బాస్‌కే బాస్‌ ఎవరు? | Tiger Day 2026 Special: Even the Mighty Tiger Fears These Animals | Sakshi
Sakshi News home page

బాస్‌కే బాస్‌ ఎవరు?

Jul 29 2026 9:18 AM | Updated on Jul 29 2026 9:25 AM

Tiger Day 2026 Special: Even the Mighty Tiger Fears These Animals

అడవిలో పులి అడుగుపెడితేనే చాలా జంతువులు అప్రమత్తమవుతాయి. నిశ్శబ్దంగా కదులుతూ.. క్షణాల్లో వేటను ముగించే సామర్థ్యం దాని సొంతం. బలమైన పంజా, పదునైన గోర్లు, శక్తివంతమైన దవడలతో పులి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ అడవిలో అసలు నిజం వేరే ఉంది.. ఎంతటి శక్తివంతమైన జీవికైనా ప్రకృతిలో ఒక సవాల్‌ తప్పదు. అడవికి బాస్‌గా పేరున్న పులి కూడా కొన్ని జంతువుల ముందు ఆచితూచి అడుగు వేయాల్సిందే.

భారీ శరీరం, అపారమైన బలం, సమూహంగా కదిలే శక్తి, ఊహించని దూకుడు.. ఇలా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న జీవులు పులికి కూడా ఎదురుదెబ్బ ఇవ్వగలవు. అవసరం లేని పోరాటాలకు పులి కూడా దూరంగా ఉంటుంది.. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం ప్రాణాలకే ముప్పు కావచ్చు. తన వేట నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ‘పెద్ద పిల్లి’కి సైతం కొన్ని జంతువులు గట్టి సవాల్‌గా నిలుస్తాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవం(International Tiger Day, Global Tiger Day) సందర్భంగా.. పులిని కూడా వెనక్కి తగ్గించే ఆ జంతువులు ఏవో తెలుసుకుందాం.

అడవిలో అత్యంత శక్తివంతమైన జీవుల్లో ఏనుగు ఒకటి. భారీ శరీరం, అపారమైన బలం, తెలివి కారణంగా ఏనుగులు చాలా జంతువులకు సవాల్‌ విసురుతాయి. సాధారణంగా పులులు పెద్ద ఏనుగులపై దాడి చేయవు. ముఖ్యంగా ఏనుగుల మందలోకి వెళ్లడం పులికి ప్రమాదకరం. చిన్న ఏనుగు పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరిగినా.. తల్లి ఏనుగు, మొత్తం మంద కలిసి పులిని తరిమికొట్టగలవు. ఒక్కసారి ఏనుగు దాడి చేస్తే.. పులికి తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఏనుగుల సమూహాన్ని చూసినప్పుడు పులి కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటుంది.

పులికి అసలైన పరీక్ష ఇదే..
పులికి ఇష్టమైన ఆహారాల్లో అడవి దున్న (గౌర్‌) ఒకటి. అయితే దాన్ని వేటాడటం అంత సులభమైన విషయం కాదు. భారీ శరీరం, బలమైన కాళ్లు, పదునైన కొమ్ములు అడవి దున్నకు ప్రధాన ఆయుధాలు. ఒక పెద్ద అడవి దున్న ఎదురుదాడికి దిగితే పులికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పులులు సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద అడవి దున్నలపై కాకుండా.. బలహీనంగా ఉన్నవి, ఒంటరిగా ఉన్నవాటిపై దృష్టి పెడతాయి.

మొసలితో మామూలుగా ఉండదు
భూమిపై పులి ఎంత శక్తివంతమైనదైనా.. నీటిలో పరిస్థితులు మారిపోతాయి. పెద్ద మొసళ్లు తమ పరిధిలో అత్యంత ప్రమాదకరమైనవి. నదులు, చెరువుల్లోకి దిగినప్పుడు పులి కూడా మొసలి దాడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిలో మొసలి బలం, దాని ఆకస్మిక దాడి పులికి ముప్పుగా మారుతుంది. అయితే పులులు కూడా మంచి ఈతగాళ్లే. అవసరమైతే నదులను దాటి వేట కొనసాగించగల సామర్థ్యం వాటికి ఉంటుంది.

ఊహించని ప్రత్యర్థి
కొన్ని అడవి ప్రాంతాల్లో పులులు, ఎలుగుబంట్లు ఒకే ఆవాసాన్ని పంచుకుంటాయి. ముఖ్యంగా స్లోత్‌ బేర్‌ (ఎలుగుబంటి) చాలా దూకుడుగా స్పందించే జంతువు. ఆహారం లేదంటే ప్రాంతం విషయంలో ఎదురుపడినప్పుడు ఎలుగుబంటి వెనక్కి తగ్గకపోవచ్చు. దాని బలమైన గోర్లు, దూకుడు స్వభావం కారణంగా పులి కూడా ఇలాంటి ఘర్షణలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

మరి సింహం పులిని ఓడించగలదా?
పులి, సింహం మధ్య ఎవరు బలమైనవారు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. శారీరక బలం, ఒంటరి వేట విషయంలో పులికి కొంత ఆధిక్యత ఉంటుందని చెబుతారు. అయితే సింహం బలం వేరే. అది గుంపుగా జీవిస్తుంది. ఒక సింహం కంటే.. మొత్తం గుంపుగా ఉన్న సింహాలు చాలా ప్రమాదకరం. పులి, సింహం ఎదురుపడితే ఎవరు గెలుస్తారనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు. వాటి పరిమాణం, వయసు, ఆరోగ్యం, పరిస్థితులపై ఫలితం ఆధారపడి ఉంటుంది.

పులి అసలు బలం ఏంటి?
పులి గొప్పతనం కేవలం దాని బలంలో లేదు.. దాని వ్యూహంలో ఉంది. ఒంటరిగా జీవించే ఈ జంతువు సహనం, తెలివి, సమయస్ఫూర్తితో వేటాడుతుంది. తనకంటే పెద్ద జంతువులను కూడా సరైన సమయం చూసి ఎదుర్కోగలదు. కానీ అవసరం లేని పోరాటాలకు వెళ్లదు. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం దాని ప్రాణాలకు ముప్పే.  అడవిలో శాశ్వతంగా బాస్‌ ఎవరూ ఉండరు. ప్రతి జీవికి ఒక బలం ఉంటుంది.. అదే సమయంలో ఒక సవాలు కూడా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement