అంతే అవసరం. నిజానికి మనిషిని సమస్తజీవకోటి నుంచి వేరు చేసిందే ఆలోచన. మానవాళి మనుగడకు మార్గం వేసేదే ఆలోచన. మరి అలాంటి ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ‘మంచి ఆలోచనకు మించిన మనుగడ లేదు, చెడ్డ ఆలోచనకు పోలిన చావు లేదు’ అంటారు పెద్దలు. అవసరాన్ని బట్టి బుద్ధికుశలతను ఉపయోగించడం, పరిస్థితిని బట్టి వివేకంగా వ్యవహరించడం, సందర్భానుసారంగా విచక్షణతో నడుచుకోవడం, క్లిష్టమైన సమయాల్లో కూడా జ్ఞానాన్ని ప్రదర్శించడం.. ఇవన్నీ ఆలోచన పరిధికి గుణకారాలే! అయితే అందుకు సాధన ఎంతో అవసరం. థింక్ ట్యూన్ అప్ ట్యూన్ అప్ అంటే స్వరాన్ని పెంచడం.. లేదా అడ్జస్ట్ చేసుకోవడం. సాధారణంగా రేడియోకో.. ఇయర్ ఫోన్ కో, బ్లూటూత్కో ఉండే ట్యూన్ బటన్ ని మనకు తగ్గట్టుగా.. మనకు కావాల్సినట్లుగా సెట్ చేసుకుంటాం. మరి మది ఆలోచల్ని ఎలా ట్యూన్ అప్ చేసుకోవాలి? మనసు స్వరాల్లో మంచి స్వరాన్ని ఎలా ఎంచుకోవాలి? ఎలా పెంచుకోవాలి? ‘ఒక సీసా నిండా గాలి ఉన్నప్పుడు అందులోని గాలిని బయటకు పంపాలంటే, ఆ సీసాలో నీళ్లు నింపడమే మార్గం. అలాగే మనసులోని ప్రతికూల భావాలు ఆవిరైపోవాలంటే, మనసు నిండా సానుకూల ఆలోచనలను పెంచుకోవాలి. పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్.. ఈ రెండింటికీ ప్రభావవంతమైన శక్తులు ఉంటాయని, మనం దేన్ని నమ్ముతామో అదే జరుగుతుందని చెబుతారు సానుకూలపరులు. ‘సే సమ్‌థింగ్ పాజిటివ్ అండ్ యు విల్ సీ సమ్‌థింగ్ పాజిటివ్’... ‘మంచి గురించి మాట్లాడితే, మంచే కనిపిస్తుంది’ అని దీని అర్థం. అంటే మాట మంత్రంలా పని చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ వైర్‌లెస్‌గా పనిచేస్తాయి. ఇక్కడే ఆధ్యాత్మికతకు.. శాస్త్రీయతకు పొంతన కుదురుతుంది. మనస్సుకు ఆహారం శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, మనసు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం. ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాల కోసం మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. మంచివాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని మాత్రమే కోరుకోవాలి. అందుకే ‘మంచి ఆలోచనలే మనసుకు మంచి ఆహారం’ అంటారు మానసిక నిపుణులు. ఒక మంచి విషయాన్ని మనం బలంగా నమ్మితే, ప్రపంచం మొత్తం ఆ కోరికను నిజం చేయడానికి కుట్ర చేస్తుందట. అంటే ప్రకృతి ఆజ్ఞతో.. తెలియకుండానే చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు మనకు సహకరిస్తారు. ఆలోచనలు సానుకూలంగా ఉంటే, జీవితం సాఫీగా సాగుతుంది. మనసులో తలెత్తే అపోహలు, భయాలు, ప్రతికూల భావాలకు వ్యతిరేకంగా, మంచి సంకల్పాలను మనంతట మనమే సృష్టించుకోవాలి. ఉదయం లేవగానే.. ‘ఈ రోజు నాకు మంచి జరుగుతుంది. ఈ రోజు చాలా బాగుంటుంది’ అని మనసును ఉత్తేజపరచేలా ప్రకృతికి చెప్పడం నేర్చుకోవాలి. ‘ఎందుకొచ్చిన జీవితంరా సామీ?’ అంటూ ఏడుస్తూ నిద్రలేస్తే ఆ రోజు మొత్తం అంతే అసంతృప్తిగా ముగుస్తుందట. ఆలోచనలతో ఆరోగ్య ప్రయోజనాలు సానుకూల ఆలోచనలతో.. ప్రమాదకరమైన జబ్బుల్ని కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆశావాద దృక్పథం ఉంటే.. అది తీవ్ర అనారోగ్యాలను సైతం అరికడుతుందట. రొమ్ము క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, మానసిక రుగ్మతలు ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సమూలంగా తగ్గించే గుణం.. కేవలం సానుకూల ఆలోచనలకే ఉందట. ‘నాకేం కాదు’ అనే సంకల్పంతోనే బతికి బయటపడుతున్నారట. అందుకే ‘పాజిటివ్ థింకింగ్.. మెరుగైన రోగనిరోధక శక్తి’ అంటున్నారు నిపుణులు. పాజిటివ్ థింకింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? 1. ప్రతిక్షణం ఆలోచనలను గమనించుకోవాలి. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్‌లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవడం నేర్చుకోవాలి. ప్రతికూలమైన ఊహలు కలిగినప్పుడు.. నిట్టూర్పులను పక్కన పెట్టి.. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా తీసుకుని.. మళ్లీ మనసుకు అనుకూలమైన ఊహలను రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎలాగంటే.. మనకు బాగా ఇష్టమైన మనిషికి ప్రమాదం జరిగి ఉంటుందేమో? అని మనసు భయపడుతుంటే, దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి. ఆ మనిషి తిరిగి మీ కళ్ల ముందుకు వచ్చినట్లుగా, తనతో మీరు చెప్పాలనుకున్న కొన్ని మాటలుచెబుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ వైబ్రేషన్సే నిజంగా జరగబోయే ప్రమాదం నుంచి సైతం ఆ మనిషిని కాపాడే అవకాశం ఉంటుంది. 2. కృతజ్ఞతతో కూడిన ఆలోచనలు కూడా మనిషిని సానుకూలంగా మారుస్తాయి. మనసులోని క్రూరత్వాన్ని, అహంకారాన్ని పక్కకు నెడతాయి. ఇప్పటి దాకా సాఫీగా సాగుతున్న జీవితానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. మీతో పాటు పని చేసే ల్యాప్‌టాప్‌కి మీరెప్పుడైనా థాంక్స్ చెప్పారా? మిమ్మల్ని గమ్యానికి చేర్చే వాహనాన్ని మీరెప్పుడైనా కృతజ్ఞతా భావంతో చూశారా? వింతగా అనిపించినా ఇది నిజం. ప్రయత్నించి చూస్తే ఫలితం అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రపంచంలోని చాలా మతాలు చలనం లేని వస్తువుకు కూడా ప్రాణం ఉంటుందని నమ్ముతాయి. హిందూమతంలో యంత్రపూజ కూడా ఆ కోవకే వస్తుంది. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక ఎనర్జీ అక్కడుందని భావించి, బలంగా నమ్మితే.. దాని కిరణాలు మీ మదిని తాకుతాయి. అదే ‘యద్భావం తద్భవతి’ అనే నానుడిలోని సారాంశం. 3. ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రతికూలమైన ఆలోచనలే చుట్టుముడతాయి. అప్పుడు సానుకూలమైన ఆలోచనలను ప్రేరేపించడానికి మనసులోనే చర్చ జరగాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. అలాంటి చర్చ మదిలో జరిగితే.. ఒత్తిడి మాయమవుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. 4. ప్రతిక్షణం క్షమాగుణంతోనే ఆలోచించాలి. శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందనే నిజాన్ని గ్రహించుకోవాలి. చాలాసార్లు అవమానాలు, అవహేళనలు మనలో పట్టుదలను పెంచి, మనల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. అందుకే శత్రువుకు కూడా కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోమంటారు కొందరు జ్ఞానబోధకులు. మంచి మార్గం ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామాలు, ధ్యానం, యోగాలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడంతో పాటు.. పాజిటివ్ సంకల్పాలు స్వయంగా రాసుకుని, చదువుకోవడం అలవరచుకోవాలి. దాని వల్ల కూడా సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాంటి సంకల్పాలతో పాజిటివిటీని అందిపుచ్చుకునే ఎన్నో మార్గాలు నెట్టింట దొరుకుతూనే ఉన్నాయి. వాటిల్లోంచి అనుకూలమైన మార్గాన్ని ఎన్నుకుని అనుసరించొచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన మనిషి ఆలోచనా విధానాన్ని మూడు రకాలుగా విభజించాడు. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే పేర్లతో ఆలోచనా తీరును వివరించాడు. ఇడ్: ఈ ఆలోచన మనిషి మనసులో అచేతనావస్థలో ఉంటుంది. ఇది నైతిక విలువలను పాటించదు. నియమాలు, తప్పొప్పులు దానికి తెలియవు. మనసులో కలిగే కోరికలను తీర్చుకోవడానికి ఎక్కువగా మనిషిని తొందరపెడుతుంది. ఎక్కువ స్వార్థ చింతనతో ఉంటుంది. ఇగో: ఈ ఆలోచన చేతనావస్థలో ఉంటుంది. ఇది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. వాస్తవాలను గ్రహించి.. సమయానుకూలంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. సూపర్ ఇగో: ఇదే మనిషి అంతరాత్మ. నైతిక, సామాజిక విలువలను కచ్చితంగా పాటిస్తుంది. ఇగోకు మంచి చెడులను గుర్తు చేసి.. సాంఘిక ఆచారాలను పాటించేట్లు చేస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి ఇది మరింత పరిణతి పొందుతుంది. ఇది ఎక్కువగా నైతిక సూత్రాలపై ఆధారపడి అడుగులు వేస్తుంది. ఉదాహరణకు.. ‘దొంగతనంగా సినిమాకు వెళ్దాం’ అని ఇడ్ ప్రోత్సహిస్తే.. ‘దొంగతనంగా ఎలా వెళ్లొచ్చో?’ ఆలోచిస్తుంది ఇగో. కానీ ‘దొంగతనంగా వెళ్లడం సరికాదు, తప్పు, ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది, దాని వల్ల మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది’ అని హెచ్చిరిస్తూనే నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది సూపర్ ఇగో. ఇలా మనిషి ఆలోచన సరళిని విశ్లేషించాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్వాతంత్య్ర సమరయోధులు, కట్టుబాట్లపై, మూఢత్వాలపై తిరుగుబాటు చేసిన సంఘసంస్కర్తలు.. వీళ్లంతా ఉన్నతమైన ఆలోచనాపరులే. గొప్ప ఆలోచనల నుంచి ఉద్భవించిన కొన్ని సూక్తులు ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. దయతో జీవించండి, ఎవరినీ ఎప్పుడూ నిరుత్సాహపరచకండి. ఎవరు ఎంత తక్కువగా కనిపించినా.. ఏదో ఒకరోజు పురోగతిని సాధిస్తారు. -ప్లేటో చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం -రవీంద్రనాథ్ టాగోర్ ప్రేమ, స్నేహం, ఆగ్రహం, కరుణలతో ఇతరుల జీవితానికి విలువను ఆపాదించినంత కాలం.. మీకు కూడా విలువ ఉంటుంది -సిమోన్ ది బూవా మొదట అర్థం చేసుకోలేకపోతే.. దేన్నీ ప్రేమించలేరు, దేన్నీ ద్వేషించలేరు. ∙ఇబ్బందుల్లో కూడా నవ్వగల వారిని నేను ప్రేమిస్తున్నాను, నేర్చుకోవడానికి మనసు ఎప్పటికీ అలసిపోదు. -లియోనార్డో డా విన్సీ ‘చెయ్యాల్సిన పని పట్ల అవగాహన లేకపోతే.. భయపడటం పరిష్కారం కాదు.. నేర్చుకోవడమే మార్గం’ -ఐన్ రాండ్ మేధస్సుకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. -అల్బర్ట్ ఐన్ స్టీన్ సమానత్వంలోనే ధర్మం వర్ధిల్లుతుంది. స్త్రీ హక్కులను పంచుకోనివ్వండి. ఆమె పురుషుల ధర్మాలను కూడా అనుకరిస్తుంది. ఎందుకంటే విముక్తి పొందినప్పుడు ఆమె మరింత పరిపూర్ణంగా ఎదగాలి. -మేరీ వోల్స్టోన్ క్రాఫ్ట్ శత్రువును రెచ్చగొడితే అది మనకే నష్టం. అందరినీ ప్రేమించండి, కొందరిని నమ్మండి, ఎవరికీ నష్టం చేయకండి -షేక్స్పియర్ ప్రపంచంలో ప్రభావవంతమైన ఆలోచనాపరులు ఈ మానవాళిలో ఎందరో ఆలోచనపరులు.. తమ కోసం కాకుండా ప్రపంచం కోసం ఆలోచించారు. అందుకే నేటికీ ఆదర్శంగా నిలిచారు. ‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు కాళోజీ. కానీ తమ ఒక్క ఆలోచనతో కోట్లాది ప్రజలను కదల్చగలిగారు ఎందరో విశ్లేషకులు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వంటి గ్రీకు తత్వవేత్తలతో పాటు.. డార్విన్ , కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి వారు తమ ఆలోచనలతో చరిత్ర గమనాన్ని మార్చారు. డార్విన్ మనుషుల్లోని మూఢనమ్మకాలను చెదరగొడితే.. కార్ల్ మార్క్స్.. మనిషి బతకడం ఎలానో నేర్పించారు. చార్లెస్ డార్విన్ ఈయన ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పులను తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో కూడా డార్విన్ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. కార్ల్ మార్క్స్ ఈయన ఆలోచనలను, సిద్ధాంతాలను కలిపి సమష్టిగా.. ఈ ప్రపంచం ‘మార్క్సిజం’ అని పిలుస్తోంది. ప్రతి అంశంలోనూ న్యాయమైన వాదన వినిపించిన ఆలోచనాపరుడు కార్ల్ మార్క్స్. పిల్లలు పనికి పోకూడదని, బడికి వెళ్లాలని వాదిస్తూ భావితరాల గళం అయ్యాడు. ‘ఎంతసేపు ఉద్యోగమే కాదు.. మనిషికి వ్యక్తిగత జీవితం కూడా ఉండాలి. మనకూ ఇష్టాయిష్టాలు ఉండాలి. జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి’ అనే కాంక్షను బలపరచింది మార్క్సిజం. మనిషి ఉన్నతమైన జీవితానికి ఉద్యోగ సంతృప్తి చాలా అవసరమని చెప్పింది ఈయనే. మార్పుకి ప్రజలే ప్రతినిధులు అనే మార్క్స్ రాతలతోనే.. ప్రపంచరూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వాలపైన, మీడియాపైన ఓ కన్ను వేస్తూ ఉండాలని ప్రజలకు తెలిపింది మార్క్సిజం. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? న్యాయాన్యాయాల మధ్య నిలిచే అశాంతి నేటి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది. మనిషి ఆలోచనాశక్తిని కుంగదీస్తోంది. బలవంతుడు అన్యాయం చేసి గెలిస్తే, బలహీనుడు మరో నలుగురు బలహీనుల సాయం తీసుకుని వాడిపై గెలవగలడట. మనం ఎంతటి బలవంతులమైనా ఆలోచనలో సవరణలు, సడలింపులు లేకపోతే పతనం వెన్నంటే ఉంటుంది. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె’ అన్న సుమతీ శతకం చెప్పే నీతి అదే! ఆవు–పులి కథ ఒకనాడు మేత కోసం అడవికి వెళ్ళిన ఓ ఆవు పెద్దపులి కంటపడుతుంది. వెంటపడిన ఆ పులి తనని తినబోతుంటే.. ‘నీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టమే కాని, నాకు కొంత సమయం కావాలి’ అని వేడుకుంటుంది ఆవు. ఆవు కన్నీళ్లు చూసి కరిగిన పులి.. ‘సమయం దేనికి?’ అని అడుగుతుంది. ‘ఇంటి దగ్గర పాలకు ఏడ్చే నా బిడ్డ ఉంది. దానికి కడుపు నిండా పాలిచ్చి, మంచి చెడు చెప్పి వస్తాను’ అంటుంది ఆవు. మొదట అనుమానించిన పులి చివరికి ఒప్పుకుని పంపిస్తుంది. ఆవు అన్న మాట ప్రకారం చెప్పిన సమయానికి వచ్చి.. ‘ఇక నన్ను తిను’ అంటుంది. ఆవు నిజాయితీకి మెచ్చిన పులి జాలితో ఆవును విడిచిపెట్టేస్తుంది. చిన్నప్పుడు ఈ ‘ఆవు–పులి’ కథ వినే ఉంటారు. ఈ కథలో ఆవు మంచిది. మాట మీద నిలబడింది. ఆవులో కన్నతల్లి ప్రేమ, ఇచ్చిన మాటకోసం ప్రాణాలను త్యాగం చేసేంత ఔదార్యం, కష్టాన్ని మొరపెట్టుకోగలిగేంత వినయం.. ఇలా మనిషి నేర్చుకోదగ్గ ఎన్నో గొప్ప సత్యాలు ఉన్నాయి. కానీ, కథలో ఉన్న నీతి అక్కడి వరకే అనుకుంటే పొరబాటు. కథలో నిజమైన హీరో పులి. పులి స్వతహాగా బలమైన ప్రాణి. దానికి ఆవు మాట వినాల్సిన అవసరమే లేదు. కానీ.. ఆవుకి దాని ఆవేదన చెప్పుకునే సమయాన్నిచ్చింది. ఆకలితో ఉన్న తన బిడ్డ దగ్గరకు ఆవు వెళ్తానంటే నమ్మి.. పంపించింది. తిరిగి వస్తే.. ఆ నిజాయితీని మెచ్చి జాలితో విడిచిపెట్టింది పులి. ఈ రోజు ప్రతి బలవంతుడు నేర్చుకోవాల్సిన నీతి ఇది. ఆలోచించాల్సిన తర్కమిది. పులికి పంజా విసరగలిగే సత్తా ఉంది. అంతకు మించి.. అవకాశం ఉంది, బలంతో కూడిన అధికారం ఉంది, తినాలనేంత ఆకలుంది, ఏం చేసినా ప్రశ్నించలేని నిస్సçహాయత ఆవు రూపంలో ఎదురుగా ఉంది. అయినా పులి ఆలోచించింది. అదే నైతికతంటే. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలో మన చేత్లులోనే ఉంది. కాదు కాదు మన ఆలోచనల్లోనే ఉంది. స్వచ్ఛమైన మనసులో చెలరేగే ఊహలను ఈ విశ్వం చెవులారా వింటుందట. మరింకెందుకు ఆలస్యం? సానుకూలమైన ఆలోచనలను శాంతి పావురాల్లా ఎగరనివ్వండి -సంహిత నిమ్మన -
ధగధగ..సెగసెగ.. అతిపెద్ద స్ఫటికాల గుహ ఎక్కడంటే?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్ఫటికాల గుహ. బయటి నుంచి లోపలకు చూస్తే, భారీ స్ఫటిక శిలలు ధగధగలాడుతూ కనిపిస్తాయి. గుహ లోలోపలికి వెళుతుంటే మాత్రం తాళలేనంత వేడిసెగలు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ స్ఫటికాల గుహ మెక్సికోలోని చిహువాహువా సమీపంలో ఉంది. నైకా గనితో ఈ గుహను అనుసంధానించారు. ఇందులో జిప్సమ్, క్యాల్షియమ్ ఖనిజాల వల్ల ఏర్పడిన స్ఫటిక శిలలు భారీ పరిమాణంలో కనిపిస్తాయి. ఈ గుహను పూర్తిగా పరిశీలించడం ఎవరికీ సాధ్యం కాదు. లోలోపలకు వెళితే, అక్కడి ఉష్ణోగ్రతలు 58 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. లోపలి గాలిలో తేమ 90–99 శాతం మేరకు ఉంటుంది. గని కార్మికులైన జువాన్, పెడ్రో అనే సోదరులు తవ్వకాలు జరుపుతున్న సమయంలో పాతికేళ్ల కిందట ఈ గుహను గుర్తించారు. గుహలోని నేలకు అడుగు భాగంలో కరిగే స్థితిలో ఉన్న లావా కారణంగానే ఈ గుహలో విపరీతమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
Pillala Katha: పాపన్న కొలువు!
అనగనగా ఒక ఊళ్లో పాపన్న అనే సంపన్నుడు ఉండేవాడు. అతని చేతి కింద జీతానికి ఒక పనివాడు కావాల్సి వచ్చింది .జీతంతో పాటు భోజనం, వసతి కూడా కల్పిస్తానని ప్రకటించాడు పాపాన్న. పొరుగూరి నుంచి గంగన్న అనే యువకుడు పని వెదుక్కుంటూ పాపయ్య వాళ్ల ఊరికి వచ్చాడు. గంగన్న ఒక అనాథ. తెలివైన యువకుడు. నిరుపేద. క్రితం రోజు నుంచి భోజనం కూడా చేయలేదు. కూడలిలో ఒక ఆసామిని ‘అయ్యా! పాపన్న గారింట్లో జీతానికి పనివాడు కావాలని తెలిసింది. అతని ఇల్లు ఎక్కడో చెపుతారా?’ అని అడిగాడు. ఆ ఆసామి గంగన్నను ఎగాదిగా చూసి ‘ఏ ఊరు బాబూ నీది? పోయి పోయి పాపన్న కింద పనిచేస్తావా?’ అన్నాడు. ‘ఎందుకండీ.. అలా అంటున్నారు?’ అంటూ ఆశ్చర్యపోయాడు గంగన్న. ‘పాపన్న ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టడు. నీకు జీతం రాళ్ళేమిస్తాడు?’ అన్నాడు ఆ ఆసామి. ‘పరవాలేదు. అతని ఇల్లెక్కడో చెప్పండి’ అని అడిగాడు గంగన్న. ‘ఇలా తిన్నగా వెళ్ళి కుడిచేతి వైపు తిరిగి ఎవరిని అడిగినా చూపిస్తారు’ అని చెప్పాడు ఆసామి. సందు చివరి దాక వెళ్ళిన గంగన్న.. అక్కడ కొబ్బరికాయలు అమ్మే వ్యక్తిని పాపన్న ఇల్లు గురించి వాకబు చేశాడు. విషయం తెలుసుకున్న ఆ కొబ్బరికాయల వ్యాపారి ‘ఆ పాపన్న పిల్లికి కూడా బిచ్చం వేయడు. ఇక నీకు తిండేం పెడతాడో’ అన్నాడు. ‘నాకు పని అత్యవసరం. ఉండటానికి ఇంత చోటిస్తే చాలు .. సర్దుకు పోతాను’ చెప్పాడు గంగన్న. ‘సరే, నీ ఇష్టం’ అంటూ ‘అదిగో ఆ కనిపించే రామాలయం దగ్గర ఉంటుంది అతని ఇల్లు’ అని చూపించాడు ఆ వ్యాపారి. గంగన్న రామాలయం దగ్గరకు వెళ్లి.. గుడి ముందు నిలబడి అటూ ఇటూ చూశాడు. గుడిలోంచి ఓ పంతులు బయటికి రావటం గమనించి అతనికి తను వచ్చిన విషయం చెప్పి ‘పాపన్న ఇల్లు ఎక్కడ?’ అని అడిగాడు. అతను నెమ్మదిగా నవ్వుతూ ‘పాలు చిలికితే వెన్న వస్తుంది. జలము చిలికితే శ్రమ, అలసట, నొప్పులు తప్ప ఒరిగేదేమి లేదు! పాపయ్య దగ్గర పనికి కుదిరినా అంతే!’ అంటూ ఇంటి బయట మురికి కాలువలో చెత్త తీస్తున్న పాపన్నను చూపించాడు. పాపన్న దగ్గరకు వెళ్లి.. తన పరిస్థితి వివరించి పని కావాలని అడిగాడు గంగన్న. అతని అవసరాన్ని గ్రహించిన పాపన్న.. అతనికి భోజనం పెట్టి, ఉండటానికి గది చూపించాడు. ‘పొలానికి పోదాం పద’ అన్నాడు. ‘ అయ్యా! బండి కట్టమంటారా?’ అడిగాడు గంగన్న . ‘ఊరి చివర పొలానికి వెళ్ళటానికి బండెందుకురా!’ అన్నాడు పాపన్న. ఇద్దరూ నడుచుకుంటూ పొలానికి వెళ్ళారు. పొలం నుంచి ఇంటికి రాగానే నలుగురు వ్యక్తులు లెక్కల పుస్తకాలతో సిద్ధంగా ఉన్నారు. లెక్కలు చూసి నలుగురికీ పెద్దమొత్తంలో నగదు ఇచ్చి పంపాడు పాపన్న. తను ఇంతకాలం ఉన్న అనాథ ఆశ్రమం, చదువుకున్న బడి పాపన్న కట్టించినవేనని, ఆడంబరాలకు పోకుండా, సాధారణ జీవితం గడుపుతూన్న అతను గుప్తదానాలు చేసే పుణ్యాత్ముడని తెలుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు గంగన్నకు. -మహంకాళి స్వాతి -
భక్త విజయం.. పరశురాముడి తపస్సు..!
ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో ఉన్న తండ్రి జమదగ్ని వద్దకు వెళ్లి, ‘తండ్రీ! నాకు పితామహ ప్రపితామహులను చూడాలని ఉంది. వెళ్లి రావడానికి అనుమతించు’ అన్నాడు.‘సరే’నన్నాడు జమదగ్ని. తండ్రి అనుమతితో బయలుదేరిన పరశురాముడు తొలుత తన తాత అయిన ఋచీకుడి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ కొద్ది రోజులు గడిపి సెలవు తీసుకుని, ముత్తాత అయిన భృగు మహర్షి ఆశ్రమానికి బయలు దేరాడు. భృగు మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్లు ఉన్నాడు. భృగు మహర్షి ఒకనాడు పరశురాముణ్ణి పిలిచి, ‘నాయనా! లోకక్షేమం కోసం నువ్వు ఇక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లి, ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించు. ఆయన ప్రసన్నుడై వరం కోరుకోమని అడిగితే, అప్పుడు శత్రువినాశకరాలైన దివ్యాస్త్రాలను కోరుకో. భవిష్యత్తులో నువ్వు ఎన్నో మహత్కార్యాలను చేయవలసి ఉంటుంది. క్షేమంగా వెళ్లిరా’ అని సాగనంపాడు. ముత్తాత ఆదేశంపై పరశురాముడు హిమాలయాలకు చేరుకుని, అక్కడ ఒక సుందర సరోవర తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే ఉంటూ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. గ్రీష్మంలో పంచాగ్నుల మధ్య నిలబడి, శీతకాలంలో సరోవరం నీళ్లలో నిలబడి శీతోష్ణాలను సహించి తన తపస్సును కొనసాగించాడు. పరశురాముడి తపస్సు సంగతి మునిగణాలకు తెలిసి, వారంతా ఆశ్చర్యం చెందారు. తమ తపస్సుతో పాపక్షయం చేసుకుని, పరమ తాపసులుగా ప్రసిద్ధి పొందిన అత్రి, జాబాలి, వామదేవుడు, మృకండుడు వంటి వారంతా పరశురాముడి తపస్సును చూడటానికి అక్కడకు చేరుకున్నారు. పరశురాముడి తపోదీక్ష పరమశివుడిని కదిలిచింది. వరాలు ఇచ్చే ముందు పరశురాముడి ప్రతిభను పరీక్షించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పరమశివుడు ఒక ఆటవికుడి రూపం దాల్చాడు. ఒక చేత మాంసఖండం పట్టుకుని, దానిని నములుతూ పరశురాముడి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు వద్ద నిలుచున్నాడు. సరోవరంలో స్నానం ముగించుకున్న పరశురాముడు ఆశ్రమంలోకి అడుగుపెడుతూ కనిపించాడు. ఆటవికుడి రూపంలో ఉన్న పరమశివుడు అతడికి ఎదురుగా వెళ్లి నిలిచాడు. ‘స్వామీ! నేను వ్యాధుడను. నా పేరు తోషప్రహర్షుడు. ఈ మహావనంలో నేను చిరకాలంగా ఉంటున్నాను. నేనే ఈ ప్రదేశానికి అధిపతిని. ఇక్కడ నా అనుమతి లేనిదే ఎవరూ నివసించకూడదు. ఇంతకూ తమరెవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. ‘నా పేరు రాముడు. జమదగ్ని మహర్షి కొడుకును. భృగువంశీయుణ్ణి. పరమశివుడి అనుగ్రహం కోసం నేను చిరకాలంగా ఇక్కడే తపస్సు చేసుకుంటున్నాను. నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను. ఇది నీ ప్రదేశం అంటున్నావు కాబట్టి నేను నీకు అతిథినవుతాను. పైగా నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను. అతిథులను గౌరవించడం ధర్మం. నన్ను తిరస్కరించడం నీకు క్షేమం కాదు. నువ్వే ఎక్కడికైనా వెళ్లడం మంచిది.’ అని బదులిచ్చాడు పరశురాముడు. ‘ఇదేం ధర్మం? నా ప్రదేశానికి వచ్చి, నన్నే వెళ్లమంటున్నావే! ఇది నా నివాసం. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే తింటాను. నీకు అసహ్యంగా ఉంటే వేరే ప్రదేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. లేదా అన్నీ సహిస్తూ ఇక్కడే ఉండు. నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు వ్యాధుడు. పరశురాముడు ఉగ్రుడయ్యాడు. ‘నువ్వు నిజంగానే చూడటానికి అసహ్యంగా ఉన్నావు. జంతువులను హింసించి, వాటి మాంసాన్ని తింటూ అధముడిలా ఉన్నావు. నువ్వు నా సమీపంలో నివసించడానికి తగవు. నువ్వు మర్యాదగా వెళితే సరేసరి, లేకుంటే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది’ అన్నాడు. వ్యాధుడు ఏమీ ఆవేశపడకుండా, ‘స్వామీ నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. జంతువులను వేటాడటం నా వృత్తి. వాటి మాంసం నాకు భుక్తి. నా అవసరానికి మించి ఏ ఒక్క జీవిని చంపినా నాకు పాపం తాకుతుంది. అయినా, ఇన్ని ధర్మపన్నాలు చెబుతున్న నువ్వు నిజంగా ధర్మాత్ముడివేనా? తండ్రి మాట విని తల్లిని చంపిన నువ్వు నాకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. మనుషుల్లో భేదభావాలు చూపే నిన్ను ఆ పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడు?’ అని నిలదీశాడు. ఒక మామూలు వ్యాధుడు తన వృత్తాంతమంతటినీ చెప్పడంతో పరశురాముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన ఎదుట ఉన్నది వ్యాధుడు కాదని గ్రహించాడు. సాక్షాత్తు పరమశివుడే తనను పరీక్షించడానికి ఇలా వచ్చాడేమో అనుకున్నాడు. ‘మహానుభావా! నువ్వెవరివి? అనవసరంగా నీ మీద ఆగ్రహించాను. నన్ను క్షమించు. నువ్వు సామాన్య వ్యాధుడవు కాదు. నా అపరాధాన్ని మన్నించి, నీ నిజరూపాన్ని చూపించు’ అని ప్రార్థించాడు. వ్యాధుడు బదులివ్వలేదు. పరశురాముడు అక్కడే కూర్చుని, ధ్యానమగ్నుడయ్యాడు. అతడి మనోనేత్రానికి వ్యాధుడి రూపంలో ఉన్న పరమశివుడు దర్శనమిచ్చాడు. ధ్యానం విరమించుకుని పరశురాముడు కళ్లు తెరిచాడు. ఎదురుగా వ్యాధుడు చిరునవ్వుతో కనిపించాడు. పరశురాముడు వెంటనే అతడి పాదాల మీద పడి పరిపరి విధాలుగా శివస్తోత్రం చేశాడు. శివుడు సంతోషించాడు. ‘రామా! నీ కోరిక నాకు తెలుసు. భూమండలంలోని సమస్త తీర్థాలలో స్నానం ఆచరించి, తపస్సు చేస్తే తప్ప నువ్వు నా దివ్యాస్త్రాలను పొందలేవు. నేను చెప్పిన విధంగా ఆచరించి తిరిగిరా. అప్పుడు నీకు దివ్యాస్త్రాలు లభిస్తాయి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు. -సాంఖ్యాయన -
Smart Lock: అరచేతిని చూపిస్తేనే తెరుచుకుంటుంది
మామూలు తాళాలను ఆరితేరిన దొంగలు ఇట్టే తెరిచి, ఇల్లంతా దోచుకునే ప్రమాదం ఉంది. ఇది స్మార్ట్‌లాక్. ఎంత ఆరితేరిన దొంగలైనా దీనిని తెరవలేరు. దీనిని తెరవడానికి తాళం చెవితో పనిలేదు. దీనికి తెలిసిన వారి అరచేతిని చూపిస్తేనే తెరుచుకుంటుంది. ఇందులో యాభై వరకు అరచేతి ముద్రలను నమోదు చేసుకునే వీలుంది. సాధారణంగా అన్ని నమోదు చేసుకోనవసరం ఉండదు గాని, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరి అరచేతి ముద్రలను నమోదు చేసుకుంటే, ఇది భేషుగ్గా ఉపయోగపడుతుంది. అమెరికన్ కంపెనీ ఫిలిప్స్ కార్పొరేషన్ దీనిని రూపొందించింది. దీనిని తెరవాలంటే దీనికి అమర్చి ఉన్న స్కానర్ వద్ద అరచేతిని చూపిస్తే చాలు. దీని ధర 359.99 డాలర్లు (రూ.29,925) మాత్రమే! -
రైల్విలాస్: అప్పట్లో రైల్వేస్టేషన్.. ఇప్పుడు హోటల్
ప్రపంచంలోని పురాతనమైన రైల్వేస్టేషన్లలో ఇదొకటి. ఒకప్పుడు రైళ్ల రాకపోకలతో కళకళలాడేది. ఇక్కడ రైల్వే సేవలు నిలిచిపోవడంతో కొన్నాళ్లకు ఈ రైల్వేస్టేషన్నే హోటల్‌గా మార్చేశారు. ఇది ఇంగ్లండ్‌లోని పెట్వర్త్లో ఉంది. మిడ్ ససెక్స్ రైల్వే కంపెనీ 1859లో ఇక్కడ రైల్వేస్టేషన్‌ను నిర్మించింది. అప్పట్లో ఇక్కడ రైల్వే సిబ్బంది, ప్రయాణికుల వసతి కోసం స్టేషన్‌కు ఆనుకునే ‘రైల్వే ఇన్’ అనే హోటల్ కూడా వెలిసింది. దాదాపు శతాబ్దానికి పైగా సేవలందించిన పెట్వర్త్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను 1966లో నిలిపి వేశారు. తర్వాత దశాబ్దాల తరబడి ఇది అతీ గతీ లేకుండా పడి ఉంది. తర్వాత రైల్వేస్టేషన్‌కు మరమ్మతులు జరిపి, 1995లో తొలిసారిగా స్టేషన్ భవనంలో రెండు గదులను హోటల్ గదుల్లా మార్చి, అతిథులకు బస కల్పించడం ప్రారంభించారు. తర్వాత ఇక్కడ నిలిచిపోయిన పాత రైళ్ల బోగీలను కూడా హోటల్ గదులుగా మార్చి, స్టేషన్ భవనంలో కూడా మరిన్ని గదులను ఏర్పాటు చేసి 1998 నుంచి దీన్ని ‘ద ఓల్డ్ రైల్వేస్టేషన్’ పేరుతో పూర్తిస్థాయి హోటల్‌గా మార్చారు.


