థింక్‌ ట్యూన్‌ అప్‌ | Sakshi
Sakshi News home page

థింక్‌ ట్యూన్‌ అప్‌

Published Sun, Feb 18 2024 8:20 AM

There are many benefits of positive thinking - Sakshi

‘ఆలోచనను బట్టే ఆచరణ, ఆచరణను బట్టే కర్మఫలం’ ప్రతిదానికీ ఆలోచనే మూలం. అందుకే ఒక మనిషి మనుగడకు ప్రాణవాయువు, అన్నపానీయాలు ఎంత అవసరమో ఆలోచించడం కూడా అంతే అవసరం. నిజానికి మనిషిని సమస్తజీవకోటి నుంచి వేరు చేసిందే ఆలోచన. మానవాళి మనుగడకు మార్గం వేసేదే ఆలోచన. మరి అలాంటి ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే ఏం చెయ్యాలి?

‘మంచి ఆలోచనకు మించిన మనుగడ లేదు, చెడ్డ ఆలోచనకు పోలిన చావు లేదు’ అంటారు పెద్దలు. అవసరాన్ని బట్టి బుద్ధికుశలతను ఉపయోగించడం, పరిస్థితిని బట్టి వివేకంగా వ్యవహరించడం, సందర్భానుసారంగా విచక్షణతో నడుచుకోవడం, క్లిష్టమైన సమయాల్లో కూడా జ్ఞానాన్ని ప్రదర్శించడం.. ఇవన్నీ ఆలోచన పరిధికి గుణకారాలే! అయితే అందుకు సాధన ఎంతో అవసరం.

థింక్‌ ట్యూన్‌ అప్‌
ట్యూన్‌ అప్‌ అంటే స్వరాన్ని పెంచడం.. లేదా అడ్జస్ట్‌ చేసుకోవడం. సాధారణంగా రేడియోకో.. ఇయర్‌ ఫోన్‌ కో, బ్లూటూత్‌కో ఉండే ట్యూన్‌ బటన్‌ ని మనకు తగ్గట్టుగా.. మనకు కావాల్సినట్లుగా సెట్‌ చేసుకుంటాం. మరి మది ఆలోచల్ని ఎలా ట్యూన్‌ అప్‌ చేసుకోవాలి? మనసు స్వరాల్లో మంచి స్వరాన్ని ఎలా ఎంచుకోవాలి? ఎలా పెంచుకోవాలి?

‘ఒక సీసా నిండా గాలి ఉన్నప్పుడు అందులోని గాలిని బయటకు పంపాలంటే, ఆ సీసాలో నీళ్లు నింపడమే మార్గం. అలాగే మనసులోని ప్రతికూల భావాలు ఆవిరైపోవాలంటే, మనసు నిండా సానుకూల ఆలోచనలను పెంచుకోవాలి. పాజిటివ్‌ థింకింగ్, నెగటివ్‌ థింకింగ్‌.. ఈ రెండింటికీ ప్రభావవంతమైన శక్తులు ఉంటాయని, మనం దేన్ని నమ్ముతామో అదే జరుగుతుందని చెబుతారు సానుకూలపరులు. 

‘సే సమ్‌థింగ్‌ పాజిటివ్‌ అండ్‌ యు విల్‌ సీ సమ్‌థింగ్‌ పాజిటివ్‌’... ‘మంచి గురించి మాట్లాడితే, మంచే కనిపిస్తుంది’ అని దీని అర్థం. అంటే మాట మంత్రంలా పని చేస్తుంది. ఆ వైబ్రేషన్స్‌ వైర్‌లెస్‌గా పనిచేస్తాయి. ఇక్కడే ఆధ్యాత్మికతకు.. శాస్త్రీయతకు పొంతన కుదురుతుంది.

మనస్సుకు ఆహారం

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, మనసు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం. ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాల కోసం మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. మంచివాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని మాత్రమే కోరుకోవాలి. అందుకే ‘మంచి ఆలోచనలే మనసుకు మంచి ఆహారం’ అంటారు మానసిక నిపుణులు.

ఒక మంచి విషయాన్ని మనం బలంగా నమ్మితే, ప్రపంచం మొత్తం ఆ కోరికను నిజం చేయడానికి కుట్ర చేస్తుందట. అంటే ప్రకృతి ఆజ్ఞతో.. తెలియకుండానే చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు మనకు సహకరిస్తారు. ఆలోచనలు సానుకూలంగా ఉంటే, జీవితం సాఫీగా సాగుతుంది.

మనసులో తలెత్తే అపోహలు, భయాలు, ప్రతికూల భావాలకు వ్యతిరేకంగా, మంచి సంకల్పాలను మనంతట మనమే సృష్టించుకోవాలి. ఉదయం లేవగానే.. ‘ఈ రోజు నాకు మంచి జరుగుతుంది. ఈ రోజు చాలా బాగుంటుంది’ అని మనసును ఉత్తేజపరచేలా ప్రకృతికి చెప్పడం నేర్చుకోవాలి. ‘ఎందుకొచ్చిన జీవితంరా సామీ?’ అంటూ ఏడుస్తూ నిద్రలేస్తే ఆ రోజు మొత్తం అంతే అసంతృప్తిగా ముగుస్తుందట. 

ఆలోచనలతో ఆరోగ్య ప్రయోజనాలు


సానుకూల ఆలోచనలతో.. ప్రమాదకరమైన జబ్బుల్ని కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆశావాద దృక్పథం ఉంటే.. అది తీవ్ర అనారోగ్యాలను సైతం అరికడుతుందట. రొమ్ము క్యాన్సర్, కొలోరెక్టల్‌ క్యాన్సర్, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, మానసిక రుగ్మతలు ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సమూలంగా తగ్గించే గుణం.. కేవలం సానుకూల ఆలోచనలకే ఉందట. ‘నాకేం కాదు’ అనే సంకల్పంతోనే బతికి బయటపడుతున్నారట. అందుకే ‘పాజిటివ్‌ థింకింగ్‌.. మెరుగైన రోగనిరోధక శక్తి’ అంటున్నారు నిపుణులు. 

పాజిటివ్‌ థింకింగ్‌ ఎలా ప్రాక్టీస్‌ చేయాలి?
1. ప్రతిక్షణం ఆలోచనలను గమనించుకోవాలి. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్‌లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవడం నేర్చుకోవాలి. ప్రతికూలమైన ఊహలు కలిగినప్పుడు.. నిట్టూర్పులను పక్కన పెట్టి.. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా తీసుకుని.. మళ్లీ మనసుకు అనుకూలమైన ఊహలను రీఫ్రేమ్‌ చేసుకోవాలి.

ఎలాగంటే.. మనకు బాగా ఇష్టమైన మనిషికి ప్రమాదం జరిగి ఉంటుందేమో? అని మనసు భయపడుతుంటే, దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి. ఆ మనిషి తిరిగి మీ కళ్ల ముందుకు వచ్చినట్లుగా, తనతో మీరు చెప్పాలనుకున్న కొన్ని మాటలుచెబుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ వైబ్రేషన్సే నిజంగా జరగబోయే ప్రమాదం నుంచి సైతం ఆ మనిషిని కాపాడే అవకాశం ఉంటుంది. 

2. కృతజ్ఞతతో కూడిన ఆలోచనలు కూడా మనిషిని సానుకూలంగా మారుస్తాయి. మనసులోని క్రూరత్వాన్ని, అహంకారాన్ని పక్కకు నెడతాయి. ఇప్పటి దాకా సాఫీగా సాగుతున్న జీవితానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. మీతో పాటు పని చేసే ల్యాప్‌టాప్‌కి మీరెప్పుడైనా థాంక్స్‌ చెప్పారా? మిమ్మల్ని గమ్యానికి చేర్చే వాహనాన్ని మీరెప్పుడైనా కృతజ్ఞతా భావంతో చూశారా? వింతగా అనిపించినా ఇది నిజం.

ప్రయత్నించి చూస్తే ఫలితం అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రపంచంలోని చాలా మతాలు చలనం లేని వస్తువుకు కూడా ప్రాణం ఉంటుందని నమ్ముతాయి. హిందూమతంలో యంత్రపూజ కూడా ఆ కోవకే వస్తుంది. నెగటివ్‌ అయినా పాజిటివ్‌ అయినా ఒక ఎనర్జీ అక్కడుందని భావించి, బలంగా నమ్మితే.. దాని కిరణాలు మీ మదిని తాకుతాయి. అదే ‘యద్భావం తద్భవతి’ అనే నానుడిలోని సారాంశం.

3. ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రతికూలమైన ఆలోచనలే చుట్టుముడతాయి. అప్పుడు సానుకూలమైన ఆలోచనలను ప్రేరేపించడానికి మనసులోనే చర్చ జరగాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. అలాంటి చర్చ మదిలో జరిగితే.. ఒత్తిడి మాయమవుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.

4. ప్రతిక్షణం క్షమాగుణంతోనే ఆలోచించాలి. శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందనే నిజాన్ని గ్రహించుకోవాలి. చాలాసార్లు అవమానాలు, అవహేళనలు మనలో పట్టుదలను పెంచి, మనల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. అందుకే శత్రువుకు కూడా కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోమంటారు కొందరు జ్ఞానబోధకులు.

మంచి మార్గం

ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామాలు, ధ్యానం, యోగాలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడంతో పాటు.. పాజిటివ్‌ సంకల్పాలు స్వయంగా రాసుకుని, చదువుకోవడం అలవరచుకోవాలి. దాని వల్ల కూడా సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాంటి సంకల్పాలతో పాజిటివిటీని అందిపుచ్చుకునే ఎన్నో మార్గాలు నెట్టింట దొరుకుతూనే ఉన్నాయి. వాటిల్లోంచి అనుకూలమైన మార్గాన్ని ఎన్నుకుని అనుసరించొచ్చు.


సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌


ఈయన మనిషి ఆలోచనా విధానాన్ని మూడు రకాలుగా విభజించాడు. ఇడ్, ఇగో, సూపర్‌ ఇగో అనే పేర్లతో ఆలోచనా తీరును వివరించాడు.
ఇడ్‌: ఈ ఆలోచన మనిషి మనసులో అచేతనావస్థలో ఉంటుంది. ఇది నైతిక విలువలను పాటించదు. నియమాలు, తప్పొప్పులు దానికి తెలియవు. మనసులో కలిగే కోరికలను తీర్చుకోవడానికి ఎక్కువగా మనిషిని తొందరపెడుతుంది. ఎక్కువ స్వార్థ చింతనతో ఉంటుంది.

ఇగో: ఈ ఆలోచన చేతనావస్థలో ఉంటుంది. ఇది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. వాస్తవాలను గ్రహించి.. సమయానుకూలంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది.

సూపర్‌ ఇగో: ఇదే మనిషి అంతరాత్మ. నైతిక, సామాజిక విలువలను కచ్చితంగా పాటిస్తుంది. ఇగోకు మంచి చెడులను గుర్తు చేసి.. సాంఘిక ఆచారాలను పాటించేట్లు చేస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి ఇది మరింత పరిణతి పొందుతుంది. ఇది ఎక్కువగా నైతిక సూత్రాలపై ఆధారపడి అడుగులు వేస్తుంది.

ఉదాహరణకు.. ‘దొంగతనంగా సినిమాకు వెళ్దాం’ అని ఇడ్‌ ప్రోత్సహిస్తే.. ‘దొంగతనంగా ఎలా వెళ్లొచ్చో?’ ఆలోచిస్తుంది ఇగో. కానీ ‘దొంగతనంగా వెళ్లడం సరికాదు, తప్పు, ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది, దాని వల్ల మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది’ అని హెచ్చిరిస్తూనే నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది సూపర్‌ ఇగో. ఇలా మనిషి ఆలోచన సరళిని విశ్లేషించాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్వాతంత్య్ర సమరయోధులు, కట్టుబాట్లపై, మూఢత్వాలపై తిరుగుబాటు చేసిన సంఘసంస్కర్తలు.. వీళ్లంతా ఉన్నతమైన ఆలోచనాపరులే.

గొప్ప ఆలోచనల నుంచి ఉద్భవించిన కొన్ని సూక్తులు

ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. దయతో జీవించండి, ఎవరినీ ఎప్పుడూ నిరుత్సాహపరచకండి. ఎవరు ఎంత తక్కువగా కనిపించినా.. ఏదో ఒకరోజు పురోగతిని సాధిస్తారు.  -ప్లేటో

చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం -రవీంద్రనాథ్‌ టాగోర్‌

ప్రేమ, స్నేహం, ఆగ్రహం, కరుణలతో ఇతరుల జీవితానికి విలువను ఆపాదించినంత కాలం.. మీకు కూడా విలువ ఉంటుంది -సిమోన్‌ ది బూవా

మొదట అర్థం చేసుకోలేకపోతే.. దేన్నీ ప్రేమించలేరు, దేన్నీ ద్వేషించలేరు. ∙ఇబ్బందుల్లో కూడా నవ్వగల వారిని నేను ప్రేమిస్తున్నాను, నేర్చుకోవడానికి మనసు ఎప్పటికీ అలసిపోదు. -లియోనార్డో డా విన్సీ

‘చెయ్యాల్సిన పని పట్ల అవగాహన లేకపోతే.. భయపడటం పరిష్కారం కాదు.. నేర్చుకోవడమే మార్గం’ -ఐన్‌ రాండ్‌

మేధస్సుకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. -అల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌

సమానత్వంలోనే ధర్మం వర్ధిల్లుతుంది. స్త్రీ హక్కులను పంచుకోనివ్వండి. ఆమె పురుషుల ధర్మాలను కూడా అనుకరిస్తుంది. ఎందుకంటే విముక్తి పొందినప్పుడు ఆమె మరింత పరిపూర్ణంగా ఎదగాలి. -మేరీ వోల్‌స్టోన్‌ క్రాఫ్ట్‌

శత్రువును రెచ్చగొడితే అది మనకే నష్టం. అందరినీ ప్రేమించండి, కొందరిని నమ్మండి, ఎవరికీ నష్టం చేయకండి  -షేక్‌స్పియర్‌

ప్రపంచంలో ప్రభావవంతమైన ఆలోచనాపరులు
ఈ మానవాళిలో ఎందరో ఆలోచనపరులు.. తమ కోసం కాకుండా ప్రపంచం కోసం ఆలోచించారు. అందుకే నేటికీ ఆదర్శంగా నిలిచారు. ‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు కాళోజీ. కానీ తమ ఒక్క ఆలోచనతో కోట్లాది ప్రజలను కదల్చగలిగారు ఎందరో విశ్లేషకులు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్‌ వంటి గ్రీకు తత్వవేత్తలతో పాటు.. డార్విన్‌ , కార్ల్‌ మార్క్స్, సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ వంటి వారు తమ ఆలోచనలతో చరిత్ర గమనాన్ని మార్చారు. డార్విన్‌  మనుషుల్లోని మూఢనమ్మకాలను చెదరగొడితే.. కార్ల్‌ మార్క్స్‌.. మనిషి బతకడం ఎలానో నేర్పించారు.

చార్లెస్‌ డార్విన్‌

ఈయన ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పులను తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో కూడా డార్విన్‌ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది.

కార్ల్‌ మార్క్స్‌ 

ఈయన ఆలోచనలను, సిద్ధాంతాలను కలిపి సమష్టిగా.. ఈ ప్రపంచం ‘మార్క్సిజం’ అని పిలుస్తోంది. ప్రతి అంశంలోనూ న్యాయమైన వాదన వినిపించిన ఆలోచనాపరుడు కార్ల్‌ మార్క్స్‌. పిల్లలు పనికి పోకూడదని, బడికి వెళ్లాలని వాదిస్తూ భావితరాల గళం అయ్యాడు. ‘ఎంతసేపు ఉద్యోగమే కాదు.. మనిషికి వ్యక్తిగత జీవితం కూడా ఉండాలి. మనకూ ఇష్టాయిష్టాలు ఉండాలి.

జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి’ అనే కాంక్షను బలపరచింది మార్క్సిజం. మనిషి ఉన్నతమైన జీవితానికి ఉద్యోగ సంతృప్తి చాలా అవసరమని చెప్పింది ఈయనే. మార్పుకి ప్రజలే ప్రతినిధులు అనే మార్క్స్‌ రాతలతోనే.. ప్రపంచరూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వాలపైన, మీడియాపైన ఓ కన్ను వేస్తూ ఉండాలని ప్రజలకు తెలిపింది మార్క్సిజం.

ఎప్పుడైనా ఇలా ఆలోచించారా?
న్యాయాన్యాయాల మధ్య నిలిచే అశాంతి నేటి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది. మనిషి ఆలోచనాశక్తిని కుంగదీస్తోంది. బలవంతుడు అన్యాయం చేసి గెలిస్తే, బలహీనుడు మరో నలుగురు బలహీనుల సాయం తీసుకుని వాడిపై గెలవగలడట. మనం ఎంతటి బలవంతులమైనా ఆలోచనలో సవరణలు, సడలింపులు లేకపోతే పతనం వెన్నంటే ఉంటుంది. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె’ అన్న సుమతీ శతకం చెప్పే నీతి అదే!

ఆవు–పులి కథ
ఒకనాడు మేత కోసం అడవికి వెళ్ళిన ఓ ఆవు పెద్దపులి కంటపడుతుంది. వెంటపడిన ఆ పులి తనని తినబోతుంటే.. ‘నీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టమే కాని, నాకు కొంత సమయం కావాలి’ అని వేడుకుంటుంది ఆవు. ఆవు కన్నీళ్లు చూసి కరిగిన పులి.. ‘సమయం దేనికి?’ అని అడుగుతుంది. ‘ఇంటి దగ్గర పాలకు ఏడ్చే నా బిడ్డ ఉంది.

దానికి కడుపు నిండా పాలిచ్చి, మంచి చెడు చెప్పి వస్తాను’ అంటుంది ఆవు. మొదట అనుమానించిన పులి చివరికి ఒప్పుకుని పంపిస్తుంది. ఆవు అన్న మాట ప్రకారం చెప్పిన సమయానికి వచ్చి.. ‘ఇక నన్ను తిను’ అంటుంది. ఆవు నిజాయితీకి మెచ్చిన పులి జాలితో ఆవును విడిచిపెట్టేస్తుంది.


చిన్నప్పుడు ఈ ‘ఆవు–పులి’ కథ వినే ఉంటారు. ఈ కథలో ఆవు మంచిది. మాట మీద నిలబడింది. ఆవులో కన్నతల్లి ప్రేమ, ఇచ్చిన మాటకోసం ప్రాణాలను త్యాగం చేసేంత ఔదార్యం, కష్టాన్ని మొరపెట్టుకోగలిగేంత వినయం.. ఇలా మనిషి నేర్చుకోదగ్గ ఎన్నో గొప్ప సత్యాలు ఉన్నాయి. కానీ, కథలో ఉన్న నీతి అక్కడి వరకే అనుకుంటే పొరబాటు. కథలో నిజమైన హీరో పులి. పులి స్వతహాగా బలమైన ప్రాణి. దానికి ఆవు మాట వినాల్సిన అవసరమే లేదు.

కానీ.. ఆవుకి దాని ఆవేదన చెప్పుకునే సమయాన్నిచ్చింది. ఆకలితో ఉన్న తన బిడ్డ దగ్గరకు ఆవు వెళ్తానంటే నమ్మి.. పంపించింది. తిరిగి వస్తే.. ఆ నిజాయితీని మెచ్చి జాలితో విడిచిపెట్టింది పులి. ఈ రోజు ప్రతి బలవంతుడు నేర్చుకోవాల్సిన నీతి ఇది.

ఆలోచించాల్సిన తర్కమిది. పులికి పంజా విసరగలిగే సత్తా ఉంది. అంతకు మించి.. అవకాశం ఉంది, బలంతో కూడిన అధికారం ఉంది, తినాలనేంత ఆకలుంది, ఏం చేసినా ప్రశ్నించలేని నిస్సçహాయత ఆవు రూపంలో ఎదురుగా ఉంది. అయినా పులి ఆలోచించింది. అదే నైతికతంటే.

ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలో మన చేత్లులోనే ఉంది. కాదు కాదు మన ఆలోచనల్లోనే ఉంది. స్వచ్ఛమైన మనసులో చెలరేగే ఊహలను ఈ విశ్వం చెవులారా వింటుందట. మరింకెందుకు ఆలస్యం? సానుకూలమైన ఆలోచనలను శాంతి పావురాల్లా ఎగరనివ్వండి -సంహిత నిమ్మన 

Advertisement
Advertisement