బెంబేలెత్తిస్తున్న బెబ్బులి | Tiger changes route from Shankhavaram to Tallapalem | Sakshi
Sakshi News home page

బెంబేలెత్తిస్తున్న బెబ్బులి

Mar 16 2026 5:23 AM | Updated on Mar 16 2026 5:23 AM

Tiger changes route from Shankhavaram to Tallapalem

శంఖవరం నుంచి తాళ్లపాలెం వైపు రూటు మార్చిన పులి 

రెండు రోజులుగా మైదాన ప్రాంతంలోనే సంచారం 

భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు 

మత్తుమందిచ్చి బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు

ప్రత్తిపాడు రూరల్‌/శంఖవరం: పదహారు రోజులుగా పోలవరం, కాకినాడ జిల్లాల అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఐదు రోజులుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల పరిధిలో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. పులి ఒకసారి పశువుపై దాడి చేస్తే అక్కడే రెండు మూడు రోజుల పాటు ఉండి ఆ కళేబరాన్ని ఆహారంగా తీసుకుంటుంది. అయితే దానికి పూర్తి భిన్నంగా ప్రస్తుతం పులి వ్యవహరిస్తోంది. 

పూర్తిగా 24 గంటలు కూడా గడవక ముందే ఆ స్థావరం నుంచి నిష్క్రమిస్తోంది. ప్రత్తిపాడు మండలం తాడువాయి వద్ద గురువారం గేదె దూడపై పులి దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే తాడువాయి ప్రాంతంలో పులిని బంధించాలనుకున్న అధికారులు బోను ఏర్పాటు చేసి అందులో దూడను ఎరగా పెట్టారు. అధికారుల అంచనాలకు చిక్కకుండా అక్కడి నుంచి శుక్రవారం రాత్రి శంఖవరం మండలంలోని జి.కొత్తపల్లి చేరుకుని అక్కడ ఆవు దూడపై దాడి చేసింది. రోజంతా అక్కడే నివాసం ఉంది. 

ఊరకొండపైకి చేరుకుని.. 
అధికారులు భావించినట్టుగానే జి.కొత్తపల్లి నుంచి కొండేపూడి, వాడ్రేవు వెంకటాపురం మీదుగా శంఖవరంలోని తహశీల్దార్‌ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఊరకొండపైకి శనివారం రాత్రి పెద్దపులి చేరుకుంది. దీంతో అధికారుల బృందం శంఖవరం–కత్తిపూడి ప్రధాన రహదారిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టింది. ఇప్పటివరకు సాయంత్రపు వేళల్లో తన స్థానాన్ని మార్చుకుంటూ వచ్చిన పులి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకే ఊరకొండ పైనుంచి శంఖవరం–కత్తిపూడి ప్రధాన రహదారి దాటుకుని వేగంగా మండపం, తాళ్లపాలెం ­వైపు వెళ్లింది. 

అన్నవరం పంపా రిజర్వాయర్‌ వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని పశువులను సురక్షిత పాంతాలకు తరలించాలని, పొలాల్లో ఎవరూ ఉండవద్దని హెచ్చరించారు. పులి మెడలో అమర్చిన జీపీఎస్‌ రేడియో కాలర్‌ ద్వారా దాని కదలికలను అటవీశాఖ అధికారులు ట్రాక్‌ చేస్తున్నారు. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ సూచనల మేరకు పులికి మత్తు మందు ఫైర్‌చేసి బంధించేందుకు అటవీశాఖ రాపిడ్‌ రెస్క్యూ టీమ్స్, వెటర్నరీ డాక్టర్లు, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వ్‌ నిపుణుల బృందాన్ని అధికారులు అందుబాటులో ఉంచారు. 

కాగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో తాళ్లపాలెం, మండపం మధ్య గల కొండపై పెద్ద పులి ఉంది. పులి స్థావరానికి ఆనుకుని ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులను సురక్షిత ప్రాంతంలో ఉంచారు. పులి ప్రభుత్వ కార్యాలయాలకు ఆనుకుని ఉండటంతో ప్రజలు, అ«ధికారులు భయాందోళనకు గురయ్యారు. డీఎఫ్‌ఓ రామచంద్రరావు, ఏలేశ్వరం రేంజ్‌ అటవీశాఖ అధికారి దుర్గా రాంప్రసాద్, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీబాల, తహశీల్దార్‌ తాతారావు, ఎస్‌ఐ శ్రీహరిబాబు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

పులి కోసం హనుమాన్‌ బృందాలు
సాక్షి, అమరావతి: పులిని సురక్షితంగా పట్టుకోవడానికి ఎన్‌ఎస్‌టీఆర్, తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి 11 ప్రత్యేక ‘హనుమాన్‌’ బృందాలను రంగంలోకి దించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో ఉండి పులిని జనా­వాసాలకు దూరంగా పంపేందుకు, అవసరమైతే బంధించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పులి కదలికలను శాటిలైట్‌ రేడియో కాలర్, థర్మల్‌ డ్రోన్లు, సర్వైలెన్స్‌ డ్రోన్లు, జీపీఎస్‌ డేటా ద్వారా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement