‘అమ్మో పులి’ అనుకునే రోజులు కావు. ‘పులి కనిపిస్తే వేటాడాలి’ అనుకునే రోజులు. కళ్ల నుండి పళ్ల వరకు పులి శరీరాన్ని డబ్బులు చేసుకోవాలనుకునే రోజులు. ‘ఆహా! పులి’ అనుకునే రోజులు. అయితే అందరూ అలా లేరు. ‘అయ్యో! పులి’ అని బాధ పడేవారు ఎంతోమందిఉన్నారు. అలాంటి వారిలో ఒకరు... హృషిత నేగి.పులుల సంరక్షణ కోసం నడుం బిగించిన హృషిత నేగి ‘టైగర్ ఉమన్’గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. గ్రౌండ్ బ్రేకింగ్ ఏఐ కెమెరా సిస్టమ్స్ ‘ట్రైల్‌గార్డ్ ఏఐ’తో పులుల రక్షణ కోసం పనిచేస్తోంది...
పులితో పోల్చితే మిగతా జంతువులతో హృషిత నేగికి చాలా తక్కువ పరిచయం. మధ్య భారతదేశంలోని విశాలమైన గడ్డి మైదానాలు, అడవులతో కూడిన కన్హా రిజర్వ్‌లో పులుల మధ్య పెరిగింది. అడవి పులిని నాలుగు సంవత్సరాల వయసులో మొదటిసారి చూసింది. తండ్రి హిమ్మత్ నేగి కన్హా రిజర్వ్‌కు డైరెక్టర్‌గా ఉండేవారు. జీపులో పార్క్‌ను పరిశీలించడానికి హిమ్మత్ వెళ్లేటప్పుడు ఆయనతోపాటు హృషిత కూడా వెళ్లేది. పులులు ఎదురు పడడం అక్కడ సాధారణ విషయమే అయినప్పటికీ, పులిని ఎన్నిసార్లు చూసినా ఎప్పుడూ అద్భుతంగా ఉండేది. ‘అడవి పులిని చూడడం మరచిపోలేని అనుభవం. ఒక పులి మీ కళ్ల ముందు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు మీ మనసులో ఉన్నదంతా మరచిపోతారు. ఒకరకమైన తన్మయస్థితికి వెళతారు’ అంటుంది హృషిత.
మిషన్ మొదలైంది....
న్యూ ఢిల్లీ యూనివర్శిటీలో జీవశాస్త్రంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చేసింది హృషిత. పులుల సంరక్షణపై పనిచేసే ‘గ్లోబల్ టైగర్ ఫోరమ్’కు హాజరైన హర్షిత అమెరికన్ టైగర్స్ యునైటెడ్ యూనివర్శిటీ కన్సార్టియం గురించి తెలుసుకుంది. పులుల సంరక్షణ కోసం పనిచేయాలనుకునే విద్యార్థులకు ఈ యూనివర్శిటీ సహకరిస్తుంది. స్కాలర్ షిప్‌లు అందజేస్తుంది. క్లెమ్సన్‌లోని టైగర్స్ యునైటెడ్ మిషన్‌లో చేరడం హృషిత జీవితంలో ఒక కీలకమైన మార్పు. విద్య, శిక్షణ, పరిశోధన, సాంకేతికత ద్వారా మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అడవి పులులను రక్షించడం ఈ మిషన్ లక్ష్యం.
ట్రైల్‌గార్డ్ ఏఐ
తనతోపాటు పీహెచ్‌డి చేసిన, పోస్ట్–డాక్టోరల్ రిసెర్చర్ జెరిమీ డెర్టియన్‌తో కలిసి పులుల జాడను గుర్తించే సరికొత్త సాంకేతిక ఆవిష్కరణ చేసింది హృషిత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే కెమెరా ట్రాప్ సిస్టమ్‌ను వీరు రూపొందించారు. దీనికి ‘ట్రైల్‌గార్డ్ ఏఐ’ అని పేరు పెట్టారు. హృషిత, జెరిమీ కలిసి గ్లోబల్ టైగర్ ఫోరమ్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ రిసాల్వ్‌ల మధ్య భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చారు. భారతదేశంలోని రెండు ప్రముఖ పులి సంరక్షణ కేంద్రాలైన కన్హా, పెంచ్‌ల మధ్య ఉన్న కారిడార్‌లో పులులను తక్షణమే గుర్తించి, వాటి చిత్రాలను వేగంగా పంపేందుకు ఏఐ సామర్థ్యం ఉన్న ట్రెయిల్ కెమెరా సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు.
సెకన్‌ల లోపే...
‘ట్రైల్‌గార్డ్ ఏఐ’ అనేది పులుల సంరక్షణకు సంబంధించిన మొదటి ఏఐ టైగర్ కెమెరా ట్రాప్. మిగతా కెమెరా ట్రాప్‌ల మాదిరిగానే ‘ట్రైల్‌గార్డ్ ఏఐ’ పులి కదలికలను పసికట్టి ఫొటో తీస్తుంది. అయితే, వేలకొద్దీ ఫొటోలను స్టోర్ చేయడానికి బదులుగా కేవలం పులుల చిత్రాలను మాత్రమే గుర్తించి స్టోర్ చేస్తుంది. ‘ట్రైల్‌గార్డ్ ఏఐ’ కెమెరా సిస్టమ్‌లో ఒక కమ్యూనికేషన్ బాక్స్ ఉంటుంది. అది సమీపంలోని సెల్ టవర్‌కు అనుసంధానమై చిత్రాలను అటవీశాఖ అధికారులకు అందిస్తుంది. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా కనెక్టివిటీ బాగుంటుంది.
అటవీశాఖ సిబ్బందికి 30 సెకన్‌ల లోపే ఫొటోలు చేరిపోతాయి. బ్యాటరీ లైఫ్, సైజుకు సంబంధించి ‘ట్రైల్‌గార్డ్ ఏఐ’ కెమెరాలు అత్యంత సమర్థమైనవి. అందువల్ల అవి దాదాపుగా వేటగాళ్లకు కనిపించవు. అడవులలో చాలాకాలం పాటు స్వయం సమృద్ధిగా పనిచేస్తాయి. ‘వేటగాళ్లను పట్టుకోవడానికి మా ఏఐ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది హృషిత. ఇప్పటివరకు ట్రైల్‌గార్డ్ ఏఐ సాంకేతికతతో ఇరవైమందికి పైగా వేటగాళ్లు అరెస్ట్ అయ్యారు.
వారికి పులులంటే భక్తి
‘కారిడార్ చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు పులులతో కలిసి జీవించడానికి సహాయపడేందుకు నిధులు సేకరించడమే మా లక్ష్యం. ఈ గ్రామాల ప్రజలకు పులులు అంటే ఎంతో భక్తిభావం ఉంది. వారి సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలతో పులులకు అనుబంధం ఉంది. పులి అంటే వారి దృష్టిలో ప్రమాదకరమైన జంతువు కాదు’ అంటుంది హృషిత నేగి.
పులులు నా ఆత్మీయులు
పులుల సంరక్షణ అనేది నా దృష్టిలో జంతువులకు సంబంధించిన అంశం కాదు. పులుల సంరక్షణ అనేది నా ఆత్మీయుల సంరక్షణకు సంబంధించిన విషయం అనుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకు పులులు అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తూ పెరిగాను. జీవవైవిధ్యం మునపెన్నడూ లేనంతగా క్షీణిస్తున్న కాలంలో మనం ఉన్నాం. పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించే కీలక జాతులను కాపాడుకోవాలి. వాటన్నింటిలో కెల్లా అత్యంత గంభీరమైన పులి జాతి గురించి ఆలోచించాలి.
– హృషిత నేగి


