సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బెబ్బులి బీభత్సం సృష్టించింది. బీడీ ఆకులు ఏరుకునడానికి అడవికి వెళ్లిన మహిళలపై తన పంజా విసిరింది. మెుత్తం 13 మంది మహిళలపై బెబ్బులి దాడి చేయగా అందులో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
చంద్రపూర్ జిల్లా గంజేవాహి అడవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మహిళలు బీడీ ఆకులు ఏరుకోవడానికి అడవికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే మాటు వేసిన పులి విచక్షణ రహితంగా వారిపై దాడి చేసింది. వారికి పారిపోయే అవకాశం ఇవ్వకుండా విరుచుకపడింది. మెుత్తంగా 13 మందిపై బెబ్బులి దాడి చేయగా అందులో నలుగురు మృతిచెందారు.
మృతిచెందిన వారు దాదాజి మెహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, కౌశిక్ మెుహర్లే, అనుబాయి దాదాజీ మెుహర్లేగా గుర్తించారు. దీంతో వివరాలు తెలుసుకున్న అడవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా ఇటీవల కాలంలో మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి.

ముఖ్యంగా చంద్రపుర్ జిల్లాలో పులుల సంఖ్య అధికంగా ఉండటంతో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం, మానవ నివాసాలు అటవీ ప్రాంతాలకు దగ్గర కావడం వంటి కారణాలతో పులులు గ్రామాల వైపు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పులుల భయం తగ్గేలా అటవీశాఖ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


