డ్రోన్‌ ఆధారిత భూ సర్వేలు వేగిరం | Drone surveys completed in 3. 30 lakh villages across the country | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ ఆధారిత భూ సర్వేలు వేగిరం

Jul 25 2026 5:57 AM | Updated on Jul 25 2026 5:58 AM

Drone surveys completed in 3. 30 lakh villages across the country

దేశవ్యాప్తంగా 3.30 లక్షల గ్రామాల్లో డ్రోన్‌ సర్వేలు పూర్తి

3.24 కోట్లకు పైగా ఆస్తి పత్రాలు పంపిణీ  

తెలంగాణలో ఐదు పైలట్‌ గ్రామాల్లో పూర్తి  

మ్యాపులు, పాత కాగితపు రికార్డులు పూర్తిగా లేని గ్రామాల గుర్తింపు

వ్యవసాయ భూములతో పాటు హైదరాబాద్‌లోనూ సాంకేతికత వినియోగం

జీహేచ్‌ఎంసీలో ఇళ్లు, ఖాళీ స్థలాల మ్యాపింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: డ్రోన్‌ ఆధారిత భూ సర్వేలు, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్‌ భూ పరిపాలనను పూర్తిగా మారుస్తున్నాయి. ఈ సాంకేతికత పాత కాగితపు రికార్డుల స్థానంలో అత్యంత ఖచ్చితమైన డిజిటల్‌ రికార్డులను అందుబాటులోకి తెస్తోంది. కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో స్వమిత్వ (సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజీ ఏరియాస్‌) పథకం అమలవుతోంది. గ్రామీణ నివాస ప్రాంతాల (ఆబాదీ భూములు) రికార్డులను ఖచ్చితంగా నమోదు చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

సర్వే ఆఫ్‌ ఇండియా డ్రోన్ల ద్వారా కేవలం 5 సెంటీమీటర్ల గ్రౌండ్‌ శాంపిల్‌ డిస్టెన్స్‌ (జీఎస్‌డీ) ఖచ్చితత్వంతో చిత్రాలను సేకరిస్తోంది. కంటిన్యూస్లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌ (సీవోఆర్‌ఎస్‌) నెట్‌వర్క్‌ సహాయంతో ఈ రికార్డులకు సెంటీమీటర్‌ స్థాయి ఖచ్చితత్వాన్ని ఇస్తారు. దేశవ్యాప్తంగా 3.30 లక్షలకు పైగా గ్రామాల్లో డ్రోన్‌ సర్వేలు పూర్తయ్యాయి. 3.24 కోట్లకు పైగా డిజిటల్‌ ప్రాపర్టీ కార్డులను (ఆస్తి పత్రాలు) పంపిణీ చేశారు. ఈ డిజిటల్‌ కార్డుల ద్వారా గ్రామీణ ప్రజలకు బ్యాంకు రుణాలు సులభంగా లభిస్తున్నాయి. అలాగే గ్రామ పంచాయతీల పన్నుల వసూళ్లు కూడా పెరిగాయి. 

తెలంగాణలో ప్రత్యేక చర్యలు 
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూనే, రాష్ట్ర పరిధిలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భూ భారతి, కొత్త సర్వే ప్రాజెక్ట్‌లు...తెలంగాణలో పాత ’ధరణి’ పోర్టల్‌ లోపాలను సరిచేస్తూ, తప్పుల్లేని భూ రికార్డుల కోసం డ్రోన్‌ సర్వేలను విస్తృతం చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి దశలో ఐదు పైలట్‌ గ్రామాల్లో సాలార్‌ నగర్‌ (మహబూబ్‌నగర్‌), కొమ్మనపల్లి (జగిత్యాల, ములుగుమాడ (ఖమ్మం), నూగూరు (ములుగు), షాహిద్‌ నగర్‌ (సంగారెడ్డి)లలో డ్రోన్‌ సర్వే, గ్రౌండ్‌ వెరిఫికేషన్లు విజయవంతంగా నిర్వహించారు. రికార్డులు లేని గ్రామాలు...మ్యాపులు, పాత కాగితపు రికార్డులు పూర్తిగా లేని 413 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి, అక్కడ డ్రోన్ల ద్వారా కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు.

ల్యాండ్‌ పార్సెల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)... డ్రోన్‌ సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూభాగానికి 16 అంకెల విశిష్ట ఎల్‌పీఎం ఐడీ కేటాయిస్తారు. భవిష్యత్తులో భూముల రిజి్రస్టేషన్లకు ఈ డిజిటల్‌ స్కెచ్‌ తప్పనిసరి అవుతుంది. పట్టణ ప్రాంతాల డిజిటలైజేషన్‌ (జీహేచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు) వ్యవసాయ భూములతో పాటు హైదరాబాద్‌ (జీహేచ్‌ఎంసీ) వంటి పట్టణ ప్రాంతాల్లో కూడా డ్రోన్‌ సాంకేతికతను వాడుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహేచ్‌ఎంసీ) శాటిలైట్, డ్రోన్‌ చిత్రాల ద్వారా నగరంలోని ఇళ్లను, ఖాళీ స్థలాలను మ్యాపింగ్‌ చేస్తోంది. డ్రోన్‌ డేటా ఆధారంగా ప్రతి ఇంటికి ఒక ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ (డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌) కేటాయిస్తున్నారు. దీనివల్ల అనుమతులు లేని అదనపు నిర్మాణాలను గుర్తించడం, ఆస్తి పన్ను పరిధిలోకి రాని ఆస్తులను గుర్తించడం సులువవుతుంది. 

డిజిటలైజేషన్‌ పనితీరు ... 
మార్కింగ్‌... డ్రోన్‌ ఎగరడానికి ముందు భూమిపై సున్నంతో సరిహద్దులను స్పష్టంగా గుర్తిస్తారు. 
⇒ డేటా ప్రాసెసింగ్‌... డ్రోన్‌ తీసిన చిత్రాలను సాఫ్ట్‌వేర్‌ సహాయంతో 2డీ ఆర్తోమొజాయిక్‌ మ్యాపులుగా మారుస్తారు. 
⇒ గ్రౌండ్‌ ట్రూతింగ్‌ (క్షేత్రస్థాయి పరిశీలన)... రెవెన్యూ అధికారులు ఈ మ్యాపులను నేరుగా గ్రామానికి తీసుకెళ్లి, రైతుల సమక్షంలో సరిహద్దులను సరిచూస్తారు. తద్వారా వివాదాలను అక్కడికక్కడే పరిష్కరిస్తారు. 
⇒ రికార్డుల అనుసంధానం: అంతా ఖరారైన తర్వాత డిజిటల్‌ ప్రాపర్టీ కార్డును జారీ చేస్తారు. ఇవి నేరుగా డీజీలాకర్‌ యాప్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement