నేడు నేషనల్ పేరెంట్స్ డే
అమ్మా నాన్నలది సెలవు లేని ఉద్యోగం... జీతం లేని షిఫ్ట్
ప్రపంచంలో అన్ని ఉద్యోగాలకు జీతం ఉంటుంది.
ఆఫీసు ఉంటుంది. వీకెండ్ ఉంటుంది.
రిటైర్మెంట్ ఉంటుంది.
కానీ అమ్మా నాన్నల ఉద్యోగానికి జీతం లేదు.
సెలవు లేదు. రిటైర్మెంట్ అసలే లేదు.
అయినా దాన్ని వదిలేయడానికి వీలు లేదు.
నేడు ‘నేషనల్ పేరెంట్స్ డే’.
అమ్మానాన్నలకు గిఫ్ట్‌లు, ఫోటోలు,
సోషల్ మీడియా పోస్ట్‌లు.... మంచిదే.
కానీ ఒక్క పది నిమిషాలు ఆపి, వాళ్ల ఉద్యోగపు ఫైల్ తిరగేద్దామా?
ప్రతి పేజీలో ఒక త్యాగం, ఒక నిద్రలేని రాత్రి, ఒక దాచిపెట్టిన కన్నీరు ఉంటుంది.
ఆ వేల పేజీల ఫైల్‌కి మనం ఇచ్చే రివార్డ్ ఏంటి?
ఒకే ఒక్క మాట...
‘థ్యాంక్యూ అమ్మా, థ్యాంక్యూ నాన్నా’ఈ రోజు ఆ మాట చెప్పే రోజు.
పిల్లలు చదువుకుంటారు. ఉద్యోగాల్లో చేరుతారు. పెళ్లిళ్లు చేసుకొని తమ పిల్లల పాలన, పోషణలో పడతారు. కాని తమ కోసం అప్పుడూ ఇప్పుడూ ఎడతెగని ఉద్యోగం చేస్తూనే ఉన్న అమ్మా నాన్నాల గురించి కొద్దిగా మరుపున పడతారు. బిజీలో కాస్త ఎడం జరుగుతారు. ప్రేమ ఉన్నా, ఎంతో గౌరవం ఉన్నా వీలు కాని స్థితిలో భుక్తి కోసం దూరం జరుగుతారు. అలాంటప్పుడు అమ్మా నాన్నలు ఏం చేసి మనల్ని ఇంత వరకూ తీసుకొచ్చారో గుర్తు చేసుకోవడానికి ఇలాంటి సందర్భాలు వీలు కల్పిస్తాయి.
అమ్మ ఆఫీస్: ఇల్లు అనే ఫ్యాక్టరీ
గుర్తుందా... మన ఇంట్లో అమ్మ ఉద్యోగం ఉదయం అయిదు గంటలకే మొదలవుతుంది. అలారం మోగక ముందే ఆమె కళ్లు తెరుచుకుంటాయి. ఆమె ఒకేసారి వంటమనిషి, టీచర్, డాక్టర్, కౌన్సెలర్, న్యాయమూర్తి, అకౌంటెంట్. చిన్నప్పుడు మనకు జ్వరం వస్తే రాత్రంతా తల దగ్గరే కూర్చునే ‘నైట్ డ్యూటీ’ అమ్మదే! పరీక్షల భయంలో ‘భయపడకు, నేనున్నా’ అని వెన్ను తట్టే మోటివేషనల్ స్పీకర్ అమ్మే.
మనం ఆఫీస్ నుండి అలసిపోయాక ‘కూర్చో, వేడిగా అన్నం పెడతా’ అనే స్టార్ హోటల్ షెఫ్ అమ్మే! ఇంత చేసినా నెలాఖరున ఆమె అకౌంట్‌లో ఒక్క రూపాయి కూడా జీతం పడదు. ‘అమ్మా, కూర సూపర్‌గా ఉంది’ అని మనం ఒక ముద్ద ఎక్కువ తింటే... అదే ఆమెకు వచ్చే అతిపెద్ద బోనస్! పండగకు కొత్త చీర కొనిపెడదామంటే, ‘నాకెందుకులే... ముందు నీకు కొత్త బూట్లు కొందాం’ అని వాయిదా వేసే త్యాగం ఆమెది. ఒంట్లో ఎంత బాగోలేకపోయినా ‘పిల్లలు ఆకలితో ఉంటారు’ అని కిచెన్ లోకి వెళ్లి ‘పంచ్’ కొట్టిన రోజులెన్నో!
58 ఏళ్లయినా, 70 ఏళ్లయినా ఆమెకు ‘అమ్మ’ ఉద్యోగం నుండి రిటైర్మెంట్ ఉండదు. ఈ రోజు ఆమె పక్కన కూర్చుని ‘అమ్మా, థ్యాంక్యూ! నువ్వు లేకుండా నేను లేను’ అని ఒక్క మాట చెబితే... అది ఆమెకు పదహారు పెండింగ్ డీఏల పెట్టు.
నాన్న పని: అన్ని డిపార్ట్‌మెంట్ల ఇన్ ఛార్జ్!
నాన్న చేసే ఉద్యోగం ఇంట్లో పైకి కనిపించదు. అది ఆయన మనసులో, జేబులో, కళ్ల వెనుక నిశ్శబ్దంగా సాగుతుంటుంది. ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందే ఆయన తలలో లెక్కలు ఆన్. ఈ నెల ఈఎంఐ, స్కూల్ ఫీజు, కరెంట్ బిల్లు, ఇంటి అద్దె... ఎప్పుడూ మన చదువులు, మన భవిష్యత్తు అనే ‘టెన్షన్ షిఫ్ట్’లోనే ఉంటాడు. తన చెప్పులు అరిగిపోయినా పట్టించుకోడు కానీ మనం అడిగిన బైకో, లాప్‌టాపో కొనివ్వడానికి లోన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. మనం పరీక్షలో ఫెయిలైనప్పుడు క్లాస్ టీచర్ కంటే ముందు బాధపడేది ఆయన గుండె.
అయినా బయటికి గాంభీర్యం నటిస్తూ ‘పర్వాలేదురా, నెక్స్›్టటైమ్ చూసుకుందాం’ అని కొండంత భరోసానిస్తాడు. మనం సక్సెస్ అయితే సమాజంలో అందరికంటే ముందు గర్వంగా చెప్పుకునేది ఆయనే! మన ముందు మాత్రం ‘ఇంకా పైకి రావాలి’ అని హెచ్చరిస్తాడు. ఆఫీసులో బాస్ తిట్టినా, ప్రమోషన్ మిస్ అయినా ఆ బాధను ఇంట్లోకి రానివ్వడు. మరి ఆయనకు మనం ఇచ్చే శాలరీ ఏంటి? మనకు మంచి జాబ్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన గొంతులో కనిపించే గర్వం. ‘నాన్నా, నువ్వు చేసిన కష్టం వృథాకాలేదు’ అనే ఒక్క మాటే ఆయనకు కావాల్సిన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.
రెండు షిఫ్ట్‌లు కలిసే చోటు: ‘మనం’
అమ్మా నాన్న ఇద్దరివీ వేరువేరు డిపార్ట్‌మెంట్‌లే కావచ్చు... కానీ ఇద్దరి గోల్ ఒక్కటే, ‘మన పిల్లలు బాగుండాలి’. అమ్మ మనకు అన్నం తినిపిస్తే, నాన్న ఆ అన్నం కొనడానికి కష్టపడతాడు. అమ్మ మన కన్నీళ్లు తుడిస్తే, నాన్న ఆ కన్నీళ్లకు కారణమైన సమస్యలను తుడిచేస్తాడు. వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా, పిల్లల భవిష్యత్తు విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ ‘టీమ్ అమ్మా నాన్న’గానే నిలబడతారు.
మనం పెద్దవాళ్లమయ్యాం. మనకు ఇప్పుడు జీతాలు, వీకెండ్స్, లీవ్ లెటర్లు అన్నీ వచ్చాయి. కానీ వాళ్లకు? ఇప్పటికీ అదే 24 బై 7 షిఫ్ట్. మనం ఫోన్ ఎత్తకపోతే టెన్షన్. సరిగా తినకపోతే టెన్షన్. ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా రిజైన్ చేయొచ్చు కానీ అమ్మానాన్నల ఉద్యోగానికి రిజిగ్నేషన్ లెటర్ ఉండదు. మనం పుట్టగానే మొదలయ్యే ఈ డ్యూటీ వారి చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. ఒకరకంగా వారి చివరి శ్వాసే వారి రిజిగ్నేషన్ లెటర్! ఆ తర్వాత కూడా ఆకాశం నుండి మన కోసం వేయి కళ్లతో ప్రార్థించే డ్యూటీని వాళ్లు మానరు.
అమ్మానాన్నలు పక్కన ఉన్నంత కాలం వారి విలువ తెలీదు. వృద్ధాశ్రమాల్లో కిటికీ పక్కన కూర్చుని గేటువైపు చూసే ఆ శూన్యమైన కళ్లను చూస్తే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. ఈ రోజు మన అమ్మానాన్నలను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చినా పర్లేదు. ఎందుకంటే ఆ కన్నీళ్లలోనే వారి జీవిత కాలపు అలసటంతా కరిగిపోతుంది.
ఈ రోజు... ఆ సెలవు లేని నిజమైన ఉద్యోగులకు మనసారా ఒక సెల్యూట్‌చేద్దాం!
అన్నీ ఇవ్వక్కర్లేదు.. అవసరమైన వి ఇస్తే చాలు..!
తీరిక లేకుండా కష్టపడుతున్నాం.. ఎన్నో త్యాగాలు చేసి బాధ్యతలను మోస్తున్నాం..మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఇంతకు మించి ఏం చేయాలి? అని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని తపన పడడంలో తప్పు లేదు..అయితే వారికి మంచి స్కూల్, గాడ్జెట్లు, ఆహారం ఇస్తే చాలు కదా అని అనుకోవడమే తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పిల్లల జీవితాన్ని మార్చేది డబ్బు కాదు.. వారితో తల్లిదండ్రులు గడిపే నాణ్యమైన సమయం మాత్రమేనని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, హార్వర్డ్ సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్ వంటి
సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
స్ఫూర్తి తేజాలు
‘మా నాన్నగారు ఎంతో నిరాడంబరమైన వ్యక్తి. మంచితనం ఆయన రూపంలో వెల్లివిరుస్తుంటుంది. నాన్న వ్యక్తిత్వంలోనే ఆయన తేజస్సు ప్రతిబింబిస్తుంది. ఆయన నాకు నాన్న మాత్రమే కాదు స్ఫూర్తినిచ్చే రోల్ మోడల్. నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నప్పుడు నాలోని డిప్రెషన్ లక్షణాలను మా అమ్మ గుర్తించి, ఆ సమస్య నుంచి బయటపడేలా చేసింది.
– దీపికా పదుకొణె
– కె
అన్నీ ఇవ్వక్కర్లేదు.. అవసరమైన వి ఇస్తే చాలు..!
తీరిక లేకుండా కష్టపడుతున్నాం.. ఎన్నో త్యాగాలు చేసి బాధ్యతలను మోస్తున్నాం..మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఇంతకు మించి ఏం చేయాలి? అని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని తపన పడడంలో తప్పు లేదు..అయితే వారికి మంచి స్కూల్, గాడ్జెట్లు, ఆహారం ఇస్తే చాలు కదా అని అనుకోవడమే తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పిల్లల జీవితాన్ని మార్చేది డబ్బు కాదు.. వారితో తల్లిదండ్రులు గడిపే నాణ్యమైన సమయం మాత్రమేనని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, హార్వర్డ్ సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్ వంటి సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
పిల్లలు... తల్లిదండ్రుల కలల రూపాలు
స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన ఒకప్పుడు జిల్లా స్థాయి క్రికెట్ ప్లేయర్. జాతీయస్థాయిలో రాణించాలనే ఆయన కల నెరవేరలేదు. అయితే తన పిల్లల్లో ఒకరు క్రికెట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని గట్టిగా నమ్మారు.
క్రికెట్ ఆడడంలో స్మృతిని ఆమె సోదరుడిని బాగా ప్రోత్సహించారు. తన కలను స్మృతి సాకారం చేయడంతో ఆయన గర్వపడే తండ్రి అయ్యారు. క్రికెటర్‌గా స్మృతి రాణించంలో తల్లి స్మిత పాత్ర ఎంతో ఉంది. ‘చదువు కావచ్చు, ఆటలు కావచ్చు... ఏ రంగం అయినా తల్లుల ప్రోత్సాహం, ఆశీర్వాదం ఉంటే పిల్లలు తప్పకుండా సాధించగలరు. అమ్మ ఆశీర్వాదం, ప్రోత్సాహం నా బలం’ అంటుంది స్మతి మంధాన.
ఎంతో కష్టపడ్డారు
‘నేర్చుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి’ అనే ధోరణిలో ఉండేవారు నా తల్లిదండ్రులు. వారు చెప్పింది నా మనసుపై గాఢమైన ప్రభావాన్ని చూపింది. ‘నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి’ అని తల్లిదండ్రుల నుంచి నేను విన్నది మా సంస్థ లక్ష్యాలలో ప్రధానమైనది. బాగా చదివించాలని, నన్ను ఉన్నతస్థానంలో
చూసుకోవాలని నా కోసం అమ్మానాన్న ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు.
– సుందర్ పిచాయ్
వెలకట్టలేని ప్రేమ
– పారా అథ్లెటర్ దీప్తి జీవాంజీ
అథ్లెట్ దీప్తి జీవాంజీది తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. పారా అథ్లెటిక్‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించింది. తల్లిదండ్రులు తమ కోసం పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగింది. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూ క్రీడలో శిక్షణ తీసుకుంటూ తనను తాను మలుచుకుంటోంది. తమ ఎదుగుదలలో తల్లిదండ్రులు ఎంత మద్దతుగా నిలుస్తున్నారో వివరించింది.
‘‘మా అమ్మానాన్నలకు నేను, చెల్లి సంతానం. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న యాదగిరి పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు కాలేజీకి వెళుతుంది. చిన్నప్పుడు స్కూల్లో స్పోర్ట్స్‌లో పాల్గొంటే చిన్న ప్రైజ్ వచ్చింది. మా అమ్మకు తీసుకొచ్చి చూపిస్తే నన్ను ముద్దుపెట్టుకొని తెగ సంతోషపడింది. నాన్న ‘కష్టపడితే ఏదీ వృథాగా పోదు’ అనేవాడు. నేను ఏదైనా అప్పటి నుంచి స్కూల్‌లో ఆటల మీద ఎక్కువ ఇష్టం చూపేదాన్ని. మా చుట్టుపక్కల వాళ్లు ఆడపిల్లలకు ఈ ఆటలు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, మా అమ్మా నాన్న మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. సాధించి నిలబడాలి’ అనేవారు.
వాళ్ల మాటల వల్లే స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని ఇన్నేళ్లలో చాలాసార్లు రుజువు అయ్యింది. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాను. నాకు ఆరోగ్యం బాగలేక, ఇంటి సమస్యలు అధికమయ్యి ఉన్న రెండెకరాల భూమిని అమ్మారు అమ్మనాన్న. ఎంతో బాధపడేవారు. కానీ, మాకంట పడనిచ్చేవారు కాదు. వాళ్లకంటూ సొంతంగా ఇష్టాలు, అభిరుచులు ఉంటాయనే ద్యాసే లేదు.
తమకంటూ మంచిబట్టలు కొనుక్కోవడానికి కూడా ఆసక్తి లేనట్టుగా చెబుతారు. అదే మా విషయంలో అయితే ‘మీకేం కావాలో తీసుకోండి’ అంటారు. అమ్మానాన్నల ప్రేమ అంతులేనిది. దానికి వెలకట్టలేం. మాకోసం భూమికి దూరమయ్యారని ఎప్పుడూ అనుకునేదాన్ని. క్రీడల ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్లు అమ్మిన భూమిని తిరిగి కొనుగోలు చేశాం. ఆ రోజు అమ్మానాన్నల ఆనందం మాటల్లో చెప్పలేను. కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఊళ్లోనూ గొప్పగా చెప్పుకున్నారు. మరింతగా కృషి చేసి, వారిని బాగా చూసుకోవాలన్నదే నా ఆలోచన’ అని తెలిపారు దీíప్తి.
– నిర్మలారెడ్డి
నా ప్రతిపాటలోనూ అమ్మానాన్నల త్యాగమే!
– గాయని శ్రీలలిత
కర్ణాటక సంగీత గాయనిగా చిన్ననాటి నుంచే పేరు తెచ్చుకుంది భమిడిపాటి శ్రీలలిత. విజయవాడ వాసి అయిన శ్రీలలిత ‘పిల్లల కోసం తల్లిదండ్రులు పడే కష్టాలు, వారు చేసే త్యాగాల రుణం ఏ రూపంలోనూ తీర్చుకోలేం’ అని తెలిపింది.
‘‘మా నాన్న బ్యాంకులో జాబ్ చేసేవారు. నేను గాయనిగా పేరు తెచ్చుకోవాలని మా నాన్న నా కోసం ఉద్యోగంలో వచ్చే ప్రమోషన్స్ వదులుకున్నారు. ప్రమోషన్స్ తీసుకుంటే ఎక్కువ గంటల ఉద్యోగంలోనే గడిచిపోతాయి, నాకు టైమ్ కేటాయించలేనని అనేవారు. కాస్త టైమ్ ఉన్నా, వెహికిల్ మీద తీసుకెళుతున్నా దారంతటా పాటలు పాడుతూ నా చేత పాడిస్తూ ప్రోత్సహించేవారు. అమ్మ నా ఎనిమిది నెలల వయసు నుంచే నన్ను వేదికల మీద చూడాలని తపన పడేది. నాన్న ఉద్యోగరీత్యా చెన్నైలో ఉంటే ఎవరూ తెలియని ఆ ప్రాంతంలో, రాని భాషతో ఇబ్బందులు పడినా నన్ను గాయనిగా నిలబెట్టాలని చూసేది.
మా పేరెంట్స్ నా కోసం చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. గాయనిగా ఎదగాలంటే సమయం సరిపోదని, స్కూల్‌కి పంపకుండా ఇంట్లోనే చదివిస్తూ ఎగ్జామ్స్ రాయించేవారు. షూటింగ్స్ సమయంలో అసలు టైమ్ ఉండేది కాది. అర్ధరాత్రి అని కూడా చూడకుండా, గంటలు గంటలు ఓపికగా నా గురించి అలాగే ఉండేవారు. నాకు ఒక మంచి దారి వేయడానికి మా అమ్మనాన్నలు ఎంత చేశారో ఒక్క మాటలో చెప్పలేను. నా ప్రతి అడుగులో వాళ్లే ఉన్నారు. వాళ్లలో ఒక్క శాతం అయినా రేపు నా పిల్లలకు చేస్తే అదే గొప్ప అనిపిస్తుంటుంది’’ అని వివరించారు శ్రీ లలిత.
