గిరిజనులకు వైద్యం చేరువయ్యేనా..? | Medical services failing to reach the tribal population: Telangana | Sakshi
Sakshi News home page

గిరిజనులకు వైద్యం చేరువయ్యేనా..?

Jul 25 2026 5:51 AM | Updated on Jul 25 2026 5:51 AM

Medical services failing to reach the tribal population: Telangana

ప్రత్యేక ఆరోగ్య విధానానికి సర్కారు కసరత్తు

9.07 శాతం గిరిజన జనాభాకు క్షేత్రస్థాయిలో అందని వైద్య సేవలు 

ఏజెన్సీ ప్రాంతాల్లో 55 శాతం వైద్యుల పోస్టులు ఖాళీ 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, టెలీమెడిసిన్‌తో సమస్యలకు చెక్‌ పడుతుందా?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో ఎంత వరకు సఫలీకృతమవుతుందనే చర్చ సాగుతోంది. గిరిజనులకు ఎండమావిగా మారిన నాణ్యమైన వైద్యసేవలను ప్రత్యేక ఆరోగ్య విధానం ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని ఆశపడుతున్నారు. రాష్ట్ర జనాభాలో 9.07 శాతం మంది గిరిజనులు ఉన్నప్పటికీ, మారుమూల తండాలు, ఏజెన్సీ గ్రామాల్లో ఇప్పటికీ వైద్యులు, నిపుణుల కొరత, అత్యవసర వైద్య సేవల లోపం, సకాలంలో చికిత్స అందకపోవడం వంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

రాష్ట్రంలో భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూర్, మన్ననూర్‌ ఐటీడీఏల పరిధిలో వేలాది గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. కొండలు, అడవులు, రవాణా సౌకర్యాల లేమి కారణంగా ప్రాథమిక వైద్య సేవలే చాలామందికి అందని ద్రాక్షగా మారుతున్నాయి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ఆస్పత్రులకు చేరుకోవడానికి గంటల సమయం పడుతున్న సందర్భాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక ఆరోగ్య విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. 

ఆస్పత్రులున్నా.. వైద్యులు ఎక్కడ..? 
ప్రభుత్వ లెక్కల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 599 ఉప ఆరోగ్య కేంద్రాలు, 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 10 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), 6 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. అదనంగా 12 బర్త్‌ వెయిటింగ్‌ హోమ్స్, 2,987 కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు పనిచేస్తున్నారు. అయితే భవనాలు ఉన్నంత మాత్రాన సేవలు అందడం లేదనేది వాస్తవం.

అనేక కేంద్రాల్లో వైద్యులు లేకపోవడం, నిపుణుల కొరత, అవసరమైన పరీక్షల సౌకర్యాలు లేకపోవడం వల్ల చిన్నచిన్న అనారోగ్యాలకే జిల్లా కేంద్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవల జరిగిన వైద్యులు, నర్సుల బదిలీల్లో గిరిజన ప్రాంతాల్లో పోస్టింగ్‌ వచి్చన వారు చేరేందుకు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. యూనియన్‌ల నాయకులుగా చలామణి అవుతున్న డాక్టర్లలో ఒకరిద్దరికి ఆసిఫాబాద్, కొత్తగూడెం వంటి ప్రాంతాలకు బదిలీ అయినా , చేరకుండా గుర్తింపు సంఘం ట్రంప్‌కార్డును ఉపయోగించుకొని హైదరాబాద్‌లో కొనసాగుతున్నారు. మరికొందరు ఎలాగైనా గిరిజన ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.  

55 శాతం పోస్టులు ఖాళీ..  సేవలు ఎలా? 
ప్రభుత్వ వైద్య వ్యవస్థలో సిబ్బంది కొరత గిరిజన ప్రాంతాల్లో మరింత తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్ర తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు సంబంధించి 4,347 వైద్యుల పోస్టులకు గాను కేవలం 1,968 మంది మాత్రమే పనిచేస్తుండగా, 2,379 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 55 శాతం పోస్టులు భర్తీ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థలో 14,633 పోస్టులకు గాను 5,625 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక ఆరోగ్య విధానం అమలైనా, అవసరమైన మానవ వనరులు లేకపోతే ఆశించిన ఫలితాలు వస్తాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

సికిల్‌ సెల్, మలేరియా..  ఇంకా సవాలే! 
గిరిజన ప్రాంతాల్లో సికిల్‌ సెల్‌ అనీమియా, మలేరియా, రక్తహీనత, పోషకాహార లోపం, మాతాశిశు ఆరోగ్య సమస్యలు ఇప్పటికీ ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు చెబుతున్నప్పటికీ, జిల్లాల వారీగా సికిల్‌ సెల్‌ అనీమియా కేసుల అధికారిక గణాంకాలను ఇప్పటికీ బహిర్గతం చేయకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. సమస్య తీవ్రత ఎంతుందో స్పష్టమైన సమాచారం లేకుండా సమర్థవంతమైన ప్రణాళికలు ఎలా అమలవుతాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మారుమూల గ్రామాల్లో నిపుణుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం టెలీమెడిసిన్‌ సేవలను విస్తరించాలని భావిస్తోంది. గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను జిల్లా, హైదరాబాద్‌ ఆస్పత్రులతో అనుసంధానం చేసి నిపుణుల సలహాలు అందించే విధానానికి రూపకల్పన చేస్తోంది. అత్యవసర రిఫరల్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, వైద్యుల కొరత ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, త్వరలో చేపట్టనున్న 866 మంది వైద్యుల నియామకాలలో కొంతమందిని ఏజెన్సీ ప్రాంతాలకు కేటాయించడం వంటి చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement