అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఒక మైక్రోడ్రోన్. ఇది గాల్లోని దోమలను గాల్లోనే మటాష్ చేసి పారేస్తుంది. దోమల బెడద నివారించడానికి ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన సాధనాలన్నీ ఒక తీరు అయితే, ఈ మైక్రోడ్రోన్ మరో తీరు. ఇది గాల్లో శరవేగంగా ఎగురుతూ కనిపించిన దోమనల్లా క్షణాల్లోనే వేటాడి మట్టుబెట్టేస్తుంది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఈ మైక్రోడ్రోన్ కదలికలను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా నియంత్రించే వెసులుబాటు ఉంది.
దోమల నివారణ కోసం రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ ఏఐ మైక్రో డ్రోన్‌ను ‘టోర్న్‌యాల్’ అనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ రూపొందించింది. ఈ డ్రోన్ల తయారీకి స్టార్టప్‌లను ప్రోత్సహించే ‘వై కాంబినేటర్’ ఆర్థిక సాయం అందిస్తోంది. కేవలం నలభై గ్రాముల బరువు ఉండే ఈ డ్రోన్ పనితీరుపై ‘టోర్న్‌యాల్’ ఇటీవల విడుదల చేసిన వీడియో జనాలను విశేషంగా ఆకట్టుకుంది.