మందలింపు కాదు.. మంచి మాట కావాలి
పిల్లల తప్పులను మాత్రమే ఎత్తి చూపడం వల్ల వారు క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే నిపుణులు సూచించే ‘5:1 రూల్’ ప్రకారం, ఒక్కసారి మందలిస్తే దాని తర్వాత కనీసం ఐదుసార్లు వారికి సానుకూలంగా స్పందిస్తూ వారిని ప్రోత్సహించాలి. హార్వర్డ్ పరిశోధనల్లో చెప్పిన ‘సర్వ్ అండ్ రిటర్న్’ రూల్ ప్రకారం పిల్లలు మాట్లాడినప్పుడు వెంటనే స్పందించడం, కళ్లలోకి చూసి మాట్లాడడం, నవ్వడం, అ΄్యాయంగా వినడం వంటి చిన్న పనులే వారి మానసిన పరివర్తనకి, మెదడు ఎదుగుదలకి ఎంతో కీలకమని వెల్లడైంది. పర్ఫెక్ట్ పేరెంట్ కావాలనే ఒత్తిడిలో చాలామంది తల్లిదండ్రులు జీవిస్తున్నారు. కానీ పిల్లలకు అవసరమైంది తప్పులు చేయని తల్లిదండ్రులు కాదు, అవసరమైనప్పుడు తమతో మాట్లాడే, వినే, అండగా నిలిచే తల్లిదండ్రులు మాత్రమే.
అమ్మానాన్నల్లా కాదు.. ఫ్రెండ్స్‌లా!
‘ఈ రోజుల్లో అమ్మానాన్నలతో ఒక తరం గ్యాప్ అన్నట్టుగా కాకుండా మంచి స్నేహపూర్వకమైన బంధంలా ఉండాలి. మిస్టేక్స్ చేసినా అంగీకరించాలి. అర్థం చేసుకోవాలి. ఇది మా ఇంటి వాతావరణం. మా అమ్మనాన్నలు మమ్మల్ని అలాగే పెంచారు’ అని తెలిపారు ప్రకృతి, సంస్కృతి. ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారి బి.సుమతి కూతుళ్లు. చదువుకుంటూనే సమాజంలో తమదైన ముద్రవేస్తున్న వీరు ఈ తరం ఆలోచనలను మన ముందుంచారు. 
‘‘స్టూడెంట్‌గా చదువులో రాణించడానికి, ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగడానికి, నా ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి మా నాన్న శ్రీనాథ్‌రాజు చాలా సపోర్ట్ చేస్తారు. క్రియేట్ ఎడ్యుటెక్ ద్వారా యూత్ వెల్‌నెస్, డిజిటల్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ పరిశ్రమలో గ్రామాల్లో ఉన్న స్వర్ణకారులకు చేయూతనిచ్చే ప్రోగ్రామ్స్ చేశాం. అమ్మ ఎంత బిజీగా ఉన్నా, మా చదువు, ప్రోగ్రామ్స్ గురించి గైడ్ చేస్తూనే ఉంటుంది.
– ప్రకృతి
‘‘అమ్మ మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తుంది. చాలా అద్భుతం అనిపిస్తుంది తనని చూస్తుంటే. తన నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అమ్మ మా ప్రపంచంలో గ్రేట్ కన్నా ఇంకా ఎక్కువే. ధైర్యంగా ఉండటం, ఎంత బిజీగా ఉన్నా అవతలి వ్యక్తులతో ఎలా ఉండాలి... ఇంకా చాలా విషయాలు తనని చూసే నేర్చుకుంటాం. అమ్మను చూసే మేమూ పబ్లిక్ సెక్టార్‌లో వర్క్ చేస్తున్నాం. నేను సైకాలజీ చేస్తున్నాను. పేరెంట్ అంటే స్ట్రిక్ట్‌గా ఉండాలని అనుకుంటారు. కానీ, మా పేరెంట్స్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వారి స్ఫూర్తితోనే మల్టిపుల్ గవర్నమెంట్ సెక్టార్స్‌లో గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్, డిజటల్ సేఫ్టీ.. మొదలైన విభాగాలలో వర్క్ చేయగలుగుతున్నాం.’’
– సంస్కృతి
నా గెలుపు తమదే అనేంతగా ఆనందిస్తారు
– చిత్రకారిణి ప్రియాంక ఏలె
కన్న కలలకు కాన్వాస్‌పై రూపం ఇస్తూ తండ్రి కుంచెను స్ఫూర్తిగా తీసుకొని ఎదిగిన చిత్రకారిణి ప్రియాంక ఏలె. ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె కుమార్తె. ‘మా నాన్నే గురువుగా కళను సాధన చేశాను’ అని వివరించింది ప్రియాంక. 
‘‘అమ్మాయిలను ఇలాగే పెంచాలి అని మా అమ్మానాన్నలు ఎప్పుడూ అనుకోలేదు. మేం ఇద్దరం ఆడపిల్లలమని ఎక్కడా ఆంక్షలు పెట్టలేదు. కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. దాని వల్ల భవిష్యత్తును మాకు నచ్చినట్టుగా మలుచుకోగలిగాం. ‘మనం ఎలా ఉంటే ఎదుటివారు అలాగే స్పందిస్తారు’ అంటుంటారు నాన్న. క్రియేటివ్ రంగంలో ఉన్నందువల్ల మా జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. రోజువారీ జీవనంలో చాలా ప్రాక్టికల్‌గా ఉంటాం అనుకుంటాం. కానీ, చాలాసార్లు ప్రకృతితో ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. దీంతో మాదైన ప్రపంచంలో ఎక్కువ సమయం గడుపుతుంటాం.
ఇలాంటప్పుడు జీవన విధానంలో మానవసంబంధాలు ఎంత ముఖ్యమైనవో అమ్మానాన్న ప్రతీసారి చెబుతుంటారు. చిన్నప్పటి నుంచి నాన్న పెయింటింగ్స్ చూసి, స్ఫూర్తిపొంది నేనూ ఆర్టిస్ట్‌ను అయ్యాను. దీంతో నాన్న ఆఫీస్ స్పేస్‌ను కూడా పంచుకుంటున్నాను. ఆ విధంగా అమ్మానాన్నలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం నాకు లభించింది. మా ఆలోచనలు ఎప్పుడూ ఒక మంచి చర్చతో ఉదయాన్నే ప్రారంభమవుతాయి. తిరిగి పడుకునే ముందు ముగుస్తాయి. ఇప్పటికీ అమ్మానాన్నలను విడవకుండా ఉండేంతగా ఆర్ట్ మా మధ్యన ఉండిపోయింది. ఇదంతా నాన్న చూపిన ప్రేమ. నేను ఏదైనా సాధిస్తే మొదట ఆనందించేది మా అమ్మనాన్నలే. నా చిత్ర ప్రదర్శన ఉందంటే నాకన్నా ముందు నాన్ననే ఆ గ్యాలరీలో ఉంటారు.
అమ్మ లలిత ప్రతి చిన్న పనిలో ఇప్పటికీ నాకు సహకరిస్తుంటారు. ఇంట్లో ఇద్దరు ఆర్టిస్టులను అమ్మ భరిస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదని చెబుతుంటాను. మా అవసరాలన్నీ తనే చూసుకుంటుంది. ఎంతో ఓపికగా తమ జీవితంలో పిల్లలకే అగ్రభాగాన్ని ఇచ్చే దేవుళ్లు అమ్మానాన్నలు. మనమేమీ అమ్మనాన్నల కోసం పెద్ద పెద్ద త్యాగాలు చేయనక్కర్లేదు. ఏదైనా కొత్త వర్క్ చేసినప్పుడు ఇలాంటిది అమ్మానాన్నలకు నచ్చదు అని వదిలేయకుండా, మన అభి ప్రాయాన్ని కూడా వాళ్లు అర్థం చేసుకునేలా చెప్పగలగాలి. మనల్ని మొదట అర్థం చేసుకునే అత్యంత ప్రాణస్నేహితులూ అమ్మానాన్నలే’ అంటూ వివరించారు ఈ చిత్రకారిణి.


