మా రెండేళ్ల బాబుకు నిన్నటి నుంచి విరేచనాలు అవుతున్నాయి. ఇంట్లో పెద్దలు తిండి ఆపేయాలని నీళ్లు తక్కువగా ఇవ్వాలని చెప్తున్నారు. మెడికల్ షాప్‌లో ఓఆర్‌ఎస్ పొడి, జింక్ మాత్రలు తీసుకోమన్నారు. నిజంగా ఇవి ఎంత అవసరం. ఓఆర్‌ఎస్ ఇస్తే విరేచనాలు వెంటనే తగ్గిపోతాయా?
– కావ్య, చిత్తూరు.
ఈ సందేహం మీ ఒక్కరిదే కాదు. దాదాపు ప్రతి పేరెంట్ మనసులో ఇదే ప్రశ్న ఉంటుంది. కానీ ముందుగా ఒక నిజం తెలుసుకోవాలి. ఇక్కడ పిల్లలకు వచ్చిన అసలైన ప్రమాదం విరేచనాలు కావు. శరీరంలో నీరు, లవణాలు వేగంగా తగ్గిపోవడమే (డీహైడ్రేషన్) పెద్ద ముప్పు. సమయానికి జాగ్రత్త తీసుకోకపోతే అది ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంటుంది.
అలాంటి ప్రమాదం నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను కాపాడిన అద్భుతమైన మార్గమే ఓఆర్‌ఎస్. అందుకే ప్రతి ఏడాది జూలై ఇరవై తొమ్మిదిని ప్రపంచ ఓఆర్‌ఎస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సందేశం ‘ఓఆర్‌ఎస్: చిన్న పరిష్కారం– ఆరోగ్యమైన భవిష్యత్తు’ ఇక ప్రజారోగ్య నినాదం అయితే, ‘తెలివిగా తాగండి, బలంగా ఉండండి. ఓఆర్‌ఎస్‌ను ఎంచుకోండి’. అందుకే, ముందుగా ప్రతి తల్లిదండ్రులు ఓఆర్‌ఎస్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చెప్తాను.
ఓఆర్‌ఎస్ అంటే ఏమిటి?
ఓఆర్‌ఎస్ అనేది చక్కెర, ఉప్పు, ఇతర శరీరానికి అవసరమైన లవణాల సరైన మిశ్రమం. చాలామంది అనుకునేలా ఇది విరేచనాలను ఆపే మందు కాదు. ఇది విరేచనాల వల్ల శరీరం కోల్పోయిన నీరు, సోడియం, పొటాషియం వంటి లవణాలను తిరిగి భర్తీ చేసి పిల్లలను డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. అందుకే, చాలామంది డాక్టర్లు విరేచనాలు మొదలైన వెంటనే ఓఆర్‌ఎస్ ఇవ్వడం ప్రారంభిస్తే చాలా సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తగ్గుతుందని సూచిస్తారు.
జింక్ ఎందుకు అవసరం?
విరేచనాల సమయంలో పిల్లల శరీరంలో జింక్ స్థాయి తగ్గిపోతుంది. జింక్ ఇవ్వడం వలన పిల్లలు త్వరగా కోలుకుంటారు. అలాగే, విరేచనాలు ఉండే రోజులు తగ్గుతాయి. మళ్లీ విరేచనాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. పేగులు త్వరగా బలపడతాయి. శరీర రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.
ఎన్ని రోజులు ఇవ్వాలి?
ఆరు నెలల లోపు పిల్లలకు రోజుకు పది మిల్లీగ్రాముల జింక్ పద్నాలుగు రోజుల పాటు, ఆరు నెలలు దాటిన పిల్లలకు రోజుకు ఇరవై మిల్లీగ్రాముల జింక్ పద్నాలుగు రోజుల పాటు చాలు. లేదంటే, వైద్యుడి సూచించిన మోతాదులో మాత్రమే ఇవ్వాలి.
ఎలా ఇవ్వాలి?
బిడ్డ ఒకేసారి ఎక్కువగా తాగలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఒకటి లేదా రెండు చెంచాల చొప్పున ఇవ్వండి. ఒకటి లేదా రెండు నిమిషాలకు ఒకసారి నెమ్మదిగా తాగించండి. వాంతి చేసినా ఐదు నుంచి పది నిమిషాలు ఆగి మళ్లీ ప్రారంభించండి. ఈ చిన్న చిన్న గుక్కిళ్లు పిల్లలకు పెద్ద రక్షణ.
ఓఆర్‌ఎస్ ఎలా తయారు చేయాలి?
ఒక ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌ను ఒక లీటరు శుభ్రమైన నీటిలో మాత్రమే పూర్తిగా కలపాలి. ముఖ్యంగా పాలు, పండ్లరసం లేదా సోడా పానీయాల్లో అసలు కలపకూడదు. తయారు చేసిన ద్రావణాన్ని ఇరవై నాలుగు గంటల్లోపు ఉపయోగించాలి. మిగిలిన ద్రావణాన్ని మళ్లీ వాడకుండా పారేయాలి.
విరేచనాలు ఉన్నప్పుడు పిల్లలకు తిండి పెట్టాలా?
తప్పకుండా పెట్టాలి. చాలామంది చేసే పెద్ద పొరపాటు తిండి పూర్తిగా ఆపేయడం. అలా చేయకండి. తల్లిపాలు, పెరుగన్నం, గంజి, అరటిపండు, ఇడ్లీ, ఖిచిడీ, సాధారణ ఇంటి ఆహారం ఇలా ఇవన్నీ పిల్లలకు ఇవ్వవచ్చు.
వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు పిల్లలు నీళ్లు తాగలేకపోతే, పదేపదే వాంతులు అవుతుంటే, కళ్లు లోపలికి వెళ్లినట్లు కనిపిస్తే, నోరు పూర్తిగా పొడిగా ఉంటే, మూత్రం చాలా తగ్గిపోతే, చాలా నీరసంగా లేదా మత్తుగా ఉంటే, మలంలో రక్తం కనిపిస్తే, ఆరు నెలల లోపు శిశువుకు తరచు విరేచనాలు వస్తే, అధిక జ్వరం. ఈ లక్షణాల్లో ఒక్కటి కనిపించినా ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించండి.
చివరగా ఒక చిన్న ఓఆర్‌ఎస్ ప్యాకెట్, ఒక చిన్న జింక్ మాత్ర, ఒక తల్లి సరైన నిర్ణయం... ఈ మూడు కలిసి ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడగలవు. అందుకే, ఈ జూలై ఇరవై తొమ్మిది ప్రపంచ ఓఆర్‌ఎస్ దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం ఓఆర్‌ఎస్ గురించి తెలుసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉంచుకోవాలి. అవసరం వచ్చిన వెంటనే ఉపయోగించాలి. ఎందుకంటే ఓఆర్‌ఎస్ సాధారణ ద్రావణం కాదు. లక్షలాది చిన్నారుల ప్రాణాలను కాపాడిన నమ్మకమైన జీవరక్షక మిత్రుడు.
డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్
పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్
(చదవండి: స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా..)


